పవిత్ర గోదావరిలో చక్రస్నానం..

Sat,April 20, 2019 11:58 PM

- భద్రాద్రిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు..

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో నిర్వహిస్తున్న వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం పవిత్ర పావన గోదావరి నదిలో స్వామివారి సుదర్శన చక్రానికి చక్రస్నానం గావించారు. శ్రీసీతారామచంద్ర స్వామివారిని, సుదర్శన చక్రాన్ని రామాలయం నుంచి పల్లకీలో ఊరేగింపుగా గోదావరి తీరం వరకు తీసుకొచ్చారు. అక్కడ ఉన్న పునర్వసు మండపంలో పంచామృతాలతో స్నపన తిరుమంజనం గావించారు. అనంతరం చక్రస్నానం చేయించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుణ్యనదిలో స్నానాలు ఆచరించారు. అనంతరం రామాలయానికి చేరుకున్నారు. సాయంత్రం పూర్ణాహుతి జరిపారు. రాత్రి ద్వాదశ ప్రదక్షిణలు, ద్వజావరోహనం, ద్వాదశరాధనములు నిర్వహించారు. రాత్రి శేషవాహనంపై స్వామివారికి తిరువీధిసేవ నిర్వహించారు.

భద్రాద్రిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు..
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఏప్రిల్6 నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా, దేవస్థానం ఈ ఉత్సవాలను సాంప్రదాయబద్దంగా నిర్వహించింది. ఈ ఉత్సవాల్లో ప్రధాన వేడుకలు ఏప్రిల్14న శ్రీసీతారాముల కల్యాణం, ఏప్రిల్15న శ్రీరామ మహా పట్టాభిషేకోత్సవం అత్యంత అంగరంగవైభవంగా నిర్వహించారు. దేశ నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు ఈ ప్రధాన వేడుకలకు హాజరయ్యారు. భక్తుల రాకకనుగుణంగా దేవస్థానం అన్ని ఏర్పాట్లను చేసింది. ఈ ఏడాది నిర్వహించిన బ్రహ్మోత్సవాలు పగడ్బందీ ప్రణాళికతో జరపడంతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా విజయవంతంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల నిర్వహణకు సహకరించిన అందరికి భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో తాళ్లూరి రమేష్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు.

310
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles