నేడే రాఖీ పౌర్ణమి

Thu,August 15, 2019 02:54 AM

జనగామ, నమస్తే తెలంగాణ, ఆగస్టు 14 : అన్న చేతికి తోబుట్టువు రక్ష కట్టి ఆశీస్సులు కోరడం మన సంప్రదాయం.. ఆమె నుదుట కుంకుమ తిలకం దిద్ది..అక్షింతలతో నేనున్నానంటూ అన్న భరోసా ఇవ్వడం ఆచారం.. ఇలా వారి పరస్పర ఆత్మీయతలకు, అనిర్వచనీయ అనుభూతులకు వేదిక రాఖీ పండుగ. ఏటా శ్రావణ పౌర్ణమి రోజు రక్షాబంధన్ (రాఖీ) పండుగను ఘనంగా నిర్వహించుకుంటునాత్నరు. రాఖీ పండుగపై పలు రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీకృష్ణుడికి ద్రౌపతి రాఖీ కట్టినట్లు మహాభారతం ద్వారా తెలుస్తున్నది. శిశుపాలుడిని వధించినప్పుడు శ్రీకృష్ణుని చేతికి గాయం అవడంతో పాండవుల పట్టమహిషి అయిన ద్రౌపది తన చీర అంచుని కొద్దిగా చింపి రక్తం కారకుండా కట్టు కట్టిందని, అప్పటి నుంచి శ్రీకృష్ణుడు ఆనందపడి ఆమెకు రక్షగా ఉంటానని వాగ్ధానం చేశాడని పురాణాలు తెలుపుతున్నాయి.

మార్కెట్లో సందడి..
జిల్లా కేంద్రంలో రాఖీ పండుగ సందడి నెలకొన్నది. అనేక రకాల బొమ్మలు తగిలించిన రాఖీలు మార్కెట్‌లో ఉన్నాయి. వీటి ధర రూ.40 నుంచి రూ.200 వరకు ఉన్నాయి. సాంకేతికతను జోడించిన రాఖీలు అందుబాటులోకి తీసుకొచ్చారు. రాఖీల్లో మ్యూజిక్, బల్పులు, ఏర్పాటు చేసినవి అందుబాటులో ఉన్నాయి. ధర రూ.200 నుంచి రూ.600 వరకు ఉన్నాయి. సాధారణ రకాలుగా కాకుండా ఈ ఏడాది మార్కెట్లో కట్టిపడేసే ఆకృతుల్లో రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. నెమళ్లు, శంఖుచక్రాలు, పక్షులు, వృక్షాలు ఇలా అనేక రకాలుగా ప్రకృతి రమణీయతను ప్రతిబింబించే ఆకృతుల్లో చిన్న, పెద్దసైజుల్లో లభిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా నుంచి నెహ్రుపార్కు వరకు, పోలీస్‌స్టేషన్ నుంచి రైల్వేస్టేషన్ సెంటర్ వరకు, బస్టాండ్ చిన్నగేటు నుంచి స్వర్ణకళామందిర్ వరకు ఏర్పాటు చేసిన రాఖీ దుకాణాలు ఆడపడుచులతో కిటకిటలాడుతున్నాయి. అలాగే పట్టణంలో మిఠాయిల దుకాణాలు వినియోగదారులతో కిక్కిరిసిపోతున్నాయి. అభిరుంచికి తగ్గట్లు వివిధ ఆకారాల్లో స్వీట్లు తయారు చేశారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles