ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలి

Sun,July 7, 2019 01:22 AM

మాక్లూర్ : ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు కచ్చితంగా సమయపాలన పాటించాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్, కల్లెడి గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట చిన్నాపూర్ పాఠశాలలో 9.45 నిమిషాలకు చేరుకొని ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రార్థన సమయానికి ఉపాధ్యాయులు అందరూ ఉండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి తాను తన సొంత మండలం మాక్లూర్‌లో మొట్టమొదటి సారిగా చిన్నాపూర్, కల్లెడి పాఠశాలలకు రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి వేల కోట్లు నిధులు కేటాయిస్తూ కార్పొరేటు పాఠశాలలకు దీటుగా బలోపేతం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం, బాలికలకు కిట్స్, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత యూనిఫారాలు, బస్‌పాస్‌లు, స్కాలర్‌షిప్పులు అందజేస్తోందన్నారు. గురుకులాలను ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు కార్పొరేటు చదువులు అందిస్తున్నట్లు గుర్తు చేశారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని, విధి నిర్వహణలో నిక్కచ్ఛిగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు. భావిభారత పౌరులను తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చిన ఫలితాలు బాగున్నాయని, వచ్చే ఏడాదికి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని నూటికి నూరుశాతం అన్ని పాఠశాలల్లో ఉత్తీర్ణత కోసం కృషి చేయాలన్నారు. చదువుతో పాటు క్రీడల్లోఆసక్తి ఉన్న విద్యార్థులను జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గ్గొనేలా తర్ఫీదునివ్వాలని తెలిపారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయిన హరితహారంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి తనవంతుగా రెండు మొక్కలు నాటాలని కోరారు. చెట్లుంటేనే వర్షాలు కురుస్తాయని, మానవాళికి చెట్లు ఎంతో ఉపయోగకరమన్నారు. అనంతరం కల్లెడి పాఠశాలలో ఎంపీపీ మాస్త ప్రభాకర్, వైస్ ఎంపీపీ సుక్కి సుజాత సుధాకర్, డీసీసీబీ డైరెక్టర్ పీర్‌సింగ్, ఎంఈవో రాజగంగారెడ్డి, హెచ్‌ఎం ఆనంద్, ఎస్‌ఎంసీ చైర్మన్ సాయన్న, ఉప సర్పంచ్ మణిగౌడ్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం రచికరంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, నాయకులు సుక్కిసుధాకర్, రంజిత్, రాజు, రమేశ్, పోశెట్టి, అశోక్, రఘురావు, ప్రసాద్‌గౌడ్, శ్యాంరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

జడ్పీ చైర్మన్, ఎంపీపీకి సన్మానం
మండల కార్యాలయంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావును ఎంపీపీ మాస్త ప్రభాకర్, ఎంపీడీవో సక్రియానాయక్‌లు శనివారం శాలువ, మెమోంటోతో సన్మానించారు. జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా మండల కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆయనను మండల పరిషత్ ఉద్యోగులు శ్రీనివాస్‌గౌడ్, కిషన్ చౌహాన్, నరేశ్, విష్ణు, సిబ్బంది రశీద్, లింభాగిరి సన్మానించారు. కల్లెడి ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఆనంద్, ఉపాధ్యాయులు, టీఆర్‌ఎస్ నాయకులు, పలువురు సర్పంచులు, జడ్పీ చైర్మన్‌తో పాటు, ఎంపీపీ మాస్త ప్రభాకర్, వైస్ ఎంపీపీ సుజాతను సన్మానించారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles