రైతులు ఆక్వా సెంటర్ల సహకారం తీసుకోవాలి..

Thu,May 23, 2019 12:29 AM

కూసుమంచి, మే22: మత్స్య రైతులు ఆక్వాసెంటర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలని స్టాంప్ ఐటీ బిజినెస్ సొల్యూషన్స్ సహ వ్యవస్థాపకుడు వల్లెపు కృష్ణ అన్నారు. పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రంలో జరుగుతున్న తొమ్మిది రాష్ర్టాల ప్రతినిధుల శిక్షణ కార్యక్రమంలో ఆయన బుధవారం ఆక్వాసెంటర్ల ఆవశ్యకతపై ప్రత్యేక ఉపన్యాసం చేశారు. తమ సంస్థ ద్వారా ఇప్పటివరకు దేశంలో 25 ఆక్వావన్‌సెంటర్లు ఏర్పాటు చేశామని, త్వరలో మరో ఐదు సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈసెంటర్ల నుంచి ప్రతిమత్స్య రైతుకు చేపల పెంపకంలో ఆధునిక విధానాలు, పెంపకానికి అనువైన రకాల ఎంపిక, వ్యాధుల నివారణ, మార్కెటింగ్ తదితర అంశాలపై పూర్తిస్థాయిలో తర్ఫీదు ఇస్తున్నామని చెప్పారు. అంతేకాక మత్స్య రంగంలో ఏర్పడే ఇబ్బందులను అదిగమించి, అధిక ఉత్పత్తి సాధించిన వారి వివరాలను రికార్డు చేసి, ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. పెబ్బేరు మత్స్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బీయూ సుప్రీత మాట్లాడుతూ.. చేపలు, రొయ్యల్లో వచ్చే వ్యాధుల నివారణ, చేపల నిల్వకు అనువైన మార్గాలను వివరించారు. చేపలు చెడిపోవడానికి కాలుష్యం, ఎంజైములు, రసాయనిక చర్యలు, సూక్ష్మక్రిములు ప్రధాన కారణాలని తెలిపారు. రాష్ట్ర మత్స్యశాఖ ఉపసంచాలకులు ఎస్.మురళీకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం నీటి వనరుల్లో మూడోస్థానంలో ఉండగా, చేపల ఉత్పత్తిలో ఎనిమిదో స్థానంలో ఉందన్నారు. మత్స్య రైతులకు రుణాలు, ఇతర పరికరాలు అందించి, ప్రోత్సహిస్తూ.. 2025 నాటి తెలంగాణలో ప్రస్తుతం ఉత్పత్తి జరుగుతున్న 2.97 లక్షల టన్నుల ఉత్పత్తికి రెట్టింపు ఉత్పత్తి సాధించి, రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. లక్నోలోని చేప జన్యువనరులు జాతీయ సంస్థ, భువనేశ్వర్‌లోని జాతీయ మంచినీటి చేపల పెంపకం సంస్థల సహకారంతో ఆధునిక పద్ధతులతో అధిక ఉత్పత్తి సాధించే రకాలను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన వివరించారు.

243
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles