ఎక్కే మెట్టు.. దిగే మెట్టు..!

Wed,April 17, 2019 11:52 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : దేశానికి రైతే వెన్నుముక. రైతు లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. అటువంటి రైతు ముఖంలో ఆనందం చూడాలని, రైతుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా భూరికార్డుల ప్రక్షాళన చేసి రైతుల భూముల వివరాలు రికార్డు చేసి పాస్ పుస్తకాల పంపిణీ చేయాలని సంకల్పించింది. ఎన్నడో నిజాం కాలంనాడు జరిగిన భూ సర్వే ఆధారంగానే ఇంత వరకు భూరికార్డుల వివరాలు నమోదవుతూ వస్తున్నాయి. దీంతో తెగని చిక్కుల్లా భూ రికార్డుల వివరాలు ప్రతీ రైతును వేదిస్తున్నాయి. తమకున్న భూమి రికార్డులలో ఒక రకంగా, క్షేత్రస్థాయిలో ఒక రకంగా ఉంటుంది. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ అనుకున్నదే తడవుగా భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం 2017వ సంవత్సరంలో ప్రారంభించారు. భూరికార్డుల ప్రక్షాళన ఎటువంటి చిక్కులు లేకుండా సులభంగా, పారదర్శకంగా ప్రజలకు అర్ధమయ్యే రీతిలో జరగాలని ఆయన ఆకాంక్షించారు. దీనికి అనుగుణంగా వ్యవసాయ శాఖ , రెవెన్యూ అధికారులతో విధివిధానాలు ఖరారు చేసి ఆగస్టు 31వ తేదీన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించారు.

దీంతో అంతా సజావుగా సాగి ఏ సమస్య లేకుండా రైతుల భూమి రికార్డు అవుతుందని భావించారు. కానీ నేటికీ కొందరు రైతుల సమస్య తీరకుండానే ఉంది. వారు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ తమ గోడు వెల్లబోసుకుంటున్నా పరిష్కార మార్గం మాత్రం దొరకడం లేదు. దీంతో కొందరు రైతులు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు. సుమారు 50 సంవత్సరాల కాలం అనంతరం నిజాం కాలంలో జరిగిన భూసర్వే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించారు. దీనిలోని లోటుపాట్లని గుర్తించిన రెవెన్యూ అధికారులు రైతులను ఇబ్బందులు పెడుతూ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. రైతుల చిన్న సమస్యను పెద్ద సమస్యగా భూతద్దంలో చూపించి ఏళ్ల తరబడి తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. విసిగి వేసారిన రైతులు కొంత మంది రెవెన్యూ అధికారులను నిలదీస్తున్నారు. కొంతమంది తృణమో ప్రణమో ముట్టజెప్పి తమ భూమిని రికార్డుల్లోకి ఎక్కించుకుంటున్నారు. ఈ తంతు కొనసాగుతూనే ఉంది. దీనికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. భూరికార్డుల ప్రక్షాళనతో తమ భూములు రికార్డుల పరంగా పాస్‌బుక్కుల్లో ఎక్కుతాయనుకున్న రైతులకు రెవెన్యూ సిబ్బందే పక్కపక్కన భూములున్న రైతుల భూముల వివరాలను తేడాగా నమోదు చేసి చోద్యం చూస్తున్నారు. ఇదేమిటని తమవద్దకు వచ్చిన వారిని రికార్డులు సరి చేయాలంటే ఎంతోకొంత ముట్టజెప్పాల్సిందేనని చెప్తూ తమ జేబులు నింపుకుంటున్నారు. రెవెన్యూ సిబ్బంది భూ వివరాలను రికార్డుల్లోకి నమోదు చేయకపోగా ప్రతీ రైతు మధ్యలో భూసమస్యలు సృష్టించి దానిని క్యాష్ చేసుకునే దిశగా అడుగులు వేశారు.

భూరికార్డుల ప్రక్షాళన అస్తవ్యస్తంగా మారింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని రూపొందించి గ్రామాల అభివృద్ధికి బాటలు వేసిన విధంగానే నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి సమూల మార్పులు చేసేందుకు శ్రీకారం చుట్టనుంది. దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించి నూతన రెవెన్యూ చట్టంపై కసరత్తు ప్రారంభించారు. వరుస ఎన్నికల నేపథ్యంలో నూతన చట్టం అమలు కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. రెవెన్యూ శాఖ పూర్తి ప్రక్షాళనే లక్ష్యంగా నూతన రెవెన్యూ చట్టం ఉండబోతుందని సమాచారం. నూతన చట్టం అమలులోకి వస్తేనే మా భూరికార్డుల ప్రక్షాళన పూర్తి స్థాయిలో జరిగి న్యాయం జరుగుతుందని ప్రతీ రైతు ఆకాంక్షిస్తున్నాడు. భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కొందరు రైతులు నమస్తే తెలంగాణకు తమ గోడును వెల్లబోసుకున్నారు. నూతన రెవెన్యూ చట్టం అమలే వీటన్నింటికీ పరిష్కారమార్గమని వారు తెగేసి చెప్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రతీ మండలంలో రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉంది. చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, చండ్రుగొండ, అశ్వారావుపేట మండలాల్లో ఉన్న రైతుల సమస్యలు కొన్ని...

రైతుల చిన్న సమస్యలను భూతద్ధంలో చూపించి ఏళ్ల తరబడి అధికారులు తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. విసిగి వేసారిన రైతులు కొంత మంది రెవెన్యూ అధికారులను నిలదీస్తున్నారు. కొంతమంది తృణమో ప్రణమో ముట్టజెప్పి తమ భూమిని రికార్డుల్లోకి ఎక్కించుకుంటున్నారు. ఈ తంతు ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. దీనికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం నూతన చట్టాన్ని రూపొందించాలని సంకల్పించింది. దీనిని రాష్ట్రంలో ప్రతీ రైతు సంతోషంగా స్వాగతిస్తున్నారు..

రెండెకరాలకు పట్టా రాలేదు..
ఇరవై ఏళ్ల క్రితం రెండెకరాల పొలం కొన్నాను. 2016 నుంచి పట్టా కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. 248/2 సర్వే నంబర్‌లో రెండెకరాల పొలం ఉంది. ఈ రెండెకరాల కాస్తులో నేనున్నా. పట్టామాత్రం ఇంత వరకు ఇవ్వడం లేదు. ఎప్పుడెల్లినా మళ్లీ రమ్మని చెప్తున్నారు. వీఆర్వో, ఆర్‌ఐను కలిశాను. నా సమస్య పరిష్కారం కావడం లేదు. తిరిగి తిరిగి విసుగు వస్తోంది. పొలం కాగితాలు పట్టుకొని కార్యాలయానికి రానిరోజు లేదు. అటుపొలం పనులు చేసుకుంటేనే కార్యాలయానికి వస్తున్నాను. సర్వే అధికారులను పంపిస్తామని చెప్తున్నారు, కానీ ఇంత వరకు పంపలేదు.
-బానోత్ లాలు, రైతు, సీతంపేట

పది సంవత్సరాల సమస్య..
ఇది పది సంవత్సరాల సమస్య. 248 సర్వే నంబర్‌లో మా నాన్న రెండెకరాల పొలం కొన్నాడు. ఇంత వరకు ఆ పొలాన్ని మా పేరు మీదకు మార్చలేదు. ఎప్పుడెల్లినా ఓట్లు వచ్చాయి.. సర్వే చేయవద్దని అంటున్నారు. సాదాబైనామాకు కూడా ధరఖాస్తు చేసుకున్నాం. అయినా సర్వే చేయలేదు. సర్వేకు వస్తాం. సర్వే చేస్తామని అంటున్నారు. కానీ ఇంత వరకు ఆ సర్వేకు రాలేదు. పట్టా కాలేదు.
-బాదావత్ జుంకీలాల్, రైతు, జర్పులాతండా, తుంగారం

భూమి మాది పట్టా వేరొకరిది..
నాపేరు సయ్యద్ యాకుబ్ మేము గత 40 సంవత్సరాలుగా పొలం చేసుకుంటున్నాం. పహాణీ నఖల్లో అనుభవదారు కాలంలో వస్తున్నాం. కాని మా పేరుమీద పట్టా మారలేదు వేరేవాళ్ల పేరుమీద వస్తుంది. పట్ట మార్చాలని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కానీ వారు మార్చడంలేదు. మా నాన్న సయ్యద్ అహ్మద్ పేరు మీద 28/1 సర్వేలో 22 కుంటలు, 211/1అలో 1.20 కుంటలు, 211/1/ఆలో 1.20 కుంటలు, 342/అ/3లో 0.20 కుంటలు, 342/ఆ/1 0.12 కుంటలు 342/ఆ/2లో 0.20 కుంటలు భూమి ఉంది. ఇది పట్టాదారు కాలమ్‌లో పొరపాటున సయ్యద్ మీరా ఖాసీంగా వస్తుంది. కాని భూమిమీద మాత్రం మేమే ఉన్నాం. అధికారులకు సైతం సయ్యద్ ఖాసీం హుస్సేన్ వద్ద నుంచి బాండ్‌పేపర్‌పై వారి భూమి కాదని తప్పుగా వస్తుందని రాతపూర్వకంగా రాయించి అధికారులకు ఇచ్చాం. అయినా అధికారులు మాకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కొత్త పాస్ పుస్తకాలు మాకు ఇవ్వడంలేదు. ఎంతో కాలం నుంచి ఇది మానాన్న సయ్యద్ హమీద్‌దని వారసత్వం కింద మా పేరు మీద పట్టాచేయాల్సిందిగా చుంచుపల్లి తహసీల్దార్, ఆర్‌ఐ, వీఆర్‌వోలకు వినతపత్రాలు ఇస్తూనే ఉన్నాం. వారు విచారణ చేపడుతూనే ఉన్నారు కానీ మా పేర ఇంతవరకు పట్టా ఇవ్వలేదు. దీంతో మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుబంధు కాని రైతుబీమా రావడంలేదు. దయచేసి మాకు పట్టాదారు పాసు పుస్తకం ఇప్పించగలరు. ఈ విషయం పెనగడప వీఆర్‌వోను వివరణ కోరగా వారి పత్రాలను సరిచూసి వారికి న్యాయం జరిగేలా చూస్తామంటున్నారు. తహసీల్దార్ ఊర్లోలేరు త్వరలోనే ఆపని పూర్తి చేస్తామని, కావాలని తిప్పుతున్నారు. చెప్పులరిగేలా తహసీల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా మాకు మాత్రం న్యాయం జరగడం లేదు.
-సయ్యద్ యాకూబ్, పెనగడప

582
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles