విత్తన డీలర్లూ తస్మాత్ జాగ్రత్త..

Mon,May 27, 2019 02:41 AM

విత్తనాల పేరుతో రైతులు ఎప్పుడూ దోపిడీకే గురవుతున్నారు. నకిలీ విత్తనాల మాయలో రైతు దగా పడుతున్నాడు. డీలర్లకు నకిలీ విత్తనాలు విక్రయించడం పరిపాటిగా మారింది. అధికారులు ఎన్నిసార్లు దాడులు నిర్వహించినా దొడ్డి దారిలో విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. ఇప్పుడు సీన్ మారింది. నకిలీ విత్తనడీలర్ల భరతం పట్టేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. విత్తన డీలర్లు తస్మాత్ జాగ్రత్త.. అంటూ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగింది. పోలీస్, వ్యవసాయ శాఖ సంయుక్తంగా చేపడుతున్న ఈ దాడుల వల్ల విత్తన కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ప్రతి లెక్క పక్కాగా ఉండాలి, ఏ విత్తనం అమ్ముతున్నారు, ఏ రైతుకు విక్రయిస్తున్నారన్న విషయం ఖచ్చితంగా ఉండాలని డీలర్లకు నిబంధనలు విధిస్తున్నారు.
-కొత్తగూడెం, నమస్తే తెలంగాణ

-అమ్మినా.. సాగు చేసినా నేరమే..
రైతులు మోసపోకుండా ప్రభుత్వం నకిలీ విత్తన విక్రయదారులపై పీడీయాక్టు నమోదు చేసేందుకు వెనుకాడటం లేదు. ఇందుకోసం ప్రత్యేక టాస్క్‌పోర్స్‌ను ఏర్పాటు చేసి జిల్లాలోని డీలర్లు, వ్యవసాయ అధికారులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక నుంచి విత్తన డీలర్లు నకిలీ విత్తనాలు అమ్మినా, సాగు చేసినా.. నేరమే అంటూ వ్యవసాయ శాఖ కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఇదేకాక రాష్ట్ర స్థాయిలో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి విత్తన వ్యాపారులపై దాడులు చేస్తోంది. రెండు రోజులుగా ఈ బృందం విత్తన డీలర్ల షాపులపై ఆకస్మిక తనిఖీలు చేసి అనుమానితుల ఇళ్లలో సోదాలు చేసింది. రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌లో ఎస్సై రాజశేఖర్‌రెడ్డి, ఏడీఏ ఎల్లయ్య, సీడ్ ఆఫీసర్ రవీందర్, ఏడీఏ లాల్‌చంద్, స్థానిక మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. అశ్వాపురంలో రెండు షాపులు, బూర్గంపాడులో ఒక షాపు, లక్ష్మీపురంలో 3 షాపులు, సారపాకలో ఒక షాపు, భద్రాచలంలో ఒకటి, సీతారాంపురం ఒకటి, లక్ష్మీనగరం ఒకటి, అశ్వాపురం జిన్నింగ్ మిల్ మొత్తం తొమ్మిది షాపుల్లో తనిఖీలు చేశారు. జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీని కూడా ఆ శాఖ నియమించింది. ఇద్దరు ఏడీఏలు, ఇక ఎస్సై, స్థానిక ఏవోలతో ఈ కమిటీని నియమించడంతో సమాచారం అందుకున్న వెంటనే టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేస్తున్నారు.

-బీజీ-3 విత్తనాలు నిషేధం..
బీజీ-3 విత్తనాలపై ప్రభుత్వం నిషేధిం విధించింది. ఇక నుంచి ఏ రైతు ఈ విత్తనాలు సాగు చేసినా, డీలర్లు విక్రయించినా జైలుకే అంటూ వ్యవసాయ శాఖ ప్రచారం నిర్వహిస్తోంది. జిల్లాలో 293 మంది విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించి నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డీలర్లు విత్తనాలను విక్రయించేటప్పుడు రైతుల వివరాలు కూడా సేకరించాలని, రైతుకు తప్పని సరిగా రశీదు ఇవ్వడంతో పాటు ఏ రకం విక్రయించారు, ఏ షాపు ద్వారా విక్రయించారు, బిల్లు ఇవ్వడంతో పాటు రైతు సంతకం కూడా తీసుకోవాలని వ్యవసాయ అధికారులు కఠిన నిర్ణయాలను ప్రవేశపెట్టారు. జిల్లాలోని లక్ష హెక్టార్లకు పైగా పంటలు సాగు చేస్తున్న రైతులు ప్రతీ ఏడాది 50 వేల హెక్టార్ల వరకు పత్తిని సాగు చేయడంతో విత్తన కంపెనీలు రైతులను దగా చేసేందుకు ముందుకొస్తున్నాయి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు టాస్క్‌ఫోర్స్ బృందం రంగంలోకి దిగింది.

-బీజీ-3తో పర్యావరణానికి ముప్పు
వాస్తవానికి పత్తి విత్తనాలు సాగు చేస్తున్న రైతులు కొంతకాలం నుంచి 1,2 రకాలు సాగు చేశారు. కానీ కొత్తగా బీజీ3 కాటన్ విత్తనాలు దొడ్డిదారిలో డీలర్లు విక్రయించడం వల్ల తెలియని రైతులు వాటిని సాగు చేయడంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఏర్పడుతోంది. ఈ విత్తన సాగు వల్ల కలుపు మందు చల్లేందుకు ఉపయోగించే ైగ్లెకోసెట్ మందు స్ప్రే చేయడం వల్ల ఒక పత్తి మొక్క తప్ప ఇతర మొక్కలన్నీ చనిపోతాయి. ఇలాంటి విషపదార్థాల మందును పొలంలో వినియోగించడం వల్ల కేవలం కలుపుతో పాటు ఇతర మొక్కలు కూడా చనిపోయి పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదముంది. అందువల్ల ముందస్తు జాగ్రత్తగా నిషేధించిన బీజీ3 విత్తనాలు విక్రయించొద్దని, కలుపు మందులను కూడా విక్రయిస్తే షాపుల యజమానులపై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు.

-సమాచారం ఇస్తే దాడులు..
నకిలీ విత్తనాల సమాచారం తెలిస్తే చాలు వెంటనే టాస్క్‌ఫోర్స్ బృందం అక్కడ వాలిపోతుంది. పోలీస్, వ్యవసాయశాఖ సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. స్థానికంగా వ్యవసాయ అధికారులు, స్థానిక పోలీసులు కూడా ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఎవరికి ఎలాంటి సమాచారం తెలిసినా జిల్లా టాస్క్‌ఫోర్స్ టీమ్‌కు సమాచారమిస్తే వెంటనే దాడులు చేసి నకిలీ విత్తనాల విక్రయదారులపై పీడీ యాక్టు నమోదు చేస్తారు. ఇప్పటికే విత్తన డీలర్లతో సమావేశం ఏర్పాటు చేశాం. అందరికీ అవగాహన కల్పించాం. నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేయొద్దని చెప్పాం.
-డీఏవో కొర్సా అభిమన్యుడు

312
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles