ఉత్తమ ఫలితాలు

Fri,April 19, 2019 11:35 PM

(ఖమ్మం ఎడ్యుకేషన్) కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు రాణించాలనే దిశగా ప్రణాళికలు అమలుపర్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఏ దశలోనూ విద్యార్థికి సమస్యలు ఎదురుకాకుండా అన్ని రకాల సౌకర్యాలనూ సమకూర్చింది. ప్రభుత్వ లక్ష్యాలను సాధించేందుకు అధికారులూ అదే స్ధాయిలో కృషి చేశారు. ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, గురుకులాలు, కేజీబీవీల్లోని విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో ఉత్తమంగా రాణించారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా విద్యార్థులు టాప్ మార్కులు సాధించి అదరహో అనిపించారు. జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల్లోని ఫలితాల కంటే అత్యధికంగా గురుకులాల్లోని విద్యార్థులు ఉత్తీర్ణత శాతం సాధించారు. పరీక్షకు హాజరైన విద్యార్థులందరూ ఉత్తీర్ణులై నూరుశాతం సాధించిన కళాశాలలూ ఉన్నాయి.

కార్పొరేట్‌కు దీటుగా..
తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు పూర్తి స్థాయిలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ నిర్వహిస్తున్న గురుకులాలు ఇంటర్ ఫలితాల్లో రాణించాయి. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఫలితాలను సాధించి అబ్బురపరిచారు. ఖమ్మం జిల్లా పరిధిలో 9 సాంఘిక సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. ప్రథమ సంవత్సరంలో 805 మంది విద్యార్థులు హాజరుకాగా 710 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఖమ్మం నగరంలోని గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో 154 మందికి 154 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి నూరు శాతం సాధించారు. తిరుమలాయపాలెం కళాశాల 97 శాతం, నేలకొండపల్లి 94.87 శాతంతో రాణించాయి. అన్ని కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం 75 పైనే ఉండడం విశేషం. ద్వితీయ సంవత్సరంలో 609 మంది విద్యార్థులకు గాను 559 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కల్లూరు కళాశాల నూరు శాతం ఉత్తీర్ణత సాధించింది. నేలకొండపల్లి కళాశాల 98 శాతంతో రాణించింది.

టాప్ మార్కులు సాధించిన విద్యార్థులు..
వైరా గురుకులంలో ఎంపీసీలో 417, సీనియర్ ఎంపీసీలో 951 మార్కులు సాధించారు. టేకులపల్లి గురుకులంలో ఎంపీసీలో పద్మశ్రీ-446, సీనియర్ ఎంపీసీలో శ్రావణి-972 మార్కులు సాధించారు. నేలకొండపల్లి గురుకులంలో సీనియర్ ఎంపీసీలో శ్రేష్ట 981, శిరీష-975, ప్రథమ ఎంపీసీలో 439 మార్కులతో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు. ఖమ్మం బాలికల గురుకులంలో ఎంపీసీలో నీరజ 976, రమ్య 974, ప్రథమ ఎంపీసీలో పద్మజ 461 మార్కులు సాధించారు. కల్లూరు గురుకులంలో నర్మద ఎంఈసీలో 965 మార్కులతో రాష్ట్ర మార్కులు సాధించింది. రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ కళాశాలల కంటే అత్యుత్తమ మార్కులను గురుకులంలోని విద్యార్థులు సాధించి తమ సత్తాను చాటారు.

మెరుగ్గా ప్రభుత్వ కళాశాలలు..
ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఫీజులు లేకుండానే ప్రవేశాలు కల్పించడం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించడం, పరీక్ష ఫీజు సైతం ప్రభుత్వమే చెల్లించడం వంటి కారణాలతో కళాశాలల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రవేశాలు పొందారు. గతంలో ప్రభుత్వ కళాశాలల్లో నిర్ణీత సమయానికి సిలబస్ పూర్తికాక సున్నా ఉత్తీర్ణత వచ్చిన కళాశాలలు కూడా ఉన్నాయి. 50 శాతం ఉత్తీర్ణత దాటిన కళాశాలలు ఒకటో, రెండో ఉండేవి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలలకు మహర్దశ పట్టింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎందులోనూ రాజీ లేకుండా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో అధ్యాపకులు తమ స్థాయిలో కృషి చేశారు. జిల్లాలో 19 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉంటే 60 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించిన కళాశాలలు 13 వరకు ఉన్నాయి. విద్యార్థులు సైతం అసాధారణ ఫలితాలు సాధించారు.

ముదిగొండ విద్యార్థినికి 980 మార్కులు..
ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ విభాగంలో ఎస్.సరస్వతి 980 మార్కులు సాధించింది. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించి జిల్లా ఖ్యాతిని చాటింది. ప్రథమ సంవత్సరంలో నాగులువంచ ప్రభుత్వ జూనియర్ కళాశాల 94.19 శాతంతో ప్రథమ స్ధానంలో నిలిచింది. సిరిపురం, పిండిప్రోలు, కామేపల్లి, పెనుబల్లి, బనిగండ్లపాడు కళాశాలలు 60 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించాయి. ద్వితీయ సంవత్సరంలో నాగులువంచ కళాశాల 90 శాతం ఉత్తీర్ణత సాధించింది. కల్లూరు -88, పెనుబల్లి 80 శాతం ఉత్తీర్ణత సాధించాయి.

మొదటి సంవత్సరంలో కేజీబీవీ..
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. జిల్లాలో మూడు కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలు జరగ్గా 62 శాతంతో ఉత్తీర్ణత సాధించారు. కూసుమంచి కేజీబీవీలో 83 శాతం ఉత్తీర్ణత సాధించి 12 మంది విద్యార్థినులు ఏ గ్రేడు సాధించారు. కారేపల్లి కేజీబీవీలో 64 శాతం ఉత్తీర్ణత సాధించగా.. పెనుబల్లి కేజీబీవీలో బైపీసీలో 63 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు జీసీడీఓ ఉదయశ్రీ తెలిపారు.

ఉత్తమంగా రాణించారు..
కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు బోర్డు సెక్రటరీ, డీఐఈఓ ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళికలు అమలు చేశాం. బాగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిని ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. వారి సామర్థ్యాలు పెంచేందుకు అందరు అధ్యాపకులూ ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు తరగతులు నిర్వహించి మెరుగైన ఫలితాలు సాధించేందుకు పాటుపడ్డారు.
-ఏఎస్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.విజయకుమారి

459
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles