ఇల్లెందు రూ.4 కోట్లు

Mon,April 22, 2019 01:20 AM

ఇల్లెందు నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 21 : ఇల్లెందు ఏరియా బొగ్గు ఉత్పత్తి రికార్డు సృష్టిస్తోంది. రవాణాలో కూడా దూసుకుపోతోంది. రోజుకు ఏడు రేకులు చొప్పున బొగ్గును రైల్వే ద్వారా రవాణ చేస్తోంది. ఏరియాలో కార్మికుల సంఖ్య తక్కువే. అయినప్పటికీ బొగ్గు మాత్రం ఎక్కువ ఉత్పత్తి అవుతోంది. ఇల్లెందు ఏరియాకు గుండెకాయ లాంటి రెండు ఓసీలు ఉన్నాయి. జేకే 5 , కేవోసీలు లక్ష్యానికి మించి బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఫలితంగా ఏరియా ముందు వరుసలో నిలబడుతోంది. ప్రతీ రోజు రూ.4 కోట్ల బొగ్గు ఉత్పత్తి చేయడమేకాకుండా రవాణ చేయడం కూడా గమనార్హం. ఇల్లెందు ఏరియా చిన్నదైనప్పటికీ లక్ష్యాన్ని చేధిస్తూ దూసుకుపోతోంది. లక్ష్యానికి మించి ఉత్పత్తిని చేస్తూ ఏరియాను అగ్రభాగానా నిలబెడుతోంది. ఇల్లెందు ఏరియాలో కేవోసీ, జేకే 5ఓసీలతో పాటు అండర్‌గ్రౌండ్ మైన్ ఉంది. జేకే 5 ఓసీ నుంచి రోజుకు 8 నుంచి 10 వేల టన్నుల బొగ్గును వెలికితీస్తున్నారు. కేవోసీ నుంచి రోజుకు 10 నుంచి 12 వేల టన్నులు వెలికితీస్తున్నారు. ప్రస్తుతం మార్చి నడుస్తున్నప్పటికీ లక్ష్యాన్ని చేధించాయి.

జేకే 5 ఓసీ 54 రోజుల ముందుగానే లక్ష్యాన్ని సాధించింది. అదే విధంగా కేవోసీ మార్చి మొదటి వారంలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ప్రస్తుతం అండర్‌గ్రౌండ్ మైన్‌లో మ్యాన్‌పవర్ లేక బొగ్గును ఉత్పత్తి చేయడం లేదు. ఈ రెండు ఓసీల నుంచే బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. జేకే 5లో జీ 15 గ్రేడ్ లభిస్తుండగా, కేవోసీలో జీ13, జీ17 గ్రేడ్‌లు ఉత్పత్తి అవుతున్నాయి. జీ 15 గ్రేడ్ టన్నుకు రూ.1300 నుంచి రూ.1400 మార్కెట్లో ధర పలుకుతుండగా, జీ 13కు టన్నుకు రూ.2 వేలు ధర లభిస్తోంది. జీ 17 టన్నుకు రూ.100 నుంచి రూ.400 ధర పలుకుతుంది. రోజుకు ఇల్లెందు సీహెచ్‌పీ నుండి ఐదు రేకులు రవాణ జరుగుతుంది. ఒక్కొక్క రేకుకు 59 రైలు వ్యాగన్లు ఉంటాయి. తడికెల పూడి నుండి మరో రేకులు రవాణ జరుగుతుంది. ఇల్లెందు జేకే 5, కేవోసీల నుండి ఉత్పత్తి అవుతున్న 20 వేల టన్నులు, కొత్తగూడెం ఏరియా జీకే ఓసీ నుండి తడికెలపూడికి వస్తున్న 6 వేల టన్నులను ఇల్లెందు ఏరియా రవాణా చేస్తోంది.

మొత్తం మీద రోజుకు 26 వేల టన్నుల రవాణా జరుగుతుంది. ఒక్కొక్క రేకుకు 3600 టన్నుల బొగ్గును రవాణా చేస్తున్నారు. ఏడు రేకులకు కలిపి 26 వేల టన్నులను ఇల్లెందు ఏరియా నుండి రవాణా జరుగుతుంది. రోజుకు 26 వేల టన్నుల ద్వారా ఏరియాకు సుమారు రూ.4 కోట్ల ఆదాయం చేకూరుతుంది. ఇల్లెందు ఏరియాలో ఉత్పత్తి అయిన బొగ్గు ఆంధ్రప్రదేశ్‌లోని కొండపల్లి వీటీపీఎస్, రామగుండం ఎన్‌టీపీసీ, మహారాష్ట్రలోని మహాజెన్కోకు రవాణా చేస్తున్నారు. రోజుకు రూ.4 కోట్ల చొప్పున నెలకు రూ.120 కోట్లు ఆదాయం లభిస్తుంది. సంవత్సరం మొత్తం మీద సుమారు రూ.1400 కోట్లు ఇల్లెందుకు ఆదాయం చేకూరుతుంది. అధిక రవాణా చేసినందుకు గాను ఇల్లెందు కోల్‌హ్యాండ్లింగ్‌ప్లాంట్ (సీహెచ్‌పీ)కు సీఎండీ వరుసగా నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు.

266
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles