నేడు కొలువుదీరనున్న కొత్త టీచర్లు

Mon,July 15, 2019 01:21 AM

-93 మందికి నియామక పత్రాలుఅందజేసిన విద్యాశాఖ అధికారులు
-18న కౌన్సెలింగ్‌కు హాజరు కాని వారి నియామక పత్రాలు పోస్టు ద్వారా అందజేత
-ఉపాధ్యాయ పోస్టుల భర్తీతోఊరట
ఇందూరు: ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ)-2017 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సోమవారం (నేడు) తమకు కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరనున్నారు. టీఆర్టీలో ఎంపికైన ఉమ్మడి జిల్లాల అభ్యర్థులకు ఈనెల 14న కౌన్సెలింగ్‌ నిర్వహించిన విద్యాశాఖ అధికారులు, వారికి నియామక పత్రాలను నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని నిర్మల హృదయ పాఠశాలలో అందజేశారు. ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియకు హాజరు కాని అభ్యర్థుల జాబితాను ఈనెల 17న డీఈవో రూపొందిస్తారు. 18న కౌన్సెలింగ్‌కు హాజరుకాని అభ్యర్థులకు రిజిస్టర్‌ పోస్టు ద్వారా నియామక పత్రాలను జారీ చేస్తారు. 19న విధుల్లో చేరిన ఉపాధ్యాయుల జాబితాను రూపొందించాల్సిందిగా హెచ్‌ఎంలు, ఎంఈవోలకు డీఈవో ఆదేశాలు జారీచేస్తారు. అదే రోజు విధుల్లో చేరిన వారి జాబితాను డీఈవో వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. 20న రిపోర్టింగ్‌ చేయని వారి, విధుల్లో చేరని వారి జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారులు టీఎస్‌పీఎస్సీ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు సమర్పించనున్నారు.

కోర్టు కేసుల కారణంగా
నిలిచిన నియామకాలు..
నవంబరు 2017లో టీఆర్టీ ప్రకటన జారీ కాగా.. 2018, ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు హైదరాబాద్‌లో పరీక్షలు నిర్వహించారు. 2018 ఆగష్టు, సెప్టెంబరులో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ చేపట్టారు. అనంతరం విడతల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. టీఆర్టీ అభ్యర్థుల నియామకాన్ని చేపట్టాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ ప్రక్రియను చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో టీఆర్టీ పరీక్షలో 540 మంది ఉత్తీర్ణత సాధించగా.. 93 మందికి నియామక పత్రాలు అందజేశారు. శనివారం నిర్వహించిన కౌన్సెలింగ్‌కు 103 మంది హాజరు కావాల్సి ఉండగా.. 93 మంది హాజరయ్యారు. 319 మంది హిందీ పండిట్లు, ఎస్జీటీలకు సంబంధించి కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండడంతో వీరి నియామకాన్ని చేపట్టలేదు.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో ఊరట..
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్ర క్రియను పూర్తి చేసేందుకు కసరత్తు చేయడంతో జిల్లాలోని ఆయా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి. తద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనుంది. సబ్జెక్టుల వారీగా ఉన్న ఖాళీలు భర్తీ చేయడంతో ఆయా పాఠశాలల్లో నెలకొన్న ఉపాధ్యాయుల సమస్య తీరనుంది. పాఠశాల విద్యను ఇప్పటికే బలోపేతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గాను నియామక ప్రక్రియను వేగిరం చేసింది.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles