భద్రకాళి బండ్ అద్భుతం..!

Wed,August 14, 2019 01:19 AM

వరంగల్, నమస్తేతెలంగాణ : చారిత్రక నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి దేవాలయం పక్కన భధ్రకాళి బండ్ అభివృద్ధి అద్బుతంగా ఉందని, కాకతీయుల కళా సంపద ఉట్టిపడేలా బండ్‌పై ఆర్చీల నిర్మాణం అబ్బురపరిచేలా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. భద్రకాళి బండ్‌ను కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, కమిషనర్ రవికిరణ్‌తో కలిసి ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించారు. భద్రకాళి బండ్‌పై చేస్తున్న అభివృద్ధిని కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ ఆయన వివరించారు. మొదటి దశలో 1.1 కిలోమీటర్లు మేరకు భద్రకాళి బండ్‌ను అభివృద్ధి చేస్తున్నామని, రెండో దశలో మరో 1.5 కిలోమీటర్ల బండ్‌ను అభివృద్ధి చేస్తామని ఆయన వివరించారు. భద్రకాళి చెరువును గోదావరి నీటితో నింపుతామని తెలిపారు. అలాగే పర్యాటకులకు కనువిందు చేసేలా చెరువులో 5 వాటర్ ఫౌంటేన్‌లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే భద్రకాళి దేవాలయం గుట్టకు రాక్‌షో ప్రదర్శన చేసేలా ప్రణాళికలు చేస్తున్నామని ఆయన వివరించారు. భద్రకాళి చెరువులో వాటర్ కర్టెన్(నీటి తెర) వచ్చేలా ఫౌంటెన్‌ను ఏర్పాటు చేసి దానిపై లెజర్‌షో ప్రదర్శన నిర్వహించేలా ప్రణాళికలు చేస్తున్నామని ఆయన ఎమ్మెల్యేకు వివరించారు. అధికారులతో కలిసి బండ్‌పై హరీశ్‌రావు కలియతిరిగారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వరంగల్‌లోని భద్రకాళి బండ్ అభివృద్ధిని చూసి సిద్దిపేటలో బండ్ అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో భధ్రకాళి బండ్‌ను సందర్శించానన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొదటి సారిగా భద్రకాళి బండ్‌పై సింథటిక్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారని, ఆదే తరహలో సిద్దిపేటలో కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

కాకతీయుల కళా సంస్కృతి ఉట్టిపడుతోంది
భద్రకాళి బండ్‌పై కాకతీయుల కళా సంస్కృతి ఉట్టిపడుతోందని హరీశ్‌రావు అన్నారు. బండ్‌పై ఏర్పాటు చేసిన ఆర్చీల నిర్మాణం పర్యాటకులను అబ్బురపరుస్తుందన్నారు. వేయిస్తంభాల దేవాలయం, రామప్పలోని శిల్పసంపదను మేళవింపుతో చెక్కిన ఆర్చీలు చాలా బాగున్నాయన్నారు. సహజసిద్ధమైన అందాలు ఉన్న భద్రకాళి బండ్ వరంగల్ ప్రజలకు వరమన్నారు. తెలంగాణ పండుగ బతుకమ్మ నాటికి బండ్ అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రారంభించాలని ఆయన సూచించారు. భద్రకాళి బండ్ వరంగల్ ప్రజలను ఆకట్టుకుంటుందని, భధ్రకాళి చెరువులో వాటర్‌పౌంటేన్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా బండ్‌పై పార్క్‌ను ఏర్పాటు చేసి ఆక్సిజన్ మొక్కలు పెంచాలని సూచించారు. వరంగల్ నగరానికి భద్రకాళి బండ్ ఐకాన్‌గా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

షూటింగ్ స్పాట్‌గా నిలుస్తుంది
భద్రకాళి బండ్ సినిమాలకు షూటింగ్ స్పాట్‌గా నిలుస్తుందని హరీశ్‌రావు అన్నారు. బండ్ అందాలు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఎంతోగానో ఆకట్టుకుంటున్నాయన్నారు. భద్రకాళి బండ్ అభివృద్ధిలో నిరంతరం కష్టపడుతున్న ప్రజాప్రతిధులు, అధికారులను అభినందించారు. ఆయనతోపాటు సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర రైతు రుణ విమోచన సమితి కన్వీనర్ నాగుర్ల వెంకటేశ్వర్లు, డిప్యూటీ మేయర్ ఖాజాసీరాజుద్దీన్, మాజీ ఎంపీపీ మార్నెని రవీందర్‌రావు, కుడా ప్లానింగ్ అధికారి అజిత్‌రెడ్డి, ఈఈ భీమ్‌రావు పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles