వైభవంగా వసంతోత్సవం

Fri,April 19, 2019 11:35 PM

భద్రాచలం, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో నిర్వహించిన వసంతోత్సవం వైభవంగా జరిగింది. వేకువ జామున ఆలయ తలుపులు తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. స్వామివారిని బేడా మండపంలో వేంచేయింప చేసి ఒక కలశములో వసంతాన్ని ఆవాహనం చేసి గుక్కా గులాల్, అక్తర్, పన్నీర్ తదితర సుగంధ ద్రవ్యాలు, 9 రకాల ఆహార పదార్థాలు, 9 పసుపు ముద్దలు తయారు చేసి అర్చక స్వాములు ఉదయం 7.1 నిమిషం శుభ ముహూర్తాన అంతరాలయంలో మూలమూర్తులకు మహాకుంభప్రోక్షణం, వసంతం చల్లారు. ఆలయ ప్రాంగణంలోని అనుబంధ ఆలయాల్లో వేంచేసి ఉన్న దేవతలకు సైతం వసంతాన్ని చల్లారు. అనంతరం స్వామివారిని రాజవీధిగుండా అంబాసత్రం వద్దకు తీసుకెళ్లారు.

తదుపరి గోదావరి తీరం వద్దకు ఊరేగింపుగా వెళ్లి తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా తిరుమంజనం గావించారు. స్వామివారికి అభిషేకం జరిపారు. సాయంత్రం తాతగుడి సెంటర్ వరకు తిరువీధిసేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో 8వ రోజు ఇటువంటి అరుదైన వేడుక నిర్వహించడం ఆనాదిగా వస్తున్న సంప్రదాయం. శుక్రవారం, పౌర్ణమి కావడంతో ఈ ఉత్సవానికి ప్రత్యేక విశేషం సంతరించుకుంది. భక్తులు భద్రాద్రి రాములవారిని వీక్షించి పునీతులయ్యారు. ఇదిలా ఉండగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఉదయం చక్రతీర్థం, సాయంత్రం పూర్ణాహుతి, రాత్రి ద్వాదశ ప్రదక్షిణలు, ధ్వజావరోహణం, ద్వాదశారాధనలు, శేషవాహనసేవ, శ్రీపుష్పయాగం, ఉత్సవ సమాప్తి తదితర వేడుకలు నిర్వహించనున్నారు. స్వామివారి నిత్యకల్యాణాలు ఆదివారం నుంచి పునఃప్రారంభం అవుతున్నట్లు దేవస్థానం ఈవో తాళ్లూరి రమేష్‌బాబు నమస్తే తెలంగాణకు తెలిపారు.

404
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles