ఖనిజం ఉన్నా.. కనీస సౌకర్యాలు సున్నా..

Mon,May 27, 2019 02:42 AM

కారేపల్లి రూరల్ : రాష్ట్రపారిశ్రామిక రంగంలో ప్రతిష్టాత్మకమైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు అనుబంధ డోలమైట్ కర్మాగారం మాదారం గ్రామంలో నెలకొల్పుతున్నారనే శుభవార్త తెలియడంతో ఇక అభివృద్ధికి కొదువలేదని అప్పట్లో గ్రామస్తులంతా సంతోషం వ్యక్తం చేశారు. మా గ్రామం మరో గాజువాకగా తీర్చిదిద్దుతారని ఆశించిన గ్రామప్రజలకు నిరాశే మిగిలింది. డోలమైట్ కర్మాగారం ఉత్పత్తిని ప్రారంభించి పాతికేళ్లు పైనే అయింది. కానీ మాదారం గ్రామం మాత్రం అప్పుడెలా ఉందో ఇపుడూ అలానే ఉంది. 1989 నుంచి ఉత్పత్తిని ప్రారంభించిన ఈ పరిశ్రమ ద్వారా ఇప్పటి వరకూ వెయ్యికోట్ల రూపాయల విలువైన 85లక్షల మెట్రిక్ టన్నుల డోలమైట్ ఖనిజాన్ని ఉత్పత్తి చేసి ఆంధ్రాలోని వైజాగ్‌స్టీల్ ప్లాంట్‌కు ఎగుమతి చేసింది. 85లక్షల టన్నుల డోలమైట్‌ను ఉత్పత్తి చేసిన డోలమైట్ కర్మాగారం ప్రభుత్వానికి ఇప్పటి వరకూ రూ.40 కోట్లు రాయల్టీని చెల్లించింది. కానీ ఈ రాయల్టీ నుంచి మాదారం గ్రామపంచాయతీకి ఒక్కపైసా కూడా చెల్లించలేదు. కోట్లాది రూపాయల విలువైన డోలమైట్ ఖనిజాన్ని మాదారం గ్రామపరిధిలో వెలికితీసి వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ఉపయోగించుకుంటూ మాదారంలో మాత్రం కనీస సౌకర్యాలు కూడా సమకూర్చకపోవడం గ్రామస్తులకు శాపంగా మారింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసిన గాజువాకను సుందరనగరంగా తీర్చిదిద్దిన విశాఖస్టీల్‌ప్లాంట్ యాజమాన్యం దాని అనుబందధ కర్మాగారాన్ని నెలకొల్పిన తెలంగాణ ప్రాంతంలోని మాదారం గ్రామాన్ని పూర్తిగా విస్మరించడం గత సీమాంధ్రపాలకుల వివక్షగానే స్పష్టమవుతోంది. కేంద్ర కర్మాగారం సీమాంధ్రాలోనే ఉండటం తెలంగాణలో ఉన్న అనుబంధ పరిశ్రమ నుంచి విలువైన రా మెటీరియల్‌ను తీసుకెళ్లిందే గానీ ఈ ప్రాంత అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

-మాదారం డోలమైట్‌కు విశిష్టస్థానం..
విశాఖ ఉక్కు కర్మాగారానికి నాణ్యత కలిగిన డోలమైట్ ఖనిజాన్ని అందించే ప్రభుత్వరంగ సంస్థ మాదారం డోలమైట్ కర్మాగారం ఒక్కటే. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో ముడి ఇనుమును కరిగించగా వచ్చే వ్యర్థపదార్థాలను తొలగించేందుకూ, ఇనుమును కరిగించే కొలుములను తయారు చేసేందుకు ఈ ఖనిజాన్ని ఉపయోగిస్తారు. ఈ కర్మాగారంలో లోహాలను కరిగించేందుకు ఉపయోగించే కొలిమి నుంచి ఉద్భవించే విపరీతమైన వేడిమిని డోలమైట్‌తో తయారుచేసే ఇటుకలే తట్టుకోగలుగుతాయి. అందుకే డోలమైట్ ఖనిజానికి ఇంత విశిష్టస్థానం లభించింది. కారేపల్లి మండలంలోని మాదారం గ్రామంలో ఉన్న డోలమైట్‌కు హైగ్రేడ్ రా మెటీరియల్‌గా పేరొంది ప్రత్యేకతను చాటుకుంది. ఇంతటి ప్రత్యేకత కలిగిన మాదారం గ్రామానికి పేరుగొప్ప ఊరుదిబ్బ అన్న సామెత చందంగా గ్రామం పరిస్థితి ఉండటం బాధాకరం.

-నిబంధనలకు తూట్లు..
డోలమైట్ యాజమాన్యం టన్నుకు రూ.65రూపాయల చొప్పున రాయల్టీని ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఈ రాయల్టీలో 25శాతం వాటాను స్థానిక సంస్థలకు చెల్లించి ఏజన్సీ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని జీవో ఎంఎస్ నెంబర్ 49 స్పష్టంగా పేర్కొంటున్నప్పటికీ ఆ నిబంధనలను తుంగలో తొక్కి ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు. 85లక్షల టన్నుల డోలమైట్ ఖనిజాన్ని ఎగుమతి చేసిన మాదారం డోలమైట్ కర్మాగారం ఇప్పటి వరకూ రూ.40కోట్లు రాయల్టీని చెల్లించారు. నిబంధనల ప్రకారం చెల్లించిన రాయల్టీలో 25శాతం కారేపల్లి మండలానికి మాదారం గ్రామానికి రూ.10కోట్ల రూపాయల వాటా రావాల్సి ఉంది. కానీ ఒక్కపైసా కూడా రాయల్టీలో వాటాను స్థానిక సంస్థలకు చెల్లించలేదంటే ఈ ప్రాంతానికి ఏ మేరకు అన్యాయం జరిగిందో అర్థమవుతోంది.

329
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles