మహిళలే మహారాణులు..!

Tue,June 11, 2019 01:59 AM

భద్రాద్రి జిల్లాలో పరిషత్ ఎన్నికల్లో మహిళలదే పైచేయి..
16 స్థానాల్లో 11 మంది మహిళా ఎంపీపీలు
209 స్థానాలకు గాను 126 మంది మహిళా ఎంపీటీసీలు..
477 మందికి 258 మంది మహిళా సర్పంచ్‌లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:ప్రాదేశికపోరులో ఆమెదే అధిక్యత కొనసాగింది... ఆకాశంలో సగం.. అవనిలో సగం అనే నానుడిని నిజం చేస్తూ మహిళాలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. రంగమేదైనా మహిళలే పై చేయి సాధిస్తున్నారు. సర్కారు కొలువు దగ్గర నుంచి రాజకీయాల వరకు ఎక్కడి చూసినా వారు ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. ఇన్నాళ్లూ వంటింటికే పరిమితమైన అతివలు.. పాలనా పగ్గాలు చేపట్టి రాజకీయాల్లోనూ దూసుకెళ్తున్నారు. చట్టాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించారు. దీంతో అందివచ్చిన అవకాశాన్ని అతివలు చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. కొన్నినెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా మహిళలు సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లుగా గెలిచి పాలనలోనూ సత్తాచాటుతున్నారు. రిజర్వేషన్ స్థానాల్లోనే కాకుండా జనరల్ స్థానాల్లోనూ అతివలు నిలిచి గెలిచారు. అంతేకాకుండా, ఇటీవల జరిగిన పరిషత్ పోరులోనూ అత్యధిక ఎంపీటీసీ స్థానాల్లో గెలిచి ఎంపీపీలుగా, వైస్ ఎంపీపీలుగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయ రంగంలో పురుషులకంటే తామేమీ తీసిపోమనే సందేశం ఇస్తున్నారు.

పరిషత్ ఎన్నికల్లోనూ మహిళలదే పైచేయి
జనవరి నెలలో పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో తమ సత్తా చాటిన మహిళలు అదే పరంపరను కొనసాగిస్తూ పరిషత్ ఎన్నికల్లోనూ పైచేయి సాధించి ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, వైస్ ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. దీంతో పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో మహిళలు గెలిచి తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు నడుం బిగించారు. ఎంపీపీగా ఎన్నికైన మహిళ తన మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి దృష్టి సారించనుంది. ఒక కుటుంబంలో ఆర్థిక, సామాజిక కట్టుబాట్లను, నియమ, నిబంధనలను పాటిస్తూ తన కుటుంబ గౌరవాన్ని పెంచుతున్న మహిళ నేడు రాజకీయాల్లోకి వచ్చి పాలనా పగ్గాలు చేపట్టింది. దీంతో ఆయా గ్రామాల, మండల ప్రజల ఆర్థిక, సామాజికాభివృద్ధికి ఇనుమడించనుంది. జిల్లాలో అత్యధిక సర్పంచ్, ఎంపీటీసీ స్థానాల్లో గెలిచిన మహిళలు అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదగనుంది. మహిళల సాధికారత, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. ఈ సంస్కరణలను అందిపుచ్చుకున్న మహిళలు ఆర్థికంగా పల్లెల్లో రాణిస్తున్నారు.

209 స్థానాల్లో 126 స్థానాల్లో మహిళా ఎంపీటీసీలు....
రిజర్వేషన్ స్థానాల్లోనే కాకుండా జనరల్ స్థానాల్లోనూ బరిలో నిలిచి గెలిచారు. దీంతో జిల్లాలో మహిళ రాజకీయాల్లో ఒక ప్రబల శక్తిగా ఎదిగింది. జిల్లాలో ఉన్న 209 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 20మండలాల్లో విజయం సాధించిన మహిళా ఎంపీటీసీల వివరాలిలా ఉన్నాయి.. అశ్వాపురం లో 12 స్థానాలకు 06, చర్లలో 12 స్థానాలకు 6, దుమ్ముగూడెం 13 స్థానాలకు 9 మంది, మణుగూరు 11 స్థానాలకు 6, ములకపల్లి 10 స్థానాలకు 05, పాల్వంచలో 10 స్థానాలకు 5, అన్నపురెడ్డి పల్లిలో 6 స్థానాలకు 4, చండ్రుగొండలో 8 స్థానాలకు 6, కరకగూడెంలో 4 స్థానాలకు 3, పినపాకలో 9 స్థానాలకు 4, అశ్వారావుపేటలో 17 స్థానాలకు 9, దమ్మపేటలో 17 స్థానాలకు 10, చుంచుపల్లిలో 12 స్థానాలకు 7, లక్ష్మీదేవిపల్లిలో 11 స్థానాలకు 7, సుజాతనగర్‌లో 8 స్థానాలకు 5, జూలూరుపాడులో 10స్థానాలకు 8, టేకులపల్లిలో 14 స్థానాలకు 9 మంది, ఇల్లందులో 16 స్థానాలకు 11 మంది, ఆళ్లపల్లిలో 4 స్థానాలకు 3, గుండాలలో 4 మందికి 3 మంది నిలిచారు.

జిల్లాలో 477 మందికి 258 మంది మహిళా సర్పంచ్‌లే....
గ్రామాలు అభివృద్ధి జరగాలన్నా.. పల్లె రాతలు మారాలన్నా పంచాయతీ సర్పంచ్‌లే కీలక పాత్ర పోషించాలి. వారే విద్యావంతులయితే ఆ గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయి. కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయడంతోపాటు పాలనలో మహిళలు కీలక పాత్ర పోషించేందుకు ప్రభుత్వం ప్రోత్సహించిన తీరు ప్రశంసనీయమని చెప్పక తప్పదు. మహిళలకు కేటాయించిన సీట్లలో కాకుండా కొన్నిచోట్ల మేము అభివృద్ధిలో భాగస్వాములవుతాం అంటూ పురుషులపై పోటీ చేసి విజయ కేతనం ఎగుర వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించిన మహిళా సర్పంచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి. అశ్వాపురంలో 24 మందికి 16, బూర్గంపాడు లో 17 మందికి 11, చర్లలో 26 మందికి 15, దుమ్ముగూడెం 37మందికి 20, మణుగూరు 14 మందికి 8, ములకపల్లి 20 మందికి 10, పాల్వంచలో 34 మందికి 17, అన్నపురెడ్డి పల్లిలో 10 మందికి 6, చండ్రుగొండలో 14 మందికి 8, కరకగూడెంలో 16 మందికి 8, పినపాకలో 23 మందికి 12, అశ్వారావుపేటలో 31 మందికి 18, దమ్మపేటలో 31 మందికి 17, చుంచుపల్లిలో 18 మందికి 11, లక్ష్మీదేవిపల్లిలో 31 మందికి 17, సుజాతనగర్‌లో 20 మందికి 12, జూలూరుపాడులో 24 మందికి 12, టేకులపల్లిలో 36 మందికి 18, ఇల్లందులో 29 మందికి 14, ఆళ్లపల్లిలో 12 మందికి 7, గుండాలలో 11 మందికి ఐదుగురు 5సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు.

పాలనపై పట్టు...
గ్రామ పంచాయతీ పాలనపై పట్టు సాధించడం కోసం ఎక్కువగా మహిళలు చదువుకున్న వారే రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపి సర్పంచ్‌లుగా, ఎంపీటీసీలు ఎన్నికయ్యారు. వీరిలో అత్యధికులు పట్టభద్రులే. ఉన్నత చదువులు చదివి సర్పంచ్‌లుగా, ఎంపీటీసీలుగా బరిలో నిలిచి గెలిచారు. పంచాయతీ రాజ్‌చట్టంపై పూర్తి పట్టుసాధించి పల్లెలను సమగ్రాభివృద్ధి చేసుకునేందుకు మహిళలు ఉవ్విళ్లూరుతున్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామాలన్నీ మరింత అభివృద్ధి కానున్నాయి. జిల్లాలో 477 గ్రామ పంచాయతీల్లో 258 మంది మహిళా సర్పంచ్‌లు, 209 ఎంపీటీసీలకు గాను 126 మంది మహిళా ఎంపీటీసీలు పీఠం ఎక్కారు. దీనికి తోడు వార్డు మెంబర్లూ విద్యాధికులై ఉండటంతో పాలన కొత్త పుంతలు తొక్కనుంది. ముఖ్యమంత్రి కే చంద్ర శేఖరరావు పంచాయతీ వ్యవస్థను గాడిలో పెట్టాలని మరుగున పడిన పంచాయతీ వ్యవస్థను కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి గతంలో ఉన్న పంచాయతీలను కొత్త పంచాయతీలుగా చేసి కొత్త పాలనను తీసుకురానున్నారు. అదే స్ఫూర్తితో కొత్తగా విజేతలుగా నిలిచిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పల్లె పాలనపై దృష్టి పెట్టారు.

మండల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా ..
రెండోసారి బోడు ఎంపీటీసీగా పోటీ చేశాను. మొదటిసారి గెలిచినపుడు ఎంపీపీ పదవిని త్యాగం చేశాను. బోడు ఎంపీటీసీగా నన్ను గెలిపించిన బోడు, రామచంద్రునిపేట పంచాయతీ ఓటర్లకు ఎల్లప్పుడు రుణపడి ఉంటాను. ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, జడ్పీచైర్మన్ కోరం కనకయ్య సహాయ సహకారాలతో మండల సమగ్రాభివృద్ధ్దికి కృషిచేస్తాను. ఎంపీపీగా మొదటిసారి పదవిని అలంకరించడం ఆనందంగా ఉంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే నా గెలుపునకు దోహదపడ్డాయి. నా భర్త భూక్య సైదులునాయక్ ప్రోత్సాహంతోనే రాజకీయాల్లో వచ్చాను. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను.
- భూక్య రాధ, ఎంపీపీ, టేకులపల్లి

ప్రజలకు అందుబాటులో ఉంటా..
ప్రజా సమస్యలపై స్పందించి సత్వరమే పరిష్కారానికి కృషి చేస్తాను. మండల ప్రజలకు అందుబాటులో ఉంటాను. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూస్తాను. అంతర్గత రహదారులు, మరుగుదొడ్లు నిర్మాణాలు చేపట్టేందుకు ముమ్మర చర్యలు చేపడతాను. తాగునీరు, విద్యుత్, వైద్యం తదితర మౌలిక సౌకర్యాలు కల్పిస్తాను. మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతాను. పరిపాలనలో ఎవరి పెత్తనం లేకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకుంటాను.
- బాదావత్ శాంతి, ఎంపీపీ, చుంచుపల్లి

ఎన్నికైన 16 ఎంపీపీల్లో 11 మహిళలే...
ఈ నెల 7న జరిగిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో జిల్లాలోనే 209 ఎంపీటీసీ స్థానాలకు గాను 126 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్న మహిళలు అత్యధిక ఎంపీపీ, వైస్ ఎంపీపీలను గెలుచుకున్నారు. 7వ తేదీన 16 ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కోరం లేక మరో 4 ఎంపీపీ స్థానాలు అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికలు జరిగిన 16ఎంపీపీ స్థానాల్లో పాల్వంచ ఎంపీపీగా మడి సరస్వతి, చుంచుపల్లి ఎంపీపీగా బాదావత్ శాంతి, ఇల్లెందు ఎంపీపీగా చీమల నాగరత్నం, మణుగూరు ఎంపీపీగా కారం విజయకుమారి, టేకులపల్లి ఎంపీపీగా భూక్యా రాధ, జూలూరుపాడు ఎంపీపీగా లావుడ్యా సోనీ, అశ్వాపురం ఎంపీపీగా ముత్తినేని సుజాత, కరకగూడెం ఎంపీపీగా రేగా కాళిక, చండ్రుగొండ ఎంపీపీగా బానోత్ పార్వతి, దుమ్ముగూడెం ఎంపీపీగా రేసు లక్ష్మీ, ఆళ్లపల్లి ఎంపీపీగా సున్నం లలిత ఎన్నికయ్యారు. వైస్‌ఎంపీపీలుగా నలుగురు మహిళలు ఎన్నికై మహిళా శక్తిని ఎలుగెత్తి చాటారు.

300
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles