ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టాలి


Sat,September 14, 2019 01:46 AM

- గ్రామాల్లో నీటి పొదుపు పాటిద్దాం
- నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యత
- ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, రాజయ్య, జెడ్పీచైర్మన్ సంపత్‌రెడ్డి
- వడ్లకొండలో జలశక్తి అభియాన్ కిసాన్‌మేళా
- హాజరైన కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి


జనగామ రూరల్, సెప్టెంబర్13 : కరువుసీమ జనగామ జిల్లాలో జలసిరులు గలగలపారేలా భూమిపై నుంచి రాలిపడే ప్రతీ వర్షపు నీటి బొట్టు వృధాగా పోకుండా భూగర్భంలో ఇంకేలా ఒడిసిపట్టే బృహత్తర కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంలో చేపట్టాలని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. మండలంలోని వడ్లకొండ ఎస్‌ఆర్ గార్డెన్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జలశక్తి అభియాన్ కిసాన్ కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. జెడ్పీచైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ గాంధీనాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏడవెల్లి క్రిష్ణారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి హాజరైన మేళాలలో వారు మాట్లాడుతూ జనగామకు కెరాఫ్‌గా తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడే ఎగువప్రాంతాన్ని కేంద్రం జలశక్తి అభియాన్ కింద ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడి కరువు, దుర్భిక్ష పరిస్థితులు దేశం గుర్తించిందని, అయితే అధికారులు, ప్రజల నీటి సంరక్షణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు. ఇప్పటికే నీటి సంరక్షణ కోసం జిల్లాలో రూ.2కోట్లు చేశామని, భూగర్భంలో నీటి జాడల కోసం 750 నుంచి 1000 ఫీట్ల వరకు బోరు వేయాల్సి వస్తుందన్నారు. భూగర్భంలో జలసంపద అడుగంటి పోవడానికి ప్రధాన కారణం అడవుల శాతం తగ్గిపోయి వర్షాలు సమృద్ధిగా కురియక పోవడం అన్నారు.

లభ్యమవుతున్న నీటిని పొదుపుగా వాడుకుంటూ వర్షం కురిసిన సమయంలో ప్రతీ చుక్కను కాపాడుకుంటే తప్ప భవిష్యత్ ఉండదన్నారు. నీటి సంరక్షణ పనులు చేపట్టాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నదని అందుకే వరుణుడు కరుణించినప్పుడే ఒడిసిపట్టుకునే చర్యలను ప్రారంభించాలన్నారు. ఒకపక్క ఉన్న నీటిని కాపాడుకుంటూ మరొపక్క వర్షపునీరు వృధాగా పోకుండా సంరక్షించుకునే దిశగా గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగాలని కోరారు. పంటలకు కోతుల వల్ల తీవ్రనష్టం వాటిల్లుతుందన్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కోతుల బెడద నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయం ప్రధాన వృత్తిగా జీవించే రైతులకు మరింత అండగా నిలిచేందుకు ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయం, అనుబంధంగా మరిన్ని పనులకు అనుసంధానం చేయాలని కోరారు. నీటిని వృథా చేయకుండా వేస్టేజీ వాటర్‌ను సైతం సద్వినియోగం చేసుకునేలా అధికారుల సూచనలు పాటించి రాబోయే తరాలకు కానుక ఇవ్వాలన్నారు. చెట్లను పెంచినట్లయితే సకాలంలో వర్షాలు కురుస్తాయని, రైతుల భూముల్లో ఫాంపాండ్‌లు, ఇంకుడుగుంతలు తప్పని సరిగా నిర్మించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్నా 30రోజుల కార్యక్రమంలో గ్రామంలోని పారుశుధ్యం, నీటి సంరక్షణ చర్యలు తీసుకోని కరువు జిల్లా పేరును తీసేయాలని అందుకు తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించాలని రైతులను కోరారు.

జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి మాట్లాడుతూ కరువు జిల్లా అని ఇక్కడి వారందరికి తెలుసు కరువును పారదోలడానికి విరివిగా చెట్లను నాటి, వాననీటిని ఒడిసిపట్టాలన్నారు. అందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోని కాలేశ్వరంలో నీటిని ఒడిసిపట్టినట్లు ప్రజలు వాన నీటిని ఒడిసిపట్టి నీటి నిల్వలను పెంపొందించుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతీ ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకుని ప్రతీ నీటి బొట్టు బయటకు పోకుండా భూమిలోపలికి పోయేటట్లు చేసుకోవాలని తెలిపారు. గిరిజన కార్పోరేషన్ చైర్మన్ గాంధీనాయక్ మాట్లాడుతూ కేంద్రం జిల్లాను జలశక్తి అభియన్ పథకంలో ఎంపిక చేయడం బాగుందని, కానీ వెనకబడిన కొడకండ్ల మండలాన్ని జలశక్తి అభియాన్‌లో ఎంపిక చేసుకోలేకపోవడం బాధగా ఉందన్నారు. కలెకర్ట్ గారు స్పందించి కొడకండ్ల మండలాన్ని చేర్చే విధంగా కృషి చేయాలన్నారు. రైతులు కోతులు తీనని మొక్కలు నాటుకోని జిల్లాలో అడవులు పెంచుకుంటూ సీఎం కళలు కన్న బంగారు తెలంగాణను చేసుకోవచ్చన్నారు.

నీటి వినియోగంపై అవగాహన ఉండాలి
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ నీటి వినియోగంపై అవగాహన కలిగిఉండాలన్నారు. ప్రభుత్వం జిల్లాను జలశక్తి అభియాన్‌లో ఎంపిక చేసింది బాగానే ఉందికానీ 9మండలాలు మాత్రమే చేయడం కొంత ఇబ్బందిగా ఉందన్నారు. కరువు జిల్లా అయిన జనగామను మొత్తం మండలాలు తీసుకుంటే బాగుండేదన్నారు. వానలు కురవాలంటే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని ఎక్కడ ప్రభుత్వ భూములు వున్న అక్కడే అడవిలో ఉండే విధంగా మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాలని చెప్పారు. ప్రతీ ఇంటిలో ఆరు మొక్కలు నాటుకోవాలని, ఇంటి ప్రాంతాల్లో ఖాలీ లేకుంటే రోడ్లకిరువైపుల, ప్రభుత్వ భూమిలో ఆరుమొక్కలు నాటి వాటిని ప్రతి రోజు సంరక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుల్‌మోర్ మొక్కలు నాటుకోంటే త్వరగా పెరుగుతాయని ప్రతి ఒక్కరూ వాటినే నాటుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు చర్చించుకుని జల సంరక్షణ కోసం అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. యువత, స్వచ్ఛంద సంస్థలు జలసంరక్షణపై గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం జలశక్తి అభియాన్ పోస్టర్లును ప్రజా ప్రతినిధులు, అధికారులు అవిష్కరించారు. జలసవరక్షణపై అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు జల్ అందోళన్ ప్రతిజ్ఞ చేశారు.

పోషణ అభియాన్‌పై జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతి పద్మ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతి పద్మమాట్లాడుతూ పోషణ లోపం..రక్తహీనత..తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్యను తగ్గించేందుకు గర్భిణులు బలవర్థకమైన ఆహారం తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీవో ప్రేమలత, పోషణ్ అభియాన్ జిల్లా కో ఆర్డినేటర్ రాజశేఖర్‌రెడ్డి, అప్సర్, పాఠశాల ప్రిన్సిపాల్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.కాగా జలశక్తి అభియన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కిసాన్ మేళాలొ వివిధ శాఖల అధ్వర్యంలో నిర్వహించిన స్టాల్స్ ప్రదర్శన రైతులు, ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చెర్ పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు గూడూరు రాంరెడ్డి, డీపీవో వెంకటేశ్వరరావు, పశుసంవర్థకశాఖ అధికారి భిక్షపతి, హార్టికల్చర్ అధికారి లత, డీడబ్లువో జ్యోతి పద్మ, జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డీనేటర్ ఇర్రి రమాణారెడ్డి, వ్యవసాయ అధికారి వీరునాయక్, ఎంపీపీ మేబైకల కలింగరాజు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల రైతు సమన్వయ కొఆ ర్డీనేటర్లు, శాస్త్రవేత్తలు డాక్టర్ నర్సింహ, అరుణజ్యోతి, సౌమ్య, బాలాజీ, కుమారస్వామి, సర్పంచులు, ఎంపీటీసీలు రైతు గ్రామ సమన్వయ సమితి సభ్యులు, మహిళ సంఘాల సభ్యు లు, వ్యవసాయ మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

56

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles