గిరి బిడ్డల ప్రతిభకు పట్టాభిషేకం

Sat,May 25, 2019 01:53 AM

-టెన్త్‌లో అత్యధిక జీపీఏ సాధించిన విద్యార్థులకు పురస్కారాలు
-విద్యార్థులతో సహపంక్తి భోజనాలు చేసి ప్రోత్సహించిన కలెక్టర్, ఐటీడీఏ పీవో
-మానవాళి అభివృద్ధి సూచిక విద్య : కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ
-విద్యార్థుల్లో నైపుణ్యాలను గమనించి ప్రోత్సహించాలి: పీవో వీపీ గౌతమ్
భద్రాచలం, నమస్తే తెలంగాణ: ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ, గురుకుల, స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఈ ఏడాది పదవ తరగతి పరీక్షా ఫలితాలు మెరుగ్గా వచ్చాయి. దీంతో జిల్లా అధికార యంత్రాంగంలో ఆనందోత్సవాలు రెట్టింపు అయ్యాయి. అత్యధిక జీపీఏ సాధించిన విద్యార్థులను ప్రోత్సహిస్తే మరికొంత మందికి స్ఫూర్తి ప్రధాతలవుతారని భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ భావించారు. ఈ క్రమంలో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, వారికి బోధించిన ఉపాధ్యాయులను శుక్రవారం భద్రాచలం పిలిపించి ఘనంగా సత్కరించారు. అంతేకాదు కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ, ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్‌లు విద్యార్థులతో సహపంక్తి భోజనాలు చేసి వారిలో ఆనందాన్ని పంచారు. ఈ అరుదైన వేడుకలో పాల్గొన్న విద్యార్థులు ఆధ్యాంతం ఆనందభరితులయ్యారు.

టెన్త్‌లో అత్యధిక మార్కులు సాధించిన
విద్యార్థులకు పురస్కారాలు..
పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ఈ ఏడాది భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ, గురుకుల, స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ విద్యార్థులు అత్యధిక మార్కులను కైవసం చేసుకున్నారు. వీరికి శుక్రవారం భద్రాచలం అన్నపూర్ణ ఫంక్షన్‌హాల్‌లో అభినందనసభ నిర్వహించారు. టెన్త్‌లో అత్యధిక మార్కులు సంపాధించిన వి.సింహాద్రి (ఎస్‌టీబీహెచ్ ఇల్లెందు 10జీపీఏ) మార్కులు, జీ.స్వాతి (ఏజీహెచ్‌ఎస్ కాచనపల్లి 9.7), కే.రజిత (ఏజీహెచ్‌ఎస్ పెద్దమిడిసిలేరు 9.5), ఎం.లిఖిత (ఏజీహెచ్‌ఎస్ అంకంపాలెం 9.5), ఏ.లక్ష్మణ్ (ఎస్‌టీబీహెచ్ తిమ్మారావుపేట 9.5), ఎల్.నితిన్ (ఏహెచ్‌ఎస్ బొజ్జాయిగూడెం 9.5), బి.స్వాతి (ఏజీహెచ్‌ఎస్ అంకంపాలెం 9.3), ఎం.స్రవంతి ఏజీహెచ్‌ఎస్ అంకంపాలెం 9.3), ఎస్.పద్మ (ఏజీహెచ్‌ఎస్ అంకంపాలెం 9.2), ఎస్.మల్లేశ్వరి (ఏజీహెచ్‌ఎస్ పెద్దమిడిసిలేరు 9.2), యూ.ఐశ్వర్య (ఏజీహెచ్‌ఎస్ అంకంపాలెం 9.2), జే.దేవి (ఏజీహెచ్‌ఎస్ అంకంపాలెం 9.2), బి.శైలజ (ఏజీహెచ్‌ఎస్ అంకంపాలెం 9.2), డి.పరమేష్ (ఎస్‌టీబీహెచ్ ఇల్లెందు 9.2) జీపీఏ మార్కులు పొందారు. కాగా వీరిని జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ, ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్‌లు అభినందించారు. వీరికి మెడల్, మెమోంటోలు అందజేశారు. వీరి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను సన్మానించారు.

మానవాళి అభివృద్ధి సూచిక విద్య
కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ..
మానవాళి అభివృద్ధి సూచిక విద్య అని జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ తెలిపారు. టెన్త్ అత్యధిక మార్కులు పొందిన విద్యార్థుల అభినందన సభలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. మనిషి ఏ రంగంలో రాణించాలన్నా విద్య చాలా ముఖ్యమైందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులకు, గ్రామానికి, జిల్లాకు, రాష్ర్టానికి మంచిపేరు తీసుకరావాలని కోరారు. విద్య ద్వారానే జీవితాల్లో ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉందన్నారు. ఆయా రంగాల్లో ఉన్న సాంకేతిక విషయాలను తెలుసుకోవడానికి విద్య చాలా అవసరమన్నారు. పదవ తరగతిలో మంచి గ్రేడింగ్ సాధించినందుకు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్‌లో కూడా ఇదే గ్రేడింగ్ సాధించాలని సూచించారు. గిరిజన విద్యార్థుల్లో ఉన్న ప్రతిభా పాటవాలను వెలికి తీసి వారు సమాజాభివృద్ధిలో పాలుపంచుకునే విధంగా తయారు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఈ సంవత్సరం పదవ తరగతిలో 84.10శాతం ఉత్తీర్ణత సాధించామని, గతేడాది కంటే 13శాతం ఫలితాలు పెరిగాయన్నారు. మారుమూల ప్రాంతాలలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఆశ్రమ, గురుకుల స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను ప్రారంభించినట్లు తెలిపారు. మన విద్యార్థులు మంచి ఆల్‌రౌండర్‌లుగా ఎదగాలని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారు కావాలని ఆకాంక్షించారు. కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే మంచి స్థానాలు అధిరోహించవచ్చునని తెలిపారు.

నైపుణ్యాలను గమనించి
ప్రోత్సహించాలిపీవో వీపీ గౌతమ్
ఇది ఒక ప్రధమ అడుగుగా భావించి సాధించాల్సిన దానికి స్పూర్తిగా నిలవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ విద్యార్థులను కోరారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని గమనించి వారిని ప్రోత్సహించినట్లయితే వారిలో ఉన్న ప్రతిభ బయటకొస్తుందన్నారు. పదవ తరగతి అనంతరం ఇంటర్మీడియట్ నందు ప్రభుత్వం విద్యను అందిస్తుందని, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వచ్చేనెల 4వరకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. పదవ తరగతి చదివిన విద్యార్థులు ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్ నందు ఇబ్బంది రాకుండా ఉండాలనే ఆశయంతో స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమాన్ని నెల రోజులపాటు నిర్వహించడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులు మాట్లాడుతూ...ఉపాధ్యాయులు చక్కని ప్రణాళికతో పరీక్షలకు సిద్దం చేయడం వలన మంచి గ్రేడింగ్ సాధించినట్లు తెలిపారు. వసతి గృహాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని విద్యార్థులు వెల్లడించారు. ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనాల్లో పాల్గొని వారిలో స్పూర్తిని నింపడం గమనార్హం. ఈ కార్యక్రమంలో డీడీ జహీరుద్దీన్, ఆర్‌సీవో రాజ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

259
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles