పల్లెల్లో ప్రగతి జాతర


Mon,September 23, 2019 07:22 AM

-17వ రోజుకు చేరిన కార్యాచరణ ప్రణాళిక
-జిల్లాలో యుద్ధప్రాతిపదికన శ్రమదానాలు
-ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజలు
-జనగామ మండలంలో కలెక్టర్ పర్యటన
-గ్రామాల్లో అధికార యంత్రాగం పల్లె నిద్ర


జనగామ రూరల్ : గ్రామాల్లో ప్రభుత్వం అమలుచేస్తున్న 30 రోజుల ప్రణాళిక ముగిసేలోపు గ్రామాల రూపురేఖలు మారాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వడ్లకొండ, గానుగుపహాడ్ గ్రామాల్లో జరుగుతున్న గ్రామ ప్రణాళిక కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనీఖీ చేసి గ్రామంలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళికలో సూచించిన విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాభివృద్ధిలో స్థాయిసంఘాలు, కోఆప్షన్ సభ్యులతో పాటు గ్రామస్తులను భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రతీ ఇంట్లో మొక్కలు నాటుకోవాలని, గ్రామపంచాయతీల ద్వారా మొక్కలను నాటిన వాటికి సంరక్షకులను నియమించాలని తెలిపారు. గ్రామంలో ఎక్కడా చెత్తాచెదారం, మురుగునీరు కనబడకుండా చూసుకోవాలని గ్రామస్తులకు సూచించారు.

గ్రామంలో డంపింగ్‌యార్డులు, శ్మశానవాటికలు నిర్మించుకోవాలని, చెత్త తరలింపునకు ట్రాక్టర్, మొక్కలకు నీరుపోసేందుకు ట్యాంకర్‌ను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పాతగోడలు, పడావుపడిన బావులు, కంపచెట్లు, పిచ్చి మొక్కలు లేకుండా చేయాలన్నారు. అందుకు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఇదిలాఉండగా గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. ప్రతీ ఇంటిని మనమే శుభ్రపరుచుకోవాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వరరావు, ఎంపీడీవో ఎండీ హసీం, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు బొల్లం శారదస్వామి, ఎంపీటీసీ బొల్లం బాలసిద్ధులు, ఎంపీవో సంపత్, గానుగుపహాడ్ సర్పంచ్ శానబోయిన శ్రీనివాస్, ఎంపీటీసీ రెడ్డబోయిన పద్మ, గ్రామాల ప్రత్యేక అధికారులు శ్రీనివాస్, రవిప్రసాద్, ఉపసర్పంచ్ గాదె అనిల్, పంచాయతీ కార్యదర్శి ప్రవళిక, ఫీల్డ్ అసిస్టెంట్ అనిత, వార్డుసభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

59

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles