నిప్పుల సెగ

Mon,May 27, 2019 02:43 AM

భానుడు నిప్పులు కక్కుతున్నాడు. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడి పోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. భూగర్భ జలాలు దూరంగా జరుగుతున్నాయి... పట్టణాల్లో పట్టపగలు కర్ఫ్యూ వాతావరణం ఎదురవుతుంది... నడిమాడు మండుతుంది... రోహిణీ కార్తే ప్రారంభమై రెండు రోజులే అవుతున్నా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 41 మంది వడదెబ్బతో మృత్యువాత పడగా ఆదివారం ఒక్కరోజే ఐదుగురు మృతిచెందారు. ఏకంగా ఆదివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత పదే రోజులుగా జిల్లాల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. ఎండ వేడిమి ఏ మాత్రం తగ్గకపోవడంతో ఇండ్ల నుంచి ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు.
- ఖమ్మం, నమస్తే తెలంగాణ

ఖమ్మం నగరంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కర్ఫ్యూను తలపిస్తుంది. గ్రానైట్ పరిశ్రమలకు నిలయమైన ఖమ్మం జిల్లాలో ఎండులు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. గత నెల రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పగటి ఉష్ణోగ్రతల కారణంగా మాడ మండుతోంది. ఎండ వేడిమి ఏ మాత్రం తగ్గకపోవడంతో ఇండ్ల నుంచి ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి, మధిర, వైరా, పాలేరు, కల్లూరు పట్టణాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోతున్నాయి. తప్పని పరిస్థితుల్లో మినహా మధ్యాహ్న వేళల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఉపాధి కూలీల సంఖ్య రోజురోజుకు తగ్గుతుంది. పశుగ్రాసం దొరకకపోవడంతో రైతులు తమ మూగజీవాలను సంతలకు తరలిస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ప్రతి ఏడాది గిరిజనులు వేసవిలో చేపట్టే తునికాకు సేకరణ ఎండ వేడిమి కారణంగా తగ్గుముఖం పట్టింది. వర్షాభావ పరిస్థితులు కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే ఎండ ప్రభావం నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

జిల్లాలో కర్ఫ్యూ వాతావరణం..

జిల్లాలో ఎండవేడిమిని తట్టుకోలేక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో రహదారులు, పల్లెల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా వేడెక్కింది. రహదారులన్నీ కాంక్రీట్ జంగిల్‌గా మారటం, చెట్లు అంతంత మాత్రంగానే ఉండటంతో నిప్పుల కుంపటిలా మారిపోతున్నాయి. ముఖ్యంగా అనేక వ్యాపారాలకు నిలయమైన ఖమ్మం నగరంలో భానుడి భగభగలకు ప్రజలు అల్లాడి పోతున్నారు. పగటిపూట ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావటంతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారి అప్రకటిత కర్ఫ్యూను తలపిస్తున్నది. దీంతో మధ్యాహ్న సమయంలో వర్తక, వాణిజ్య వ్యాపారాలు సైతం గణనీయంగా పడిపోతున్నాయి. సాయంత్రం 6 గంటలు దాటితేతప్ప నగరజనం కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు సైతం సాయంత్రం నాలుగు గంటలు దాటిన తర్వాతనే కార్యాలయాలకు చేరుకుంటున్నారు. ఆరోగ్యం బాగలేక చంటి బిడ్డలను చంకనెత్తుకుని హాస్పిటల్స్‌కు వస్తున్న వారంతా ఎండ నుంచి కాపాడుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు 12 గంటలకే ఇంటి బాట పడుతున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే కార్యాలయాలకు హాజరవుతున్నారు. కూలర్లు, ఏసీల వాడకం పెరిగిపోయింది.

కొత్తగూడెం జిల్లాలో భానుడి భగభగలు..

సింగరేణి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. సత్తుపల్లి తదితర సింగరేణి ప్రాంతాలు భానుడి ప్రతాపానికి భగభగ మండుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఇప్పుడే పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకుంది. వచ్చే నెలలో ఈ ఉష్ణోగ్రతలు పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. కాగా ఎండ తీవ్రతకు ఓపెన్ కాస్టుల్లో బొగ్గు కాలిపోతోంది. మైన్స్‌లో అడుగుపెట్టాలంటేనే కార్మికులు జంకుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే విధులకు హాజరవుతున్నారు. కాగా కార్మికుల ఇబ్భందులను దృష్టిలో పెట్టుకున్న సింగరేణి సంస్థ యాజమాన్యం భద్రతా చర్యలు తీసుకునేందుకు కార్యాచరణను సిద్ధ్దం చేసుకుంది. విధుల సమయంలో మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్స్‌ను అందించబోతున్నట్లు సమాచారం. మధ్యాహ్న సమయంలో ఓపెన్‌కాస్టుల్లో సేదతీరేందుకు ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏజెన్సీలో సైతం వేసవి ప్రతాపం కనిపిస్తున్నది.

420
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles