ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి

Mon,May 27, 2019 02:38 AM

-వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్
వైరా, నమస్తే తెలంగాణ, మే 26: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండలంలోని ముసలిమడుగు గ్రామంలో ముత్యాలమ్మ దేవాలయం నిర్మాణానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామస్తులు, అర్చకులు ఎమ్మెల్యే రాములునాయక్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం అర్చకుల వేదమంత్రాల నడుమ ఎమ్మెల్యే రాములునాయక్ శంకుస్థాపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు తెలంగాణ ప్రాంతంలోని దేవాలయాల అభివృద్ధి గురించి కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ రాష్ట్రంలోని పురాతన దేవాలయాలతో పాటు పలు ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. వందలాది కోట్ల నిధులతో ఈ దేవాలయాల అభివృద్ధిని చేపడుతున్నారని వివరించారు. రాష్ట్రంలో మతసామరస్య పరిరక్షణకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

అదేవిధంగా రాష్ట్రంలోని ముస్లీంలు, క్రైస్తవులు అభివృద్ధికి కూడా కేసీఆర్ పలు చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. అందులో భాగంగానే రంజాన్ సందర్భంగా నిరుపేద ముస్లీంలకు దుస్తుల పంపిణీ, ఇఫ్తార్ విందుల ఏర్పాటు, క్రిస్మస్ సందర్భంగా నిరుపేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ, ప్రేమ విందులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. మత సామరస్యంలో మన రాష్ట్ర దేశానికే ఆదర్శంగా నిలిసిందని అన్నారు. రాష్ట్ర పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పారు. సమాజంలోని ప్రతిఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలన్నారు. భక్తి భావంతోనే మానవునికి మానసిక ప్రశాంతత కలుగుతుందని చెప్పారు. ముసలిమడుగు గ్రామంలో ముత్యాలమ్మ తల్లి దేవాలయం నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తడికమళ్ళ నాగేశ్వరరావు, టీఆర్‌ఎస్ నాయకులు పసుపులేటి మోహన్‌రావు, శీలం వెంకట్రామిరెడ్డి, మిట్టపల్లి నాగి, దార్న శేఖర్, చింతనిప్పు రాంబాబు, నర్వనేని గోపాలరావు, పలువు రు భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

273
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles