ఢిల్లీ గడ్డపై రాములోరి పెళ్లి..!

Sat,May 25, 2019 01:54 AM

జూన్1న ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా వేడుక
కల్యాణం నిర్వహించనున్న
భద్రాచలం రామాలయం అర్చక స్వాములు
ఢిల్లీ తరలివెళ్లనున్న దేవస్థానం అధికారులు, సిబ్బంది
దేశ రాజధానిలో రాములోరి కల్యాణం ఇది రెండోసారి
భద్రాచలం, నమస్తే తెలంగాణ: భారతదేశంలో ఉన్న రామక్షేత్రాలన్నింటిలో రాముడు ద్విభుజుడు (రెండు భుజములు కలవాడు). భద్రాచలం రాముడు మాత్రమే చతుర్భుజుడు (నాలుగు భుజాలు కలవాడు). విష్ణు చిహ్నాలుగా శంఖ చక్రాలను, రామ చిహ్నాలుగా ధనస్సు, బాణములను ధరించి ప్రకాశిస్తున్నాడు. శ్రీ సీతామహాలక్ష్మీ వామాంకమున (ఎడమ తొడపై) ఆశీనురాలైంది. ఆదిశేషుడైన లక్ష్మణస్వామి ప్రక్కన దనుర్భాణాలు ధరించి విలసిల్లుతున్నాడు. అందుకే భద్రాద్రి రాముడు లోక రాముడు. ప్రతిఏటా సంప్రదాయంగా భద్రాద్రిలో సీతారాముల కల్యాణం అంగరంగవైభవంగా జరుగుతోంది. ప్రభుత్వమే ఈ వేడుకను నిర్వహిస్తోంది. ఇటీవల ఈ అపురూప రాములోరి కల్యాణం నిర్వహించడం జరిగింది. కాగా, ఈ ఏడాది ఢిల్లీ గడ్డపై రాములోరి కల్యాణాన్ని జరపాలని ప్రభుత్వం తలపెట్టింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో భాగంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో సీతారాముల కల్యాణం జరగనుంది. ఈ మేరకు ఢిల్లీ తెలంగాణ భవన్ నుంచి దేవస్థానానికి ఆహ్వానం అందింది. భద్రాచలంలో సీతారాముల కల్యాణం నిర్వహించే అర్చకస్వాములందరిచే ఈ కల్యాణం ఢిల్లీలో అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జూన్1న ఢిల్లీ తెలంగాణ భవన్‌లో రాములోరి కల్యాణం..
తెలంగాణ ఆవిర్భావ సంబురాలు జూన్2న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జూన్1న ఢిల్లీ తెలంగాణ భవన్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని జరపనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీ, రెసిడెంట్ కమిషనర్, వేదాంతం గిరి నుంచి దేవస్థానానికి ఆహ్వానం అందింది. జూన్1న ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ కల్యాణం జరగనుంది. భద్రాచలంలో ఇటీవల శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించిన అర్చకస్వాములు, వేద పండితులు తదితరులు ఢిల్లీలో జరిగే స్వామివారి కల్యాణ తంతును నిర్వహించనున్నారు. అనంతరం మహాప్రసాద వితరణం జరపనున్నారు. ఢిల్లీలో జరిగే ఈ అరుదైన వేడుకకు దేవస్థానం అర్చకులు, వేద పండితులు, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది తదితరులతో ప్రత్యేక ట్రైన్‌లో తరలివెళ్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి తాళ్లూరి రమేష్‌బాబు నమస్తే తెలంగాణకు తెలిపారు.

ఈ కల్యాణ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్, డాక్టర్ మందా జగన్నాథం, కేఎం సహాని తదితరులు సైతం హాజరుకానున్నారు. ఢిల్లీలో మే31 నుంచి జూన్2 వరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ చేనేత, హస్తకళల ప్రదర్శన, హైదరాబాద్ బిర్యానీ, రంజాన్ స్పెషల్ హలీమ్, తెలుగు పచ్చళ్లు, చిరుధాన్యాలు, పోచంపల్లి చీరెలు, హైదరాబాద్ వారి గాజులు, ముత్యాలు, గోల్కొండ హస్తకళ ఉత్పత్తులు తదితర వాటిని ప్రదర్శనలో ఉంచుతున్నారు. పిల్లలకు సంగీతం, నృత్య పోటీలు, ఆట పోటీలు నిర్వహించనున్నారు. ఉచిత ఆరోగ్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. జూన్1న శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం అనంతరం రామదాసు కీర్తనలు, కూచిపూడి నృత్యం, ఫలహార విందు తదితర వాటిని ఏర్పాటు చేస్తున్నారు. పలువురికి బహుమతి ప్రధానం కూడా చేయనున్నారు.

ఢిల్లీలో రాములోరి కల్యాణం ఇది రెండోసారి..
భద్రాద్రి రాముడి కల్యాణం ఢిల్లీలో రెండవసారి జూన్1న జరగబోతోంది. గతంలో 1964వ సంవత్సరంలో ఢిల్లీలో ఒకసారి రాముని కల్యాణం జరిగినట్లు దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి తాళ్లూరి రమేష్‌బాబు గుర్తుచేశారు. ఈసారి అధికారికంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో స్వామివారి ఉత్సవ మూర్తులను ఢిల్లీ తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అక్కడ కల్యాణాన్ని రామాలయం అర్చకులచే అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా ఈ కల్యాణాన్ని తిలకించే అవకాశం ఉందన్నారు.

322
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles