లక్ష్యానికి మించి ధాన్యం సేకరణ..

Sun,May 26, 2019 12:00 AM

-జిల్లాలో ముగిసిన కొనుగోళ్లు..
-1.20 మెట్రిక్ టన్నులకు గాను 1.30 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ..
-రూ. 230 కోట్లలో రూ.104 కోట్లు చెల్లింపులు
-ఐకేపీ ఆధ్వర్యంలో 16, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 74
-24 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ

ఖమ్మం నమస్తేతెలంగాణ: జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించడం పూర్తయినందున కేంద్రాలను మూసి వేశారు. ఈ యాసంగిలో లక్ష్యానికి మించి ధాన్యం సేకరణ జరిగింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ధాన్య సేకరణ అత్యధిక జరిగిన మొదటి 10 జిల్లాల్లో ఖమ్మం జిల్లా నిలిచింది. ఈ రబీ సీజన్‌లో జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించే లక్ష్యంగా పౌర సరఫరాల అధికారులు 90 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా నెల 20వ తేదీ నాటికి 1 లక్ష 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఊహించిన దాని కంటే 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా వచ్చినప్పటికీ అధికారులు రైతులకు, మిల్లర్లకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ఆదేశాలకనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 16,600 మంది రైతుల నుంచి 1.30లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా రైతులకు రూ. 230 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ. 104 కోట్లను చెల్లించారు. మిగిలిన రూ. 126 కోట్లను రోజుకు రూ.10 కోట్ల చొప్పున రైతులకు చెల్లించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

రైతులకు రూ. 126 కోట్లు చెల్లించాల్సి ఉంది..
జిల్లాలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన 18 కొనుగోలు కేంద్రాల ద్వారా 4035 మంది రైతుల నుంచి గ్రేడ్-ఏ రకం 24,500మెట్రిక్ టన్నులు, కామన్ రకం 1752 టన్నులు మొత్తం 26,252 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ప్రాథమిక సహాకార సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన 72 కొనుగోలు కేంద్రాల ద్వారా 12,565 మంది రైతుల నుంచి గ్రేడ్-ఏ 99,710 మెట్రిక్ టన్నులు, కామన్ రకం 4125 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మొత్తం 103,835 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. దీనికి గాను రూ.230 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.103 కోట్లు చెల్లించారు. ఇంకా మిగిలిన రూ.126 కోట్లను చెల్లించాల్సి ఉంది.

ఇతర జిల్లాల మిల్లులకు ధాన్యం తరలింపు...
జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా 1.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగగా 45 వేల మెట్రిక్ టన్నులను వరంగల్ అర్మన్, కరీంనగర్ జిల్లాలోని బాయిల్డ్ రైస్ మిల్లలకు తరలించారు. మరో 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జిల్లాలోని రా రైస్ మిల్లులకు తరలించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ కర్ణన్, జేసీ అనురాగ్ జయంతిలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. వరి ధాన్యం గ్రేడ్-ఏ రకం క్వింటాకు రూ.1770, సాధారణ రకానికి రూ. 1750 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది.

అక్రమాలకు తెర...
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయకముందు వ్యాపారులంతా సిండికేట్‌గా మారి వారు నిర్ణయించిన ధరకే రైతులు విక్రయించాల్సిన పరిస్థితి ఉండేది. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో మార్కెట్‌లోను ధాన్యం ధరలు పెరిగి రైతులకు మేలు కలుగుతుంది. సర్కారు నిబంధనలకు లోబడి ఉన్నటువంటి ధాన్యానికి ధర నిర్ణయించారు. రైతులు కొనుగోలు కేంద్రాలలో విక్రయిస్తే ఈరెండు ధరలలో ధాన్యం రకం ఆధారంగా ధర లభిస్తుంది. తేమశాతం, చెత్త, ఇతర వాటి శాతం అధికంగా ఉంటే మార్కెట్‌లో విక్రయిస్తున్నా, మరీ తక్కువ కాకుండా విక్రయించే పరిస్థితి కేవలం కొనుగోలు కేంద్రాల వల్లే ఏర్పడిందని చెప్పవచ్చు.

286
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles