జూన్‌లోనూ తగ్గని ఎండలు..

Wed,June 12, 2019 12:09 AM

-భానుడి ఉగ్రరూపానికి అల్లాడుతున్న ప్రజలు
మయూరి సెంటర్, జూన్ 11: భానుడు తన ప్రతాపాన్ని రెట్టింపు చేస్తూ మానవాళి, పశుపక్షాదులను హడలెత్తిస్తున్నాడు. మండుతున్న సూర్యుడు దాటికి ప్రజానీకం నడినెత్తి సుర్రుమంటుంది. ప్రజలు ఏదైనా అత్యవసర పనుల కోసం బయటికి వస్తే ఎండలకు, వేడిసెగలకు, ఉక్కపోతలకు తట్టుకోలేక పోతున్నారు. ప్రజలు ఏసీలు, కూలర్లను 24 గంటల పాటు వినియోగిస్తున్నారు. మునుపు ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలకు ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. కూలీ పనులు చేసుకునేవారు ఎండలకు బయపడి రోండురోజులు పని చేస్తు మరో రెండు రోజులు ఇంటి వద్దనే ఉంటున్నారు. వేసవిలో అత్యధికంగా జరిగే వివాహ, ఇతర శుభకార్యాలకు హాజరయ్యేందుకు ప్రజలు ఈ ఉష్ణోగ్రతలకు భయపడి హాజరుకాలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో సుమారు 115 మంది మృత్యువాత పడగా అందులో పూర్తిగా వడదెబ్బతో నలుగురు మృతి చెందారు. మంగళవారం 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పలు ప్రధాన వీధులు సైతం నిర్మానుష్యంగా మారాయి. జిల్లా కేంద్రంలో వాణిజ్య వ్యాపార సముదాయాల నిర్వహకులు పెరిగిన ఎండలకు ఉపశమనం పొందేందుకు గ్రీన్‌మ్యాట్‌లను రక్షణగా ఏర్పాటు చేసుకుని వాటి నీడలో తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. తలపై తుండు, చీరకొంగు, గొడుగుల సహాయాలతో బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజానీకం శీతలపానీయాలు, పండ్లరసాలు, నిమ్మరసాలతో కాలాన్ని వెలిబుచ్చే వాతావారణం నెలకొంది. సూర్యుడి ప్రతాపంతో ఖమ్మం జిల్లా కర్ఫ్యూవాతావరణాన్ని తలపిస్తుండగా ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. పెరిగిన ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని తగు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

291
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles