ఓటర్ల తుది జాబితా విడుదల

Wed,July 17, 2019 04:05 AM

జగిత్యాల/ధర్మపురి,నమస్తే తెలంగాణ/కోరుట్లటౌన్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కుల గణన, ఓటర్ల ముసాయిదా జాబితాను మున్సిపల్ అధికారులు వెల్లడించారు. ఇంటి నంబర్ల ఆధారంగా ఓటర్లను గుర్తించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. కాగా బుధ, గురువారాల్లో వాటిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 17న రాజకీయ పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహిస్తారు. 19న పోలింగ్ కేంద్రాల జాబితా, 21న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటిస్తారు. ఈ నెల 20 తర్వాత వార్డుల వారీగా రిజర్వేషన్‌ను ప్రకటించనున్నారు. మున్సిపల్ అధ్యక్ష, ఉపాధ్యక్ష రిజర్వేషన్లను మాత్రం ప్రభుత్వమే వెల్లడించనున్నది.

జగిత్యాల పట్టణ ఓటర్లు 80,325
జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 80,325 మంది ఓటర్లున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో బీసీ ఓటర్లు 65,166 ఉండగా, పురుషులు 32,069, మహిళలు 33,097మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 4,356, ఎస్టీ ఓటర్లు 444, ఓసీ ఓటర్లు 10,359 మంది ఉన్నట్లు ప్రకటించారు. గతంలో జగిత్యాల మున్సిపాలిటీలో 38వార్డులు ఉండేవి. శివారు ప్రాంతాలైన శంకులపల్లె, గోవిందుపల్లె, తారకరామానగర్, లింగంపేట గ్రామాలు విలీనం కావడంతో వార్డులు 48కి చేరి పోలింగ్ కేంద్రాలు కూడా పెరిగాయి. గతంలో 79 పోలింగ్ కేంద్రాలుండగా వాటిని 88కి పెంచారు.

కోరుట్లలో 53,868
కోరుట్ల పట్టణంలోని 33వార్డుల్లో మొత్తం 53,868మంది ఓటర్లున్నట్లు కమిషనర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బీసీ ఓటర్లు 44,778 మంది కాగా వీరిలో పురుషులు 21,794 మంది, మహిళలు 22,984 మంది ఉన్నట్లు తేల్చారు. ఓసీ ఓటర్లు మొత్తం 3,945 కాగా వీరిలో పురుషులు 2,097, మహిళలు 1,848 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు మొత్తం 4,367కాగా, వీరిలో పురుషులు 2,068, మహిళలు 2,299 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు మొత్త 778 కాగా పురుషులు 377, మహిళలు 401 మంది ఉన్నారు. మొత్తంగా 53,868మంది ఓటర్లలో పురుషులు 26,336, మహిళలు 27,532 మంది ఉన్నట్లు జాబితా ప్రకటించారు.

మెట్‌పల్లిలో40,723
మెట్‌పల్లిలో 26 వార్డులకు మొత్తం ఓటర్లు 40,723 మంది ఉన్నారు. వీరిలో 19,805మంది పురుష, 20,659మంది మహిళా ఓటర్లున్నారు. బీసీ ఓటర్లు 32,290 మంది కాగా వీరిలో మహిళా ఓటర్లు 16,608 , పురుష ఓటర్లు 15,682 మంది ఉన్నారు. ఎస్సీలు 4,656, ఎస్టీలు 441, ఓసీలు 3,077 మంది ఉన్నారు.

రాయికల్‌లో 11,880
రాయికల్ మున్సిపాలిటీలో 12వార్డులకు గానూ 11,880 మంది ఓటర్లున్నట్లు అధికారులు ప్రకటించారు. వీరిలో పురుష ఓటర్లు 5,646, మహిళా ఓటర్లు 6,234 మంది ఉన్నారు. బీసీ ఓటర్లు 9,244, ఎస్సీలు 1,392, ఎస్టీలు 101, ఓసీలు 1,143 మంది ఉన్నారు.

ధర్మపురిలో 12,374
ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని 15వార్డుల్లో 12,374 మంది ఓటర్లున్నట్లు లెక్క తేల్చారు. వీరిలో 6,362 మంది మహిళా ఓటర్లు, 6011మంది పురుష ఓటర్లున్నారు. బీసీ ఓటర్లు 9,384 మందికాగా, వీరిలో మహిళా ఓటర్లు 4,866, పురుష ఓటర్లు 4,517 మంది ఉన్నట్లు కమిషనర్ దివ్యదర్శన్‌రావు తెలిపారు. ఎస్సీ ఓటర్లు 1019 మంది కాగా, వీరిలో మహిళలు 548, పురుషులు 471మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు 166 మంది కాగా మహిళలు 80, పురుషులు 86 మంది ఉన్నారు. ఓసీ ఓటర్లు 1,805 కాగా, వీరిలో మహిళలు 868, పురుషులు 937మంది ఉన్నారు.

మూడు వార్డులకో ఎన్నికల అధికారి
మూడు వార్డులకు ఒక ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారిని నియమిస్తున్నారు. గెజిటెడ్ హోదా కలిగిన వారికి ఎన్నికల అధికారులుగా, నాన్‌గెజిటెడ్ సిబ్బందికి సహాయకులుగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. వార్డుల వారీగా నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, తదితర ప్రక్రియను వీరే పర్యవేక్షించనున్నారు.

నోడల్ అధికారుల నియామకం
మున్సిపల్ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు, సిబ్బందిని నోడల్ అధికారులుగా నియమిస్తున్నారు. వివిధ శాఖలకు చెందిన 10 మంది ఉన్నతాధికారులను నోడల్ అధికారులుగా నియమించి ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించారు. పోలింగ్ సిబ్బంది నియామకం, బ్యాలెట్ బాక్సుల సేకరణ, పర్యవేక్షణ, రవాణా సౌకర్యం, సిబ్బందికి శిక్షణ, ఎన్నికల సామగ్రి తయారీ, నిర్వహణ, బ్యాలెట్ పత్రాల తయారీ, ఎన్నికల ఖర్చుల వివరాల పర్యవేక్షణ, సమన్వయం, సహాయ కేంద్రం నిర్వహణ, పర్యవేక్షణ తదితర పనుల బాధ్యతలను నోడల్ అధికారులకు అప్పగించారు.

ఓటరు నమోదుకు అవకాశం
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు 18ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశముందని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దీంతో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశముంది.

విద్యార్థుల మధ్య ఘర్షణ
కోరుట్లటౌన్: పట్టణంలోని ఆదర్శనగర్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. బాదిత విద్యార్థి తండ్రి శంకర్ వివరాల ప్రకారం.. మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన సర్వేష్ స్థానిక సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. సోమవారం భోజనం చేసి ప్లేట్ కడుక్కునేందుకు నల్లా వద్దకు వెళ్లిన సర్వేష్‌పై శ్రావన్, విజయ్ అనే విద్యార్థులు దాడి చేశారు. దీంతో అంతర్గతంగా తీవ్రగాయాలైన విద్యార్థిని పాఠశాల వైద్య సిబ్బంది వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కరీంనగర్ తరలించారు. తన కొడుకుపై అకారణంగా దాడి చేసిన విద్యార్ధులపై చర్యలు తీసుకోవాలని బాదితుడి తండ్రి వేడుకుంటున్నాడు.

జగిత్యాలలో ఇద్దరు ఎస్‌ఐల బదిలీ
జగిత్యాల క్రైం: జగిత్యాల జిల్లాలో ఇద్దరు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ సింధు శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఐటీకోర్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులును కోరుట్ల ఎస్‌ఐగా, కోరుట్ల ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న రాజు నాయక్‌ను సీఎంఎస్ ఎస్‌ఐగా బదిలీ చేశారు. అదే విధంగా బుగ్గారం ఎస్‌ఐ రవికుమార్‌ను ఎస్పీకి అటాచ్ చేసినట్లు తెలిసింది.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles