హరితహారం నర్సరీల పనితీరు భేష్

Wed,May 22, 2019 02:05 AM

-అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియల్ ప్రశంస
-సత్తుపల్లి నయోజకవర్గంలో నర్సరీల పరిశీలన

సత్తుపల్లి, మే 21, (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం పథకంలో భాగంగా ఐదో విడుత కోసం నిర్వహిస్తున్న నర్సరీలను అదనపు పిన్సిపల్ ఛీఫ్ కన్జర్వేటర్ ఆర్‌ఎం డోబ్రియల్ మంగళవారం పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలో తల్లాడ మండలం కలకొడిమె, పెనుబల్లి మండలం ఎడ్ల బంజర్, సత్తుపల్లి మండలంలోని చెరుకుపల్లి గ్రామాల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక డివిజన్ కార్యాలయంలో మొక్కనాటి నీరు పోశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జూన్ 3వ వారంలో తొలకరి రానుండడంతో నర్సరీలలో పెరుగుతున్న మొక్కలను పంపిణీకి సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. చెరుకుపల్లి నర్సరీలో పెరుగుతున్న శ్రీగంధం మొక్కల పరిపూర్ణ ఎదుగుదలను ఆయన ప్రత్యేకంగా పరిశీలించి వాటి పొడవును స్వయంగా గమనించారు. నర్సరీ నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ రేంజ్ అధికారి వెంకటేశ్వర్లు, సెక్షన్ అధికారి మదన్‌లను అభినందించారు. నర్సరీల్లో ఉన్న మొక్కలు నాటిన తరువాత కూడా ఇదే రీతిలొ ఎదిగే విధంగా ప్రతి పౌరుడూ సామాజిక బాధ్యత తీసుకోవాలని సూచించారు. తద్వారా ప్రకృతి రమణీయత సంతరించడంతోపాటు వాతావరణ కాలుష్యం తగ్గి రుతువులు సకాలంలో వస్తుంటాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావడం ద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఛీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి రాజారావు, డీఎఫ్‌ఓ ప్రవీణ్, రేంజర్ వెంకటేశ్వరరావు, ఎఫ్‌ఎస్‌ఓ ఆంగోతు మదన్, బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

257
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles