పరిషత్ ఎన్నికలకు మోగిన నగారా..!

Sat,April 20, 2019 11:59 PM

- ఎంపీటీసీలు 289, ఎపీపీలు 20,జడ్పీటీసీలు 20
- జిల్లాలో 1612 పోలింగ్ కేంద్రాలు
- మూడు విడతల్లో ఎన్నికలు
- మొదటి విడతలో 7, రెండో విడతలో 6, మూడో విడతలో 7 మండలాలు..
- మండల కేంద్రాలకు చేరిన ఎన్నికల సామగ్రి
- జిల్లాలో 7,73,345 మంది ఓటర్లు
- స్థానిక సంస్థల ఓటర్లలోనూ మహిళలే అధికం

మామిళ్లగూడెం: జిల్లా, మండల ప్రజా పరిషత్ ఎన్నికలకు నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ప్రకటన విడుదల చేయడంతో జిల్లాలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటి వరకు జరిగిన ఎమ్మెల్యే, గ్రామపంచాయతీ, ఎంపీ ఎన్నికలల్లో ఓటర్లు వరసగా మూడుసార్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. 4వ సారి మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. జిల్లాలో మూడు విడతల్లో పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల విధులు నిర్వహించేందుకు 20 మండలాల సిబ్బందికి ఈ నెల 15,16,17 తేదీల్లో శిక్షణా తరగతులు నిర్వహించారు. పీవోలు, ఏపీవో ఆయా మండల కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులకు జిల్లా స్థాయిలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నియమనిబంధనలపై శిక్షణ పూర్తి చేశారు. ఎన్నికల నియమనిబంధనలకు సంబంధించిన కరదీపికలు ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరడంతో వాటిని మండల కేంద్రాలకు పంపించారు. బ్యాలెట్ పత్రాల ముద్రణకు సంబంధించిన ప్రింటింగ్‌ప్రెస్‌ల ఎంపిక కూడా పూర్తి చేశారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించనుండటంతో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు విడివిడిగా బ్యాలెట్లను వినియోగించనున్నారు. నామినేషన్ పత్రాలను ఆన్‌లైన్ ద్వారా దాఖాలు చేసినప్పటికీ హార్డ్ కాపీని స్థానిక ఎన్నికల అధికారికి అందజేయాల్సి ఉంది.

ఎన్నికలకు 3,850 మంది..
జిల్లాలో ఎన్నికల విధులను నిర్వహించేందుకు పీవోలు, ఏపీవోలుగా 3,850 మంది సిబ్బందిని నియమించి వారికి ఉత్తర్వులను జారీ చేశారు. జిల్లాలో పరిషత్ ఎన్నికల పనులు అధికారులు మరింత ముమ్మరం చేశారు. ఎన్నికలకు అవసరమైన సామగ్రిని శుక్రవారం సాయంత్రం వరకు మండలకేంద్రాలకు తరలించారు. అదే విధంగా ఇప్పటి వరకు ఓట్లు నమోదు చేసుకున్న ఓటర్ల వివరాలతో మండలాల వారీగా వివరాలు ప్రకటించారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లు గెజిట్ ద్వారా ప్రకటించారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వేషన్ అయింది. దీంతో జడ్పీ పీఠం దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి.

ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు ఇలా..
జిల్లాలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాలోని 20 గ్రామీణ మండలాల్లో 289 ఎంపీటీసీ స్థానాలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని 20ఎంపీపీలు, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను పూర్తి చేశారు. కలెక్టర్ మండల ప్రజా పరిషత్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను పూర్తి చేసి పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి అనుమతులు తీసుకున్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల రిజర్వేషన్ల ప్రక్రియను కమిషనర్ పూర్తి చేసి ప్రభుత్వ అనుమతులను పొందారు. తర్వాత రిజర్వేషన్లను గెజిట్ ద్వారా ప్రకటించారు. జిల్లాలో ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం పోలింగ్ కేంద్రాల ఎంపిక, ప్రతీ ఎంపీటీసీ స్థానానికి 400కు తక్కువ కాకుండా ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం, మరికొన్ని 600పైన ఓటర్లు ఉన్న వారికి పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. ఎన్నికల ఫలితాలు మే 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ప్రకటించనున్నారు.

మూడు దశల్లో ఎన్నికలు...
జిల్లాలో మండల, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి విడతలో 7 జడ్పీటీసీలకు, 112 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 22 నుంచి నామినేషన్ల స్వీకరణతో మొదటి దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. 24వ తేదీన నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అనంతరం 25న స్క్రూట్నీ, 26న ఫిర్యాదులు స్వీకరిస్తారు. 27న నామినేషన్లలో తప్పలున్నా, తప్పుడు సమాచారమిచ్చినా.. వాటిని తిరస్కరిస్తారు. 28న నామినేషన్ పత్రాల ఉపసంహరణ, అదేరోజు సాయంత్రం 5 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. మే 6వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి దశలో నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ముదిగొండ, కామేపల్లి, సింగరేణి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

రెండో విడతలో...
రెండవ దశలో 6 జడ్పీటీసీలు, 85 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటికి ఈ నెల 26 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 28వ తేదీన నామినేషన్ల దాఖలుకు తుది గడువుగా నిర్ణయించారు. 29న స్క్రూట్నీ, 30 వ తేదీన నామినేషన్లపై ఫిర్యాదులను స్వీకరిస్తారు. మే 1వ తేదీన నామినేషన్లలో తప్పులున్న, తప్పుడు సమాచారం ఇచ్చిన వాటిని తిరస్కరిస్తారు. మే 2వ తేదీన ఉపసంహరణ పత్రాలను స్వీకరిస్తారు. అనంతరం అదే రోజు సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఈ దశలో ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు మండలాలో ఎన్నికలు జరగనున్నాయి.

మూడోవ విడతలో...
మూడోవ దశలో 7 జడ్పీటీసీలకు, 92 ఎంపీటీసీలకు జరగనున్నాయి. వాటికి ఏప్రిల్ 30వ తేదీ నుంచి మూడోవ విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. మే 2వ తేదీన నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనుంది. మే 3న స్క్రూట్నీ నిర్వహిస్తారు. మే 4వ తేదీన నామినేషన్లపై ఫిర్యాదులను స్వీకరిస్తారు. మే 5వ తేదీన నామినేషన్లలో తప్పులున్నా.. లేక తప్పుడు సమాచారమిచ్చినా వాటిని తిరస్కరిస్తారు. మే 6వ తేదీన ఉపసంహరణకు దరఖాస్తులను స్వీకరిస్తారు. అనంతరం అదే రోజు సాయంత్ర 5 గంటలకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. మే 14వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, మధిర, బోనకల్, చింతకాని, ఎర్రుపాలెం మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

754
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles