నేడు మొదటిదశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ..

Mon,April 22, 2019 01:21 AM

మామిళ్లగూడెం: జిల్లా, మండల ప్రజాపరిషత్ ఎన్నికలకు మొదటి విడత నామినేషన్ల స్వీకరణ నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అధికారులు నామినేషన్ల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేశారు. నామినేషన్లను ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు నామినేషన్లను ఆయా మండల కేంద్రాలలో స్వీకరించనున్నారు. నామినేషన్లను స్వీకరించేందుకు రిటర్నింగ్ అధికారులను గెజిట్ హోదా కలిగిన వారిని నియమించారు. ప్రతీ ఐదు ఎంపీటీసీలకు ఒక రిటర్నింగ్ అధికారి, జడ్పీటీసీకి మరో రిటర్నింగ్ అధికారి మండల కేంద్రంలో ఎన్నికల విధులను నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ప్రకటన విడుదల చేసింది. దీంతో జిల్లాలో మరోసారి ఎన్నికల రాజకీయం వేడెక్కింది. స్థానిక సంస్థలైన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు జిల్లాలో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు ఈ ఎన్నికల చదరంగంలో బరిలోకి దిగనున్నాయి. ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు మండలాల్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణా తరగతులు పూర్తి అయ్యాయి. పీవోలు, ఏపీవో ఆయా మండల కేంద్రాలలో, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు జిల్లాస్థాయిలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నియనిబంధనలపై శిక్షణలను పూర్తిచేశారు. ఎన్నికల నియమ నిబంధనలకు సంబంధించిన కర దీపికలను ఇప్పటికే మండల కేంద్రాలకు పంపించారు.

బ్యాలెట్ పత్రాల ముద్రణ కొనసాగుతుంది. బ్యాలెట్ ద్వారా జరగనున్న ఎన్నికలకు ఎంపీటీసీ, జడ్పీటీసీలకు విడివిడిగా బ్యాలెట్‌లను వినియోగించనున్నారు. నామినేషన్ పత్రాలను ఆన్‌లైన్ ద్వారా దాఖాలు చేసినప్పటికి హార్డ్‌కాపీని స్థానికి ఎన్నికల అధికారికి తప్పని సరిగా అందజేయాల్సి ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి ఓట్లు నమోదు చేసుకున్న ఓటర్ల వివరాలతో మండలాల వారీగా వివరాలు ప్రకటించారు. ఎంపీటీసీలు, ఎపీపీ, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లు గెజిట్ ద్వారా ప్రకటించారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజేర్వేషన్ కావడంతో మరో పక్క రాజకీయ వర్గాలు ఆ దిశగా స్థానిక సమరానికి సిద్ధం అవుతున్నారు. జడ్పీపీఠం దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధికార యంత్రాంగం దానికి అనుగుణంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

జడ్పీటీసీలు, ఎంపీపీ చైర్మన్ల రిజర్వేషన్లు ఇలా..
ఖమ్మం జిల్లాలో తొలి విడతలో జరుగుతన్న ఎన్నికలల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీ చైర్మన్ రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. మండలాల్లో 112 ఎంపీటీసీల, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ రిజర్వేషన్‌ల ప్రక్రియను మండలాలకు మండల ప్రజా పరిషత్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లు జిల్లా కలెక్టర్ కసరత్తును పూర్తిచేసి పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి అనుమతుల తరువాత రిజర్వేషన్లను గెజిట్ ద్వారా ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం పోలింగ్ కేంద్రాల ఎంపిక, ప్రతీ ఎంపీటీసీ స్థానానికి 400కు తక్కువ కాకుండా ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం, మరికొన్ని 600ల పైన ఓటర్లు ఉన్న వారికి పోలింగ్ కేంద్రాలను కేటాయించారు.

మొదటి విడతలో జిల్లాలో మండల, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఈ దశలో 7 జడ్పీటీసీలకు, 112 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత ఎన్నికలకు నేటినుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. 24వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. 25న స్క్రూట్నీ, 26న ఫిర్యాదులు స్వీకరిస్తారు. 27న నామినేషన్లలో తప్పలున్నా, తప్పుడు సమాచారం ఇచ్చిన వాటిని తిరస్కరిస్తారు. 28న నామినేషన్ పత్రాల ఉపసంహరణ, అదేరోజు సాయంత్రం 5 గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. మే 6వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి దశలో నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, ముదిగొండ, కామేపల్లి, సింగరేణి మండలాలో ఎన్నికలు జరగనున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని నామినేషన్ వేసిన నాటినుంచే ప్రారంభించనున్నారు. ఎన్నికల ఫలితాలు మే 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ప్రకటించనున్నారు.
నామినేషన్లకు జత చేయాల్సినవి ఇవే..
-ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థులు తమ నామినేషన్ల పత్రాలలో కీలకమైన ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంది.
-ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయరాదు. ఒకవేళ నామినేషన్ వేసిన వాటిని ఉపసంహరించుకోవాలి. లేకుంటే తిరస్కరణకు గురవుతుంది.
-ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి.
-అభ్యర్థులు తమ నేర చరిత్ర ఉంటే దానికి సంబంధించిన వివరాల డిక్లరేషన్, లేకున్నా లేనట్లుగా డిక్లరేషన్ జత చేయాలి.
-పోటీ చేస్తున్న అభ్యర్థులు అప్పులు, ఆస్తులు, ఆదాయ వివరాల డిక్లరేషన్ జత చేయాలి.
-బ్యాంకు ఖాతా వివరాలు
-ఓటరు గుర్తింపు కార్డు, ఇతర ఏదైనా ప్రభుత్వం ద్వారా జారీ చేసిన గుర్తింపు కార్డులను జత చేయాలి.

403
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles