ఇందూరులో విషాదం

Sun,July 7, 2019 01:24 AM

నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో ఒకే కాలనీకి చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని నాగారం 80 క్వార్టర్స్‌కు చెందిన మహ్మద్ అజార్ (8) మూడో తరగతి, అర్బాజ్ ఖాన్ (8) మూడో తరగతి, షేక్ షోయబ్ (9) నాలుగో తరగతి స్థానికంగా ఉన్న ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుకుంటున్నారు. రోజూ మాదిరిగానే వీరు శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో నమాజ్ (ప్రార్థన) చేసేందుకని స్కూల్ నుంచి బయటకు వెళ్ల్లారు. అనంతరం ఆ విద్యార్థులు పాఠశాలకు తిరిగి రాలేదు. ఆ విద్యార్థులు తిరిగి రానప్పటికీ పాఠశాల ఉపాధ్యాయులు, హెచ్‌ఎం వారి గురించి ఆరాతీయలేదు. శుక్రవారం సాయంత్రం స్కూల్ సమయం ముగిసినా ముగ్గురు విద్యార్థులు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెందారు. పాఠశాలకు వెళ్లి చూడగా అక్కడ ఎవరూ లేకపోవడంతో వెనుదిరిగారు. అనంతరం పిల్లల కోసం చుట్టుపక్కల ప్రాంతాలు, కాలనీలో వెతికినా వారి ఆచూకీ లభించలేదు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో విద్యార్థుల కుటుంబీకులు నిజామాబాద్ నగర ఐదో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై జాన్‌రెడ్డి అదృశ్యం కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థులు చదువుకునే పాఠశాల వెనకాల ఉన్న లోతైన గుంతలో వర్షం నీరు ఉండడంతో అటువైపునకు ఏమైనా వెళ్లి ఉంటారనే అనే అనుమానం వ్యక్తం చేశారు. కానీ, అప్పటికే చీకటి పడడంతో వారు వెనుదిరిగారు. శనివారం ఉదయం నుంచి నిజామాబాద్ రూరల్ నార్త్ సీఐ శ్రీనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో చుట్టు పక్కల కాలనీ వాసులు, పోలీసులు ఆ నీటి కుంట వద్దకు వెళ్లి అందులో దిగి వెతకసాగారు. కొద్ది సమయానికే షేక్ సోయబ్ అనే బాలుడి మృతదేహం లభించింది. మరింత సేపు గాలింపు చర్యలు చేపట్టారు. కుంటలో నీరు అధికంగా ఉండడంతో నీటిని తొలగించేందుకు అగ్నిమాపక సిబ్బంది సహాయం తీసుకున్నారు. సంఘటనా స్థలానికి అగ్నిమాపక వాహనంతో చేరుకున్న సిబ్బంది కుంటలోని నీటిని తోడేశారు. కొద్ది సమయానికి మహ్మద్ అజార్, అర్బాజ్‌ఖాన్ మృతదేహాలు లభించాయి. ఒకే కాలనీకి చెందిన ముగ్గురు విద్యార్థులు ఒకేసారి మృత్యువాత పడడం కుటుంబీకులు, కాలనీవాసులను కన్నీరు పెట్టించింది. మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

ధర్నా నిర్వహించిన బాధితులు...
తమ పిల్లలు స్కూల్ నుంచి వెళ్లి తిరిగి మధ్యాహ్నం తర్వాత పాఠశాలకు రాకపోయినా ఆ విషయాన్ని తమకు ఎందుకు తెలియజేయలేదని పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు నిజామాబాద్ ఐదోటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. పాఠశాలలో తమ పిల్లల పుస్తకాల బ్యాగులు ఉన్నప్పటికీ, వారు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని టీచర్లు ఎందుకు ఆరాతీయలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌ఎంతో పాటు టీచర్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. నిజామాబాద్ నార్త్ తాహసీల్దార్ శ్రీనివాస్, డీఈవో దుర్గా ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సముదాయించారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు.

73
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles