ఆరోగ్యానికి భధ్రత

Sun,August 18, 2019 03:45 AM

-సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో అధునాతన పరికరాలు
-అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు
-సాధారణ కాన్పులను ప్రోత్సహిస్తున్న అధికారులు
-మూడు మాసాల్లో 293 సాధారణ ప్రసవాలు
-కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కొనసాగుతున్న శస్త్ర చికిత్సలు
-ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పెరుగుతున్న రోగులు
జనగామ టౌన్, ఆగస్టు 17: ప్రభుత్వ దవాఖానలకు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన సంస్కరణలే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలోని ప్రభుత్వ వైద్యశాలల్లో ఇటు సౌకర్యాలు లేక.. అటు డాక్టర్ల కొరతతో పేదలకు వైద్యం అందని ద్రాక్షగానే మిగిలేదు. ఎప్పుడైతే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిందో.. సీఎం కేసీఆర్ సర్కార్ వైద్యానికి పెద్దపీట వేశారు. పెద్దాస్పత్రుల నుంచి మొదలు.. సబ్‌సెంటర్ల వరకూ మెరుగైన సౌకర్యాలు, అధునాతన వైద్య పరికరాలు అందిస్తున్నారు. అంతేకాకుండా వైద్యుల కొరతను తీరుస్తున్నారు. అవసరమైన మందులు సమకూరుస్తున్నారు. తద్వారా సర్కారు వైద్యం పొందుతున్న రోగుల సంఖ్య దినదినం పెరుగుతూ వస్తున్నది. చిన్న జబ్బు చేసినా జనం ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. పీహెచ్‌సీల్లో అధునాతన సదుపాయాలు కల్పించి మెరుగైన వైద్య సేవలు అందించడంతో ప్రభుత్వ దవాఖానలపై జనాలకు భరోసా ఏర్పడింది. గతంలో ఒక్కో పీహెచ్‌సీలో రోజుకు 10 నుంచి 20 మంది మాత్రమే ఆరోగ్య పరీక్షలు చేయించుకునేవారు. నేడు ఆ సంఖ్య 150 నుంచి 170కి చేరినట్లు వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో ప్రధానంగా పాలకుర్తి పీహెచ్‌సీ, స్టేషన్‌ఘన్‌పూర్ సీహెచ్‌సీ వైద్య సేవల్లో ముందు వరుసలో ఉన్నాయి.

ప్రజారోగ్యానికి పెద్దపీట
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడంతో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నది. ఒకప్పుడు సర్కారు దవాఖాన అంటేనే జనం చీదరించుకునే వారు.. ఇప్పుడు పీహెచ్‌సీల బాట పడుతున్నారు. పీహెచ్‌సీల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుండడమే ఇందుకు నిదర్శనం. మారుమూల గ్రామాల్లో సైతం ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లను నియమించడంతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. అంతేగాకుండా అత్యవసర సేవలకు రోగులను పీహెచ్‌సీలకు తరలిస్తూ.. నెలలో ఒకరోజు వృద్ధులకు, క్యాన్సర్ పేషంట్లకు గ్రామాల్లోనే పాలియేటివ్ కేర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

పెరిగిన ఓపీ రోగుల సంఖ్య
జిల్లాలో 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అందులో 16 కేంద్రాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. జనగామ మండలం ఓబుల్‌కేశ్వపూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పీహెచ్‌సీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. అదేవిధంగా జనగామ అర్బన్ పట్టణ ఆరోగ్యకేంద్రంతోపాటు బచ్చన్నపేట, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 115 ఆరోగ్య ఉపకేంద్రాలు ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్నాయి. ప్రధానంగా పాలకుర్తి, స్టేషన్‌ఘనపూర్, బచ్చన్నపేట సీహెచ్‌సీలకు అత్యాధునిక టెక్నాలజీకి అనుగుణంగా స్కానింగ్, బీపీ, ఎక్స్‌రే, ఈసీజీతోపాటు పలు ఆధునిక రక్తముత్ర పరీక్షల పరికరాలను ప్రభుత్వం అందించింది. ఇక్కడ వైద్యులతోపాటు సిబ్బంది గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందజేస్తుండడంతో ప్రజలు పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారు. రఘునాథపల్లి, నిడిగొండ, పాలకుర్తి, జఫర్‌ఘడ్, దేవరుప్పుల, కోమళ్ల, నర్మెట్ట, లింగాలఘనపురం, మల్కాపుర్, కునూర్, కొడకండ్ల పీహెచ్‌సీల్లో ఈ రెండేళ్లలో వైద్య సేవలు మెరుగుపడ్డాయి. ఇక్కడ పని చేసే వైద్య సిబ్బందికి వాట్సాప్ అటెండెన్స్ అమలు చేయడంతో తప్పనిసరిగా సమయపాలన పాటిస్తున్నారు. పలు మండలాల్లోని పీహెచ్‌సీల్లో 24 గంటల వైద్య సేవల కోసం ఇద్దరు డాక్టర్లను నియమించడంతో నిత్యం వైద్య సేవల కోసం 150 నుంచి 170 వరకు పేషెంట్లు వస్తున్నారు.

సాధారణ ప్రసవాలకే మొగ్గు..
గర్భిణులు ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్తే నేటి రోజుల్లో ఆపరేషన్లు తప్పనిసరి అయ్యాయి. కానీ, ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలకే వైద్యులు మొగ్గచూపుతున్నారు. అలాగే, సర్కార్ వైద్యశాలల్లో ప్రసవాలు చేసుకున్న వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నది. కేసీఆర్ కిట్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. పీహెచ్‌సీలో వైద్యం చేయించుకునేలా ఏఎన్‌ఎంలు, వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతినెలా విధిగా గర్భిణులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ.. తల్లీబిడ్డల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. అంతేకాకుండా గర్భిణుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేస్తున్నారు. ప్రసవ సమయం వచ్చిన వెంటనే దవాఖానకు రావాలని గర్భిణులకు ముందస్తు సమాచారం అందిస్తున్నారు. ఇలా సర్కార్ దవాఖానల్లో అన్ని రకాల సదుపాయాలు ఉండడంతో మూడు నెలల నుంచి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు.

మూడు నెలల్లో 293 ప్రసవాలు..
గతంలో పీహెచ్‌సీల్లో నెలకు సగటున 2 నుంచి 3 మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో ప్రసవాలు జరిగేవి. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిం ది. మూడు నెలల్లో ఇప్పటివరకు 293 ప్రసవాలు జరిగినట్లు జిల్లా వైద్యులు తెలిపారు. అంతేకాకుండా అపెండిసైటిస్‌తోపాటు స్త్రీలల్లో వచ్చే గర్భకోశ వ్యాధుల సంబంధిత శస్త్రచికిత్సలు స్థానిక పీహెచ్‌సీలోనే చేస్తున్నారు. గతంలో ఇటువంటి తరహా వైద్యసేవలు పీహెచ్‌సీలో అందుబాటులో ఉండేవికావు. దీంతో రోగులు జిల్లాకేంద్రాల్లోని ప్రైవేటు వైద్యశాలలను సంప్రదించి ఆర్థికంగా నష్టపోయేవారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పీహెచ్‌సీల్లోనే మెరుగైన వైద్యసేవలు అందిస్తూ ఆరోగ్యానికి భరోసా ఇస్తోంది. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య, సంక్షేమ పథకాలపై గ్రామాల్లో ప్రజలకు వైద్యాధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అలాగే, పీహెచ్‌సీలు ఆహ్లాదానికి నిలయంగా మారాయి. ఫలితంగా రోగులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మొత్తంగా ఆధునిక వైద్యానికి కేంద్రాలుగా నిలుస్తున్న పాలకుర్తి, స్టేషన్‌ఘనపూర్, బచ్చన్నపేట సీహెచ్‌సీలను రాష్ట్ర వైద్యాధికారులు గుర్తించారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles