ఇక అంతా ఆన్‌లైన్‌లోనే..

Sat,April 20, 2019 11:57 PM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఇక అన్ని ఆన్‌లైన్‌లోనే భక్తులకు సేవలు అందనున్నాయి. ఈ మేరకు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి తాళ్లూరి రమేష్‌బాబు ఇందుకు సంబంధించిన కసరత్తులు నిర్వహిస్తున్నారు. భద్రాచలం దివ్యక్షేత్రం దక్షిణ అయోధ్యపురిగా భాసిల్లుతోంది. ప్రపంచ పుణ్యక్షేత్రంగా ఉన్న రామక్షేత్రానికి దేశ నలుమూలల నుంచి భక్తులు నిత్యం తరలివస్తుంటారు. ఈ క్రమంలో భక్తులకు కొంత ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆర్జిత సేవలు, వసతి సౌకర్యం తదితర వాటిలలో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఇక ఆన్‌లైన్‌లో అన్నిరకాల సేవలు అందించాలని దేవస్థానం నిర్ణయించింది. స్వామివారికి చేసే అభిషేక టికెట్లు, శాశ్వత సేవల రుసుమలు, నిత్యసేవల రుసుములు, అన్నదానం తదితర వాటితో పాటు దేవస్థానానికి సంబంధించిన కాటేజీలు, రూంలు భక్తులు పొందాలంటే ఆన్‌లైన్‌లో సేవలను వినియోగించుకోవచ్చు. దీంతో దేవస్థానం అకౌంట్‌లోకి నేరుగా నగదు వచ్చి చేరుతోంది. ఇక నుంచి మ్యానివల్ టికెట్లు లభించవు.

కంప్యూటరీకరణ చేసి టికెట్లను కూడా కంప్యూటర్ ద్వారా దేవస్థానం అందజేయనుంది. స్వైప్ ద్వారా కూడా నగదు చెల్లించవచ్చు. ఇందుకోసం దేవస్థానం ప్రత్యేక కంప్యూటర్ పరికరాలను కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన మిషనరీలు సైతం దేవస్థానం చేరాయి. త్వరలోనే కమిషనర్ నుంచి అనుమతులు రాగానే ఆన్‌లైన్ సేవలు ప్రారంభిస్తామని దేవస్థానం ఈవో తాళ్లూరి రమేష్‌బాబు వెల్లడించారు. ఇటీవల జరిగిన శ్రీసీతారాముల కల్యాణం, పట్టాభిషేకం సందర్భంగా కూడా టికెట్లను దేవస్థానం ఆన్‌లైన్‌లోనే విక్రయించింది. గతేడాది 50శాతం కల్యాణం టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టగా, ఈ ఏడాది 75శాతం ఆన్‌లైన్‌లో ఉంచడం గమనార్హం. ఆన్‌లైన్‌లోనే దేవస్థానం కాటేజీలు, రూమ్‌లు బుకింగ్ సైతం ఇక ఉండనుండటంతో భక్తులకు వసతి అసౌకర్యం కూడా తొలగనుంది.

358
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles