తిరిగి.. తిరిగి.. విసిగి వేసారి..

Fri,April 19, 2019 11:35 PM

అశ్వాపురం: వ్యవసాయం పండుగ కావాలి.. రైతు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలి అనే సంకల్పంతో ప్రభుత్వం పలు సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. నిజాం కాలం నాటి నుంచి పెండింగ్‌లో ఉన్న భూ రికార్డులను ప్రక్షాళన చేపట్టి రైతులకు సాగు కష్టాలను తీర్చాలనే సంకల్పంతో రైతుబంధు సాయం చేతి కందిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో కొంత మంది రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల అన్నదాత అష్టకష్టాలు పడుతున్నాడు. పాస్‌పుస్తకాల జారీలో కొర్రీలు పెడుతుండటంతో పేద రైతు మరింత బక్కచిక్కి పోతున్నాడు. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు కనికరించడంలేదు. అధికారుల చిన్నపాటి నిర్లక్ష్యం రైతులను ఇబ్బందుల పాల్జేస్తుంది. భూమిపై సర్వహక్కులు ఉన్నా పట్టా పుస్తకం జారీ చేయడంలో కొందరు అధికారులు అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారి పనిలో జాప్యం చేస్తున్నారు. పాస్ పుస్తకాల కోసం చేయి తడిపినా ఏండ్ల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు తప్పడంలేదని పలువురు రైతులు వాపోతున్నారు. చిన్న పనికోసం రెవెన్యూ అధికారులు ఏండ్ల తరబడి తిప్పుకుంటున్నారు.

రైతుబంధుతో తమ బాధలు పోతాయనుకుంటే అధికారులు అసలు పట్టించుకోవటం లేదని 70ఏండ్ల వయసున్న తోట చంద్రయ్య అనే రైతు కన్నీళ్లు దిగమింగుకుంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అశ్వాపురం మండలం రెవెన్యూ పరిధిలో ఖాతా నెంబర్ 92, సర్వే నెంబర్ 450/2/ఆ లో విస్తీర్ణం 0.35 గుంటలు భూమితో గతంలో పాస్ పుస్తకం కూడా ఉంది. కొత్త పాస్‌బుక్ ఇయ్యలేదు. దరఖాస్తు పెట్టుకొని ఏడాది గడుస్తున్నా అధికారులు సాకులు చెపుతూ ఆఫీసు చుట్టూ తిప్పుతున్నారు. రైతుబంధు డబ్బులు రావడం లేదు.. ఏం చేయాలో అర్థం కావటం లేదు.. అని చేతులెత్తి దండం పెడుతున్నాడు. అశ్వాపురం మండలం నెల్లిపాక రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 508/అ లో విస్తీర్ణం 0.10గుంటలు, 512/అ లో విస్తీర్ణం 0.31 గుంటలు, 448/2లో 1.36 ఎకరాల భూమికి కొత్తగూడెం, మణుగూరు ఆర్‌అండ్‌బీ రోడ్డు కింద పోయి పట్టాదారు నష్ట పరిహరం చెల్లించబడింది. ఆ భూములకు రెవెన్యూ అధికారులు నేడు నూతన పాస్‌పుస్తకాలు సైతం ఇచ్చి రైతుబంధు కూడా ఇస్తున్నారు. మాలాంటి పేద రైతులను మాత్రం అష్టకష్టాలు పెడుతున్నారు అని నార్నె దిలీప్‌రావు అనే మరో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇలా ఎందరో... మరెందరో... నెలల తరబడి గుండెల్లో బాధను దిగమింగుకుంటూ జీవిస్తున్నారు. నమస్తే తెలంగాణ ధర్మయుద్ధం భరోసాతో తమ సమస్యలు ఏకరువు పెడుతున్నారు.

పాస్‌బుక్ ఇమ్మంటే డబ్బులు అడిగారు..
నాకు నెల్లిపాక రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబరు 1/అ లో రిజిస్ట్రేషన్ ద్వారా క్రయం పొందిన 6.32ఎకరాల వ్యవసాయ పట్టా భూమి ఉంది.. ఈ భూమిని 2000లో బూర్గంపాడు సబ్ రిజిస్టారు కార్యాలయంలో నేను, నా భార్య కలిపి జాయింట్ రిజిస్ర్టేషన్ ద్వారా 3.16 ఎకరాల చొప్పున సమాన భాగాలుగా క్రయం పొందాము. ప్రభుత్వం చేస్తున్న భూ రికార్డులప్రక్షాళనలో భాగంగా మీము పట్టాదారు పాస్ పుస్తకానికి దరఖాస్తు చేయగా, నాభార్య పేరిట 3.16 ఎకరాలకు పాస్ పుస్తకం మంజూరయింది. కానీ.. నా పేరిట పాస్ పుస్తకం మంజూరు కాలేదు. పాస్ పుస్తకం కోసం రెండేళ్ల నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను.. అయినా ఫలితం లేదు. ఓ దళారీ ద్వారా రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరోజు పిలిపించుకొని తమ భూమి పాస్‌పుస్తకం ఇవ్వాలంటే ఎకరానికి రూ. 50వేల చొప్పున లంచం అడిగారు. నా దగ్గర డబ్బుల్లేవు అనడంతో ఆ రోజునుంచి నీను ఆఫీసుకి వెళ్లి పాస్ పుస్తకం గురించి అడిగినా ప్రతీసారి రోజూ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారే.. మాకు బోలెడు పనులున్నాయి.. అంటూ దురుసుగా మాట్లాడుతున్నారు. నా భూమి నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉండి రిజిస్ట్రేషన్ ద్వారా క్రయం పొందాను నాకు ప్రతీ ఏడాది రైతుబంధు రూ. 34వేలు నష్టపోతున్నాను. నాకు న్యాయం చేసి రైతుబంధు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను.
-నార్నె దిలీప్‌రావు, రైతు, నెల్లిపాక బంజర గ్రామం, అశ్వాపురం మండలం

తిరిగి తిరిగి అనారోగ్యం
నాకు నెల్లిపాక గ్రామంలో నా భర్త పేరిట ఉన్న ఖాతా నెంబరు 628లో సర్వే నెంబర్ 506లో 0.09 గుంటలు, 509లో 0.31 గుంట, 190/251 లో 0.30 గుంటలు మొత్తం 1.30 గుంటలు భూమి ఉంది. నా భర్త 2017లో మరణించాడు. ఆయన తదనంతరం వారసురాలిగా నాకు చెందాల్సి భూమి పాస్ పుస్తకం కోసం నేను 2017లో భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నాను. దరఖాస్తుతో పాటు డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీమెంబర్ సర్టిఫికెట్ కూడా సమర్పించాను. రెండేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. పట్టా మార్పిడి మ్యుటేషన్ కాలేదు. నూతన పాస్‌బుక్ రాలేదు. 2018, మే నెలలలో నా భర్త పేరు మీద రైతుబంధు రూ.3000 చెక్కు కూడా మంజూరైంది. ఆ చెక్కును వెనక్కు పంపించారు. కానీ నా పేరిట పాస్‌బుక్, రైతుబంధు ఇవ్వలేదు. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగితిరిగీ అనారోగ్యం పాలయ్యాను.. కానీ నా పని మాత్రం కావటం లేదు. నీను ఒంటరిగా జీవిస్తున్నాను. రైతుబంధు వస్తే పెట్టుబడికి సాయంగా ఉండేది. మళ్లీ పెట్టుబడి సమయం వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.. దయచేసి నా భూమికి పాస్‌పుస్తకం ఇప్పించి రైతుబంధు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాను..
-తాళ్లూరి లక్ష్మీతాయారమ్మ, బూర్గంపాడు

528
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles