రాయితీ విత్తనాలు రెడీ..

Sun,May 19, 2019 12:40 AM

-ఉమ్మడి జిల్లా రైతుల అవసరాలకు తగ్గట్టుగా అందుబాటులో..
-పంపిణీకి సిద్ధం చేసిన టీ సీడ్స్ కార్పొరేషన్
-రెండు జిల్లాల్లో ప్రారంభమైన పచ్చిరొట్ట విత్తనాలు
-రాయితీలు ప్రకటించిన టీ సీడ్స్ కార్పొరేషన్

ఖమ్మం వ్యవసాయం, మే 18: వానాకాలం సీజన్‌కు అవసరమైన విత్తనాలు రైతులకు అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. గత నెల రోజుల క్రితమే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు విత్తనాల ఇండెంట్‌ను తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్‌కు అందించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సీడ్స్ కార్పొరేషన్ అధికారులు విత్తనాలను ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరికొద్ది రోజుల్లోనే సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ముందస్తుగానే పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 96 సొసైటీల ద్వారా రాయితీ విత్తనాల పంపిణీ జరగనుంది.

ఆన్‌లైన్ పద్ధతిలో విత్తనాల పంపిణీ..
ప్రభుత్వం రైతులకు అందించే రాయితీ విత్తనాల పంపిణీలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ సంవత్సరం ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆయా సొసైటీల నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టించడం, అవసరానికి మించి విత్తనాలు కొనుగోలు చేసే వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోనున్నారు. రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాసుబుక్ జిరాక్స్‌లను మండల వ్యవసాయశాఖ అధికారికి అందిస్తే భూమికి తగ్గట్టుగా సదరు అధికారి విత్తనాలు తీసుకునేందుకు ఆన్‌లైన్‌లో పర్మిట్ ఇవ్వనున్నారు. అదే విధంగా ఆన్‌లైన్ రశీదును సైతం సదరు రైతుకు అందజేస్తారు. ఆ రశీదును తీసుకున్న తరువాతనే సొసైటీల బాధ్యులు అందుకు తగ్గటుగా విత్తనాలను పంపిణీ చేస్తారు.

ఖమ్మం జిల్లా ఇండెంట్...
జిల్లా వ్యవసాయశాఖ తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్‌కు అందించిన ఇండెంట్‌కు అనుగూణంగా సదరు అధికారులు ఇప్పటికే జిల్లా కేంద్రాంలో విత్తనాలు నిల్వ చేశారు. వాటిలో పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించి దాదాపు 16వేల క్వింటాల విత్తనాలను ఆయా వ్యవసాయ సహకార సంఘాలకు పంపిణీ చేశారు. ఏవోలు సేకరించిన వివరాల ప్రకారం పచ్చిరొట్ట విత్తనాలు 12,500 క్వింటాలు కాగా, 7, 500 క్వింటాలు సొసైటీలకు పంపిణీ జరిగింది. పిల్లిపెసర 6వేల క్వింటాలు కాగా, 2వేల క్వింటాల పంపిణీ జరిగింది. పెసర్లు 2,910 క్వింటాలు, వరి 15వేల క్వింటాలు, మినుములు 150 క్వింటాలు, కందులు 50 క్వింటాలు, నువ్వులు 50 క్వింటాలు, జనుము 635 క్వింటాలు అవసరం ఉంటుందని వ్యవసాయశాఖ నుంచి సీడ్స్ కార్పొరేషన్ ఇండెంట్ స్వీకరించడం జరిగింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ..
వానాకాలం సీజన్‌కు ముందుగానే చల్లుకున్నే పచ్చిరొట్ట విత్తనాలను ఆయా సొసైటీలకు పంపిణీ చేసే కార్యక్రమంలో భద్రాద్రి జిల్లాలో ప్రారంభమైంది. ఇప్పటికే జిల్లాకు 1,800 క్వింటాలు జీలుగలు అవసరం కాగా వాటిలో 900ల క్వింటాలను సొసైటీలకు తరలించారు. ఈ సంవత్సరం వరి 7వేల క్వింటాలు, మినుములు వంద క్వింటాలు, పెసర్లు 282 క్వింటాలు, కందులు 38 క్వింటాలు, నువ్వులు 50 క్వింటాలు, పిల్లిపెసర 1000 క్వింటాలు, జనుము 267 క్వింటాలు అవసరముంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇండెంట్‌కు అదనంగా అవసరం ఏర్పడప్పటికీ తక్షణం విత్తనాలను సరఫరా చేసేందుకు సీడ్స్‌కార్పొరేషన్ సిద్ధంగా ఉంది.

అవసరానికి తగ్గట్టుగా విత్తన నిల్వలు...
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతాంగానికి అవసరమైన విత్తనాలను అందించేందుకు సీడ్స్ కార్పొరేషన్ సిద్ధంగా ఉంది. ఏ ఒక్కరైతుకు ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా ప్రణాళిక రూపొందించాం. గత పక్షం రోజుల నుంచి ప్రాసెసింగ్ విత్తనాల ప్యాకింగ్ జరుగుతుంది. ముందస్తుగా సాగుచేసుకునేందుకు వీలుగా పచ్చిరొట్ట విత్తనాలు సొసైటీలకు పంపిణీ చేస్తున్నాం. మండల వ్యవసాయశాఖ అధికారుల సూచనలకు అనుగుణంగా పంపిణీ జరుగుతుంది.
-ఏ రాజీవ్‌కుమార్, ఉమ్మడి ఖమ్మం జిల్లా టీ సీడ్స్ కార్పొరేషన్ మేనేజర్

373
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles