క్రీడలపై మక్కువ పెంచుకోవాలి


Fri,September 20, 2019 02:27 AM

-జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య ముగిసిన ఎస్‌జీఎఫ్ క్రీడలు
జనగామ టౌన్, సెప్టెంబర్ 19: క్రీడలపై మక్కువ పెంచుకుని, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ జిల్లా పేరును నిలబెట్టాలని డీఈవో యాదయ్య సూచించారు. రెండు రోజులుగా జనగామ పట్టనంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో జరుగుతున్న 65వ ఎస్‌జీఎఫ్ క్రీడోత్సవాలు గురువారం ముగిశాయి. ముఖ్య అతిథిగా డీఈవో హాజరై ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు ప్రశంసపత్రాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రీడలతో మానసికోల్లాసం కలుగడంతోపాటు దేహదారుఢ్యం పెంపొందుతుందని తెలిపారు. క్రీడా నైపుణ్యాలు ప్రదర్శిస్తే జిల్లాస్థాయిలోనే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులకు ఎల్లప్పుడూ తనవంతు సహకారం ఉంటుందన్నారు. అలాగే, క్రీడాకారులు పాఠశాలల్లో కేటాయించిన సమయంలో క్రీడలపై మరింత ఆసక్తిని కనబరిస్తే ప్రతిభవంతులుగా తయారవుతారని సూచించారు. గురువారం జరిగిన అండర్-17 బాలబాలికల విభాగంలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించారు. ఇందులో జిల్లాలోని 12 మండలాల నుంచి 870 మంది బాలబాలికలు పాల్గొన్నారు. 114 మందిని ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణగౌడ్, పీఈటీలు గంగిశెట్టి ప్రమోద్‌కుమార్, మల్లికార్జున్, సత్యనారాయణ, అశోక్, రవికుమార్, కుమార్, నరేందర్, రవి, సంపత్, నవీన్, శ్రీనివాస్, కిషన్ పాల్గొన్నారు.

53

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles