విలీన పల్లెలకు మహర్దశ

Thu,July 11, 2019 05:39 AM

(జయశంకర్ జిల్లా ప్రతినిధి-నమస్తే తెలంగాణ)భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామాలకు మహర్దశ పట్టనుంది. భూపాలపల్లి సహా విలీన గ్రామాల్లో రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డబ్ల్యూబీఎం, సీసీ రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.27.74 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే ఇంజినీరింగ్ అధికారులు రూ.5.37 కోట్లతో సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. త్వరలో ఈ పనులు మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మిగతా రూ.22.37 కోట్లతో డబుల్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, డబ్ల్యూబీఎం, సీసీ రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించేందుకు కసరత్తు చేపట్టారు. సాధ్యమైనంత త్వరలో ఈ టెండర్ల ప్రక్రియ నిర్వహించి పనులు ప్రారంభించే దిశలో అడుగులు వేస్తున్నారు. ముందెన్నడూ లేని రీతిలో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఇప్పుడు నిధులు రావడం విశేషం. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చొరవతో ఇది సాధ్యమైంది. కొద్ది రోజుల క్రితం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిసి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఈ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తుంది.

ప్రధానంగా ఇక్కడి విలీన గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ గ్రామాలను భూపాలపల్లి మున్సిపాలిటీలో విలీనం చేసే సమయంలో ఈ గ్రామాల ప్రజల్లో కొందరు నిరసన తెలిపారు. మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల తమ గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామాలను పంచాయతీలుగానే కొనసాగించాలని అన్నారు. వీరి వాదనకు అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఏకీభవించలేదు. మున్సిపాలిటీలో విలీనం కావడం వల్ల ఈ గ్రామాలు అభివృద్ధికి నోచుకుంటాయని అన్నారు. స్థానికులకు నచ్చజెప్పి వారి ఆమోదంతో గ్రామాలను భూపాలపల్లి మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు విలీన గ్రామాలు అభివృద్ధి దిశలో పరుగు పెడుతున్నాయి. ఎమ్మెల్యే గండ్ర ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ విలీన గ్రామాల అభివృద్ధికి నిధుల వరద పారిస్తుంది. ఐదేళ్ల క్రితం భూపాలపల్లి, జంగేడు, కాసింపల్లి, వేశాలపల్లి, పుల్లూరిరామయ్యపల్లి గ్రామ పంచాయతీలతో భూపాలపల్లి నగర పంచాయతీ ఆవిర్భవించింది. అప్పట్లో ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రభుత్వ చీఫ్‌విప్‌గా పని చేశారు. ఆయన చేసిన విలీన ప్రతిపాదనపై ఆ సమయంలో కాసింపల్లి, జంగేడు, వేశాలపల్లి, పుల్లూరిరామయ్యపల్లి గ్రామ పంచాయతీల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజల్లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీగా కొనసాగితేనే తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. ఈ వాదన సరికాదన్న ఎమ్మెల్యే గండ్ర విలీనం కావడం వల్ల కచ్చితంగా అభివృద్ధి చెందుతాయని, ప్రభుత్వం నుంచి ఆశించిన నిధులు వస్తాయని సదరు గ్రామాల ప్రజలకు చెప్పారు. దీంతో విలీనం కోసం ఈ గ్రామాల ప్రజలు ఆమోదం తెలిపారు.

విలీనం తర్వాత మొదటిసారి 2014లో భూపాలపల్లి నగర పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. విజయం సాధించి కొలువుదీరిన పాలకవర్గం పదవీ కాలం గడువు ఈ నెల 2న ముగిసింది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఐదేళ్లు తిరుగకముందే భూపాలపల్లి నగర పంచాయతీ మున్సిపాలిటీగా అవతరించింది. ఈ మేరకు ఏడాది క్రితం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలు భూపాలపల్లి మున్సిపాలిటీకి మొదటివి కానున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధమైన ప్రభుత్వం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో వార్డుల పునర్విభజన చేసింది. దీంతో ఇక్కడ వార్డుల సంఖ్య 30కి పెరిగింది. గతంలో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 20వార్డులు ఉంటే పునర్విభజనతో కొత్తగా మరో పది వార్డులు ఏర్పడ్డాయి. మొత్తం 30 వార్డుల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అంతకుముందు నుంచే స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ మున్సిపాలిటీ పరిధిలో పర్యటించి ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా రహదారుల విస్తరణ, డివైడర్లతో కూడిన సెంట్రల్ లైటింగ్, డబ్ల్యూబీఎం, సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ల నిర్మాణం, తాగునీటి సరఫరాకు ప్రతిపాదనలు తయారు చేసి కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఫలితంగా తాము ఆశించిన అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు కావడంతో భూపాలపల్లి సహా విలీన గ్రామాల ప్రజలు సంబురపడుతున్నారు. విలీన సమయంలో ఎమ్మెల్యే గండ్ర చెప్పిందే నిజమైందని మురిసిపోతున్నారు.

చేపట్టనున్న పనులు ఇవే..
తాజాగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో ఎమ్మెల్యే గండ్ర ప్రతిపాదనల మేరకు రహదారుల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, డబ్ల్యూబీఎం, సీసీ రోడ్లు, జంక్షన్ల నిర్మాణానికి ప్రాధా న్యం ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనుల కోసం మంజూరైన రూ.27.74కోట్లలో ఎక్కువగా ఈ పనులే ఉండటం గమనార్హం. జంగేడు నుంచి వేశాలపల్లిలోని డబుల్ బెడ్‌రూం ఇళ్ల వరకు డబుల్ రోడ్డు, డివైడర్స్, సెంట్రల్ లైటింగ్ సిస్టం కోసం రూ.2 కోట్లు, పుల్లూరిరామయ్యపల్లి నుంచి కొంపల్లి వరకు డబుల్ రోడ్డు, డివైడర్స్, సెంట్రల్ లైటింగ్ సిస్టం కోసం రూ.5.30 కోట్లు, సెగ్గంపల్లి నుంచి కాసింపల్లి వరకు డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ సిస్టం కోసం రూ.3.65 కోట్లు, పుల్లూరిరామయ్యపల్లి నుంచి వేశాలపల్లితండా వరకు డబ్ల్యూబీఎం రోడ్డు, బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.80 లక్షలు, మంజూర్‌నగర్‌లోని బీసీ కాలనీలో సీసీ రోడ్లకు రూ.కోటి, మొత్తం మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.4.06 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీటితోపాటు భూపాలపల్లిలో మెయిన్ రోడ్డులో డివైడర్స్, ట్రాఫిక్ ఐలాండ్స్ నిర్మాణానికి రూ.2.17 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రధాన రహదారిలోని 5వ ఇైంక్లెన్ క్రాస్ నుంచి హనుమాన్ జంక్షన్ వరకు నాలుగు అడుగుల వెడల్పు, రెండున్నర నుంచి మూడు అడుగుల ఎత్తుతో డివైడర్, 8వ ఇైంక్లెన్ క్రాస్ (సింగరేణి ఏరియా హాస్పిటల్), జయశంకర్ విగ్రహం, అంబేద్కర్ సెంటర్, గణేశ్ చౌక్ వద్ద, జంగేడులో వేశాలపల్లి క్రాస్ వద్ద జంక్షన్ల నిర్మాణం జరుగనుంది. జంగేడు నుంచి వేశాలపల్లి, పుల్లూరిరామయ్యపల్లి నుంచి కొంపల్లి, సెగ్గంపల్లి నుంచి కాసింపల్లి వరకు నిర్మించే డబుల్ రోడ్ల మధ్య కూడా నాలుగు అడుగుల వెడల్పు, రెండున్నర నుంచి మూడు అడుగుల ఎత్తుతో డివైడర్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ డివైడర్ల మధ్య సెంట్రల్ లైటింగ్ సిస్టం పని చేయనుంది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో నిర్మించిన డివైడర్ల తరహా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో డివైడర్ల కోసం అధికారులు ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. వేశాలపల్లిలోని సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల వద్ద కమ్యూనిటీ హాల్‌కు రూ.50లక్షలు, ఇదే డబుల్ బెడ్‌రూం ఇళ్ల వద్ద మౌలిక వసతుల కోసం రూ.48లక్షలు, భూపాలపల్లిలోని రెడ్డి కాలనీలో తాగునీటి సరఫరాకు పైపులైన్ కోసం రూ.40లక్షలు, మున్సిపాలిటీ పరిధిలో మొత్తం డ్రెయిన్ల నిర్మాణానికి రూ.5.37 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక్కడ సుభాష్ కాలనీలో మహిళా స్వశక్తి భవన్ నిర్మాణానికి రూ.50లక్షలు, భూపాలపల్లిలో అర్బన్ హోంలెస్ పీపుల్ భవన నిర్మాణానికి రూ.75 లక్ష లు, వెటిటేబుల్ మార్కెట్‌లో అడిషనల్ మోడల్ షెడ్స్ కోసం రూ.1.03 కోట్లు కేటాయించింది. రూ.22.37 కోట్లతో చేపట్టే డబుల్ రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, జంక్షన్లు, డబ్ల్యూబీఎం, సీసీ రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు ఆహ్వానించేందుకు కసరత్తు జరుగుతుంది. ప్రజలు సహకరిస్తే ఈ నిధులతో రహదారుల విస్తరణ, డివైడర్లు, సెంట్ర ల్ లైటింగ్ సిస్టం, జంక్షన్ల నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోగా జరిగే అవకాశం ఉంది. సాధ్యమైనంత త్వరలో ఈ పనులు మొదలుకావాలనే పట్టుదలతో ఎమ్మెల్యే గండ్ర ఉన్నారు. మిషన్ భగీరథ పథకం నుంచి బల్క్ వాటర్ వస్తుండటంతో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరా కూడా మెరుగుపడుతుంది.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles