ప్రణాళిక పండుగలా సాగాలి


Fri,September 20, 2019 02:28 AM

స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం అమలు చేస్తున్న 30 రోజుల పల్లె ప్రణాళిక పండుగలా సాగాలని స్టేషన్‌ఘన్‌ఫూర్ ఆర్డీవో రమేశ్ అన్నారు. గురువారం మండలకేంద్రంలోని స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీవో కుమారస్వామి అధ్యక్షతన ప్రత్యేకాధికారులు, సిబ్బందితో 30 రోజుల ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రమేశ్ ప్రత్యేకాధికారులకు, సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత అధికారులు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చాలని ఆదేశించారు. ఇంకుడుగుంతలు, మరుగుదొడ్లు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు నిర్మించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలలో శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లు, పాడుబడిన పాత బావులు, రోడ్ల పైన వర్షపు నీటి నిల్వలు ఉన్న గుంతలు, ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చిమొక్కలు తొలగించేలా చూడాలన్నారు. అలాగే ప్రతీ గ్రామంలో వీధి దీపాలను ఏర్పాటు చేయాలన్నారు.


గ్రామాల్లో చేపడుతున్న పనులను పరిశీలించేందుకు రాష్ట్రస్థాయి అధికారులు జిల్లాకు వస్తున్నట్లు తెలిపారు. నెల రోజుల పాటు నిర్వహించే పరిశుభ్రత కార్యక్రమాలు నిరంతరం కొనసాగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో తనిఖీకి వచ్చే ప్రత్యేక బృందాలకు మార్పు కనిపించాలని తెలిపారు. అనంతరం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం సిబ్బంది సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, డీఈ కరణ్‌కుమార్, మండల పంచాయతీ అధికారి మహాబూబ్ అలీ, మండల పశువైద్యాధికారి వినయ్‌కుమార్, ప్రత్యేకాధికారులు, సిబ్బంది, వీఆర్‌ఏ అనిల్, రాము, తదితరులు పాల్గొన్నారు.

53

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles