సాగుపై అవగాహన కల్పించాలి

Wed,April 17, 2019 01:03 AM

-మొక్కజొన్నలో కత్తెర పురుగుపై రైతులు అప్రమత్తంగా ఉండాలి
-పరిశోధన, విస్తరణ సలహా సంఘం సమావేశంలో కలెక్టర్
-కూలీల కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలి
-జయశంకర్ యూనివర్సిటీ విస్తరణ ఏడీ డాక్టర్ జీ.రాజిరెడ్డి
ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 16: రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు వాణిజ్యపరంగా లాభం చేకూర్చేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు పంటసాగుపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఫెర్టిలైజర్స్ డీలర్స్ అసోసియేషన్ హాల్లో మధ్య తెలంగాణ మండలంలో గల ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల మధ్య తెలంగాణ మండల పరిశోధన, విస్తరణ సలహా సంఘం సమావేశం మంగళవారం జరిగింది. ముఖ్య అతిథిగా కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ సీజన్ మొదలైన దగ్గర నుంచి రైతులు సరైన విత్తనాలు ఎంచుకొని యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు యజమాన్యం పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, అదే విధంగా విలువ ఆధారిత ఉత్పత్తులను పెంపొందించుకోవాలని సూచించారు. గత ఖరీప్‌లో పంటల స్థితిగతులు, సస్యరక్షణ, వర్షాధారిత పంటలపై రైతులు ఎదుర్కొన్న సమస్యలను నివారించడంతోపాటు, రాబోయే పంట కాలలానికి అనుకూలమైన పంటల సాగుపై వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కేవలం వర్షాధార పంటలపై ఆధారపడకుండా లాభదాయక పంటల గురించి ఆలోచించాలని సూచించారు.

కూలీల కొరతను అధిగమించాలి: డాక్టర్ రాజిరెడ్డి
కూలీల కొరతను అధిగమించేందుకుగాను యాంత్రీకరణ అవసరాలు, సమీకృత వ్యవసాయ పద్ధతులపై చర్యలు చేపట్టాలని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుడు డాక్టర్ డీ.రాజిరెడ్డి సూచించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వరిలో తడి, పొడి పద్ధతుల ద్వారా వెదజల్లే పద్ధతి, మెట్ట, మాగాణి పద్ధతుల్లో వరిసాగు చేపట్టి నీటికొరతను అధిగమించాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వరి 10 లక్షల నుంచి 12 లక్షల హెక్టార్లలో సాగు జరుగుతోందని, మొక్కజొన్న 4 నుంచి 5 లక్షల హెక్టార్లలో సాగు అవుతుందని అన్నారు. మొక్కజొన్న పంటను ఆశిస్తున్న కత్తెర పురుగు నివారణపై రైతులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

అనంతరం సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ జగన్మోహన్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. పప్పు ధాన్యాలైన కంది, మినుము, పెసర పంటలపై కత్తెర పురుగు యాజమాన్యంపై కరదీపికలను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు తమ పరిశోధన, విస్తరణలో జరిగిన ఫలితాలను, రాబోయే సంవత్సరానికి రూపొందించిన ప్రణాళికలను వివరించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఝాన్సీలక్ష్మీకుమారి, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ విజయనిర్మల, వరంగల్, మెదక్ జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు, వైరా కృషి విజ్ణాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్‌కుమార్, డాట్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు, వరంగల్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు, ఆయా జిల్లాల వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు, ఖమ్మం జిలా, మండల వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

310
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles