గన్నవరంలో గుట్కా మాఫియా

Mon,May 27, 2019 02:40 AM

-రెండు రాష్ర్టాలకు యథేచ్ఛగా గుట్కా సరఫరా
-నెలకు రూ.30లక్షలకు పైగా అక్రమ వ్యాపారం
-పగలు, రాత్రి తేడా లేకుండా కార్లలో సరఫరా
-పట్టించుకోని అధికారులు
-పెచ్చురిల్లుతున్న అక్రమదారుల ఆగడాలు
వైరా రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పరిరక్షించేందుకు నిషేధించిన గుట్కాల అక్రమ వ్యాపారం వైరా మండలంలోని గన్నవరంలో యథేచ్ఛగా కొనసాగుతుంది. ఈ గ్రామంలో గుట్కాల హోల్‌సేల్ విక్రయాలు బహిరంగంగా కొనసాగుతున్నాయి. అక్రమ వ్యాపారాన్ని అరికట్టాల్సిన సంబంధిత శాఖల అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో గుట్కాల వ్యాపారులకు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మారింది. గ్రామంలోని ఓ దుకాణంలో నేరుగా హోల్‌సేల్‌గా గుట్కాలను విక్రయిస్తున్నారు. నెలకు సుమారు రూ.30లక్షలకు పైగా గుట్కా వ్యాపారం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వైరా మండలంలోని గన్నవరంలో ఈ అక్రమ వ్యాపారం మూడు వజీర్లు, ఆరు అంబర్ల చందాగా కొనసాగుతుంది. గన్నవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత దశాబ్ధ కాలంగా గుట్కా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గన్నవరంలో హోల్‌సేల్‌గా లక్షలాది గుట్కాలను బహిరంగంగానే విక్రయిస్తున్నారు. అంతేకాకుండా కార్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లోని పలు ప్రాంతాలకు గుట్కాలను సరఫరా చేస్తున్నారు. ఈ గుట్కాలు సరఫరా చేసే కార్ల డోర్ల అద్దాలకు కేంద్ర ప్రభుత్వం నిషేధించిన నల్లటి ఫిల్మ్‌లు వేసి ఉన్నాయి. అయినప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు, గంపలగూడెంతో పాటు వత్సవాయి, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, కొత్తగూడెం తదితర జిల్లాలకు గన్నవరం నుంచి రవానా కొనసాగుతుంది. అంతేకాకుండా గన్నవరంలో పలు ప్రాంతాల్లోని బడ్డీ దుకాణాలకు గుట్కాలు బహిరంగంగానే హోల్‌సేల్‌లో విక్రయిస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తి తనకు అధికారుల అండదండలు ఉన్నాయని బహిరంగంగానే ప్రచారం చేస్తుండటం గమనార్హం. తమపై దాడులు చేసే వారే లేరని అధికారులను దాడులు చేయకుండా నెలవారి మామూళ్లతో ప్రసన్నం చేసుకుంటున్నానని ఆ వ్యాపారి బహిరంగంగా మాట్లాడటం విశేషం. మండలంలోని పాలడుగు, గన్నవరం, ఖానాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెమలి ప్రాంతాల్లో రోజుకో ప్రాంతం చొప్పున వందలాది గుట్కా బస్తాలను నిల్వ చేస్తున్నారు. అక్రమ వ్యాపారాలపై కొరడా ఝులిపించాల్సిన టాస్క్‌ఫోర్స్ అధికారులు కనీసం ఈ గుట్కా వ్యాపారంపై దాడులు చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఇప్పటికైనా అక్రమ గుట్కా వ్యాపారాన్ని అరికట్టేందుకు సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

309
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles