పోలీస్ కొలువులు కొట్టేశారు..

Mon,July 15, 2019 01:59 AM

- జిల్లా నుంచి ఏడుగురు ఎస్సైలుగా ఎంపిక
- రఘునాథపల్లి నుంచే నలుగురు..
- ముగ్గురు పంచాయతీ కార్యదర్శులకు దక్కిన అదృష్టం
- సత్తాచాటిన అన్నదమ్ములు


రఘునాథపల్లి : జనగామ జిల్లా వ్యాప్తంగా ఏడుగురు ఎస్సై కొలువులు సాధించారు. రఘునాథపల్లి మండలం నుంచే నలుగురు ఎస్సైలుగా ఎంపికయ్యారు. ఈ నలుగురిలో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు కావడం విశేషం. శుక్రవారం రాత్రి టీఎస్‌ఎల్‌పీఆర్బీ వెబ్‌సైట్‌లో కటాఫ్‌లతో ఎస్సై జాబితా విడుదల చేశారు. రఘునాథపల్లి గ్రామానికి చెందిన గండ్ర సత్యనారాయణ స్వరూప దంపతుల కుమారుడు గండ్ర సంతోష్ ఏకశిల డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు. 2016లో పోలీస్ నియామకాల్లో ఎస్సై ఉద్యోగానికి ప్రయత్నం చేయగా ఈవెంట్స్‌లో అర్హత సాధించలేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఈసారి లక్ష్యాన్ని సాధించి సివిల్ ఎస్సై కొలువు కొట్టాడు. సంతోశ్ ప్రస్తుతం జనగామ మండలం వెంకిర్యాల పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదిలాఉండగా వెల్ది గ్రామానికి చెందిన పెండ్లి సంజీవరెడ్డి-భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు పెండ్లి నరేశ్ కమ్యూనికేషన్స్‌లో ఎస్సై ఉద్యోగం సాధించాడు. 2016లో నిర్వహించిన పోలీస్ నియామకాల్లో నరేశ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు. కానిస్టేబుల్ ఉద్యో గం చేస్తూనే అదేవిభాగంలో ఎస్సై ఉద్యోగం సాధించాడు.

దేవరుప్పుల రాష్ట్ర పోలీస్ శాఖ శనివారం విడుదల చేసిన ఎస్సై ఎంపిక ఫలితాల్లో మండలంలోని ధర్మాపురం గ్రామం మల్యాల తండాకు చెందిన అజ్మీరా రమేశ్ ఎస్సైగా ఎంపికయ్యారు. రాష్ట్రప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉద్యోగ ఫలితాల్లో రమేశ్‌కు పంచాయతీ కార్యదర్శిగా, కానిస్టేబుల్, ఎస్సైగా ఉద్యోగ అవకాశాలు రావడం విశేషం. రమేశ్‌కు ఎస్సై ఉద్యోగం రావడంపై మాల్యాల తండా గ్రామస్తులు అతడిని అభినందించారు.

ముగ్ధుంతండా గ్రామస్తుల హర్షం
జఫర్‌ఘడ్ : మండలంలోని ముగ్ధుంతండాకు చెందిన బానోత్ శివకుమార్ ఎస్సైగా ఎంపిక కావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు. గ్రామానికి చెందిన బానోత్ యాకూబ్, బుజ్జమ్మల కుమారుడు శివకుమార్ జార్ఖండ్‌లో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. తమ గ్రామానికి చెందిన విద్యార్థి శివకుమార్ ఎస్సైగా ఎంపిక కావడంపై సర్పంచ్ బానోత్ లక్ష్మి, ఉపసర్పంచ్ దేవా, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ స్వామి నాయక్, వార్డు సభ్యులు, గ్రామస్తులు శివకుమార్ ను అభింనందించారు.

కానిస్టేబుల్ నుంచి ఏఆర్‌ఎస్సైగా శేఖర్
తరిగొప్పుల : కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూనే ఏఆర్‌ఎస్సైగా ఎంపికయ్యాడు తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన గాలి వెంకటయ్య-కౌసల్య దంపతుల చిన్న కుమారుడు గాలి శేఖర్. 2009లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించిన అతడు తాజాగా ఏఆర్‌ఎస్సైగా ఎంపికయ్యాడు. ఎస్సైగా కావాలని కలలు కని అందుకు దొరికిన కొంత సమయాన్ని ఉపయోగించుకుంటూ మూడో ప్రయత్నంలో ఎస్సై ఉద్యోగాన్ని సాధించాడు.

సత్తాచాటిన అన్నదమ్ములు
రఘునాథపల్లి మండలలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన పుల్ల రవి-పద్మ దంపతుల ఇద్దరు కుమారులు పుల్ల సాయికిరణ్, పుల్ల సాయిచరణ్ ఎస్సై ఉద్యోగాలు సాధించారు. ఇప్పటికే సాయికిరణ్ జనగామ మండలంలోని చీటకోడూర్ పంచాయతీ కార్యదర్శిగా, సాయిచరణ్ లింగాలఘనపురం మండలం కిష్టగూడెం పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సాయికిరణ్ ఇప్పటికే పంచాయతీ కార్యదర్శితో పాటు బీట్‌ఆఫీసర్‌గా, ఏఎస్‌వో ఉద్యోగాలు సాధించాడు. ఇద్దరు అన్నదమ్ములు పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తుండగా ఎస్సై కొలువులు సాధించారు. ఎస్సై ఉద్యోగాలు సాధించిన వీరిని రఘునాథపల్లి ఎంపీపీ మేకల వరలక్ష్మి-నరేందర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు గ్రామస్తులు అభినందిస్తున్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles