ఫసల్‌ బీమా.. రైతుకు ధీమా

Mon,July 15, 2019 01:22 AM

-విడుదలైన మార్గదర్శకాలు
-బీమా ప్రీమియం చెల్లించడానికి ఈనెల 31 వరకు అవకాశం
-పత్తికి ఈనెల 15 వరకు, వరి పంటకు ఆగస్టు 31 వరకు గడువు
ఎడపల్లి: ‘ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన’ పేరుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా పథకం రైతుల పాలిట కల్పవృక్షంలా మారింది. వానాకాలం సీజన్‌ సాగుకు సంబంధించి బీమా చేసుకోవడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతులు పండించిన పంట చేతికందే సమయంలో ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. అకాల వర్షాలు, వడగండ్లు, తుఫాన్లతో నష్టపోతే ఈ పథకం కింద అగ్రికల్చర్‌ ఇన్సూరెన్సు కంపెనీ ఆఫ్‌ ఇండియా ద్వారా రైతులు నష్ట పరిహారం పొందవచ్చు. ఇందుకోసం రైతులు ఆగస్టు 31 తేదీలోగా తమ వంతు ప్రీమియం చెల్లించి బీమా చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ఇందుకోసం గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించి ‘ఫసల్‌ బీమా’ పథకం గురించి విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌లో వివిధ రకాల పంటలకు ప్రీమియం ధరలు ఖరారయ్యాయి. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయినప్పుడు రైతులను ఫసల్‌ బీమా పథకం రైతులను ఆదుకుంటుంది. వరి, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుము, సోయాచిక్కుడు, పసుపు, వేరుశనగ వంటి పంటలకు జిల్లాల వారీగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎకరాకు బీమా రేటును అగ్రికల్చర్‌ ఇన్సూరెన్సు కంపెనీ ఆఫ్‌ ఇండియా ఖరారు చేసింది.

పంటరుణం తీసుకొనే రైతులు, పంటరుణం అవసరం లేని రైతులు కూడా ఈ బీమా పథకాన్ని వినియోగించుకోవచ్చు. బ్యాంకుల ద్వారా పంటరుణం తీసుకొనే రైతుకు బ్యాంకర్లు ఇచ్చే రుణం లోనుంచి ప్రీమియం డబ్బును మినహాయించుకొని మిగిలిన డబ్బును రైతుల ఖాతాల్లో జమచేస్తారు. రుణాలు అవసరం లేని రైతులు నేరుగా బ్యాంకుల ద్వారా, లేదా మీ-సేవ ద్వారా బీమా ఏజెన్సీకి గాని, ప్రతినిధులకు గాని తమ వంతు ప్రీమియం చెల్లించి బీమా చేయించుకోవచ్చు. ఈ విషయాన్ని ఈసారి గ్రామాల్లో వ్యవసాయ అధికారులు విరివిగా ప్రచారం చేస్తున్నారు. రైతు సమన్వయ సమితి సభ్యులతో ప్రతీ రైతుకు ఈ విషయాన్ని చేరవేస్తున్నారు. గతంలో ఎక్కువ మంది ఈ బీమా ప్రీమియం చెల్లింపునకు ముందుకు రాలేదు. ఈసారి 95శాతం మంది రైతులు ఫసల్‌ బీమా కోసం ప్రీమియం చెల్లించేలా కృషిచేస్తున్నారు.

ప్రధాన అంశాలు...
2019 వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌లో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ‘అగ్రికల్చర్‌ ఇన్సూరెన్సు ఆఫ్‌ ఇండియా’ కంపెనీ ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నది. ఈసారి రైతు చెల్లించే ప్రీమియాన్ని తగ్గించింది. వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌లో పండించే సాధారణ పంటలతో పాటు పప్పు దినుసులు, నూనెగింజల పంటలను అన్నింటికీ రైతులు కట్టాల్సిన ప్రీమియం అతితక్కువగా 2 శాతంగా నిర్ణయించారు. యాసంగి(రబీ) సీజన్‌లో పండించే పంటలకు చెల్లించే ప్రీమియాన్ని 1.5 శాతంగా నిర్ణయించారు. వార్షిక వాణిజ్య, ఉద్యానవన పంటలకు 5శాతం ప్రీమియం నిర్ణయించారు. ఇన్సూరెన్సు కంపెనీ నిర్ణయించిన దానిలో రైతులు కట్టగా.. మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి. ఈ పథకం ప్రాంతాల వారీగా అమలు చేయబడుతుంది. ప్రతీ జిల్లాలో ఒక ప్రధాన పంటకు గ్రామం యూనిట్‌గా బీమా అమలు చేస్తారు. కౌలు రైతులు కూడా ఈ బీమాను సద్వినియోగం చేసుకోవచ్చు. సీఎస్‌సీ, లేదా మీ-సేవ కేంద్రాల నుంచి రైతులు పంటలకు బీమా చేయించుకోవచ్చు. దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందుకోసం పట్టాదారు పాస్‌ పుస్తకం, బ్యాంకు ఖాతా పాస్‌ పుస్తకం, వ్యవసాయ శాఖ అధికారి జారీచేసిన పంట ధ్రువీకరణ పత్రం జతచేయాల్సి ఉంటుంది.

భద్రాద్రి, జోగులాంబ గద్వాల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌ నగర్‌, మెదక్‌, మేడ్చల్‌, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, నారాయణపేట్‌, నిర్మల్‌, సూర్యాపేట్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌, వరంగల్‌, యాదాద్రి జిల్లాల్లో వరి పంటకు ఎకరానికి రూ. 34,000 , మొక్కజొన్నకు రూ.25,000, జొన్నకు రూ.14,000, కందికి రూ.14,000, పెసరకు రూ.15,000, మినుములకు రూ.15,000, సోయాచిక్కుడు పంటకు రూ.22,000, పసుపునకు రూ.60,000(మహబూబాబాద్‌, సంగారెడ్డి, వరంగల్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌ జిల్లాలకు), వేరుశనగకు రూ.19,000 బీమాను నిర్ణయించింది. రైతులు 2శాతం బీమా ప్రీమియాన్ని జూలై 31లోపు చెల్లించాల్సి ఉంటుంది. వరి,టమాట, మిరప పంటలకు సంబంధించిన ప్రీమియాన్ని మాత్రం ఆగస్టు 31లోపు చెల్లించడానికి అవకాశం ఉంది. పత్తి పంటకు ఈనెల 15లోపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 599 2594లో సంప్రదించాలి.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles