సదరం శిబిరానికి విశేష స్పందన

Fri,April 19, 2019 03:06 AM

మయూరిసెంటర్, ఏప్రిల్ 18: జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో గురువారం జరిగిన సదరం శిబిరానికి విశేష స్పందన లభించింది. మధిర నియోజకవర్గ పరిధిలో గల దివ్యాంగులకు జిల్లా వైద్యశాలలో దివ్యాంగుల శాఖ ధ్రువీకరణ పత్రాలకు చెందిన పరీక్షల నిర్వహణలో భాగంగా గురువారం జరిగిన సదరం శిబిరానికి 335 మంది దివ్యాంగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంగవైకల్య ధ్రువీకరణ కోసం అభ్యర్థులను పరీక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ గురువారం జిల్లా వైద్యశాలలో జరిగే సదరం శిబిరానికి దివ్యాంగులు అధిక సంఖ్యలో రావడంతో వారికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. అందుకని ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా కేటాయించడంతో ఆయా నియోజకవర్గాల పరిధిలో గల అంగవైకల్యం కలిగిన వారు మాత్రమే నిర్ణీత తేదీల్లో శిబిరానికి హాజరవుతున్నట్లు చెప్పారు. ఆర్థోపెడిక్ (ఎముకలు, కీళ్లు) విభాగానికి చెందిన అంగవైకల్యం కలిగినవారు 281 మందికి, కంటి చూపు తక్కువగా ఉన్నవారు 54 మందికి పరీక్షించినట్లు ఆయన వివరించారు. వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి (ఆర్థోపెడిక్), డాక్టర్ రామునాయక్ (కంటి వైద్యులు), ఫిజియోథెరఫీ వైద్యులు స్వాతి, డీఆర్‌డీఏ విభాగ సిబ్బంది నాగూల్‌మీరా, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

227
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles