పుష్కలంగా యూరియా


Wed,September 18, 2019 02:39 AM

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:జిల్లాకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి. అడిగిన వారికి అడిగినన్ని ఎరువు బస్తాలను అధికారులు అందిస్తున్నారు. పంటలకు తగినన్ని ఎరువు నిల్వలు ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే, అన్నదాతలు పంటల సాగులో బిజీగా ఉండే ఈ కాలంలో ఏటా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. యూరియా కొరత లేకుండా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నది. కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం వ్యాపారులు చేసినా ప్రభుత్వం అక్రమార్కులకు అవకాశం ఇవ్వలేదు. దీంతో రైతన్నలకు కావల్సినంత యూరియా అందుబాటులోకి వచ్చింది.


ముందస్తు చర్యలు
స్వరాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లాకు కావల్సిన ఎరువులు అందుబాటులోకి వచ్చేలా ఉన్నతాధికారులను పురమాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో రోజుల తరబడి క్యూలో నిలబడితే ఒకటో రెండో బస్తాలు లభించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ సీజనల్లో సాగుకు అవసరమైన యూరియాను దిగుమతి చేసుకుంది. ప్రత్యేక గూడ్స్ రైళ్లలో వరంగల్‌కు చేరుకుంది. అక్కడి నుంచి ఎరువులు జిల్లా కు లారీల ద్వారా చేరాయి. జిల్లాకేంద్రం నుంచి అవసరమైన చోటుకు సంబంధిత అధికారులు తరలించే ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితలు ప్రత్యేక రాష్ట్రంలో తలెత్తకుండా టీఆర్‌ఎస్ సర్కార్ పకడ్బందీ చర్యలు చేపట్టి సఫలమైంది. వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తుండడంతో యూరియాకు డిమాండ్‌కు ఏర్పడింది. చెరువులకు జలకళ సంతరించుకుని సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో ఎరువుల వినియో గం ఎక్కువైనా కొరత లేకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్నది. ఎరువుల కొరత ఉందని తప్పుడు ప్రచారం వల్ల రైతులు ఆందోళన చెంది యూరియా పంపిణీ కేంద్రాల వద్దకు వెళ్లి క్యూ కడుతున్నారు. అవసరానికి మించి కొనుగోలు చేసి ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారని వ్యవసాయశాఖ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

16,576 మెట్రిక్ టన్నుల యూరియా
జిల్లాలో ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్‌లు) ఉన్నాయి. మార్క్‌ఫెడ్ నుంచి యూరియా చేరడంతో సొసైటీలకు పంపిణీ బాధ్యత అప్పగించారు. సంఘాల పరిధిలో అవసరమైన మేరకు ఎరువుల పంపిణీ ప్రక్రియను వ్యవసాయశాఖ అధికారులు చేపట్టారు. సోమవారం నాటికి సంఘాల్లో 250 మెట్రిక్ టన్నులు, డీలర్ల వద్ద 900 మెట్రిక్ టన్నులు.. మొత్తం 1150 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. జిల్లాలో 138 మంది డీలర్లు ఉన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు 12,500 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రాగా, సెప్టెంబర్ మాసంలో 4076 మెట్రిక్ టన్నులు దిగుమతైంది. మొత్తం ఈ సీజన్‌లో 16,576 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరింది. జిల్లాకు వచ్చిన యూరియాను అధికారులు సంఘాలకు, డీలర్లకు కేటాయిస్తారు. పరిస్థితిని బట్టి సంఘాలకు ఎంత మేర పంపిణీ చేయాలి.. డీలర్లకు ఎంత మొత్తం పంపిణీ చేయాలో నిర్ణయిస్తారు. సాధారణ సమయంలో వచ్చిన ఎరువులో సగం సంఘాలకు, మిగితా సగం డీలర్లకు కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు. కొరత ఉందని భావిస్తే అధిక మొత్తం ఎరువులను సంఘాలకే కేటాయిస్తామని అధికారులు తెలిపారు. జిల్లాలో 89,661 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఈ పంటల కోసం 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఇప్పటికే 16,576 మెట్రిక్ టన్నులను దిగుమతి చేసుకున్నారు. మిగిలిన యూరియాను అవసరానికనుగుణంగా తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

51

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles