ఉమ్మడి జిల్లాకు 10 బీసీ గురుకులాలు

Wed,June 12, 2019 12:11 AM

-17న ప్రారంభించనున్న స్థానిక ఎమ్మెల్యేలు
-ఇప్పటికే అన్ని వర్గాలకూ 75 గురుకులాలు
-కార్పొరేట్‌ను మరిపిస్తున్న సర్కారు విద్య
-ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకూ బోధన
-ఉత్తమ ఆంగ్లబోధనతో అత్యుత్తమ ఫలితాలు
(ఖమ్మం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం ఎడ్యుకేషన్) : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది శాసనసభా నియోజకవర్గ కేంద్రాలలో ఒక్కొక్కటి చొప్పున మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఈ నెల 17న వాటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యుల చేతుల మీదుగా వీటిని ప్రారంభించేందుకు జిల్లా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఇప్పటికే 75 ఉన్నాయి. వీటిలో ఎస్సీ-23, ఎస్టీ-25, మైనార్టీ-13, బీసీ-14 చొప్పున ఉండగా అదనంగా బీసీలకు మరో 10 గురుకులాలు మంజూరు కావడంతో అవి 25కు చేరుకున్నాయి. ఈ పాఠశాలల్లో సుమారు 30 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.

కార్పొరేట్‌ను తలదన్నేలా..
పేద వర్గాల తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యను బలోపేతం చేసే దిశగా పయనిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లల కోసం గురుకుల పాఠశాలలను విస్తృత పరుస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఏ విధమైన సౌకర్యాలు, విద్య లభిస్తాయో అంతకు రెట్టింపుగా వసతులను గురుకులాల్లో ప్రభుత్వం కల్పిస్తోంది. నాణ్యమైన భోజనం, కొత్త కొత్త భవనాలు, మినరల్ వాటర్, దుస్తులు, ఇతర సౌకర్యాలను ఉచితంగా అందిస్తోంది. ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉచిత విద్యను ఇంగ్లిషు మీడియంలో బోధిస్తోంది.

విద్యాలయాల్లో వసతులు..
ఈ పాఠశాలలు నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద (ప్రణాళిక, ప్రణాళికేతర పద్ధతుల కేటాయింపులు)తో నిర్వహించబడుతున్నాయి. ఈ పద్ధతిలోని పాఠశాలలు/కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థి/విద్యార్థినులకు ఉచితంగా భోజన వసతి, పాఠ్యపుస్తకాలు, కనీస స్టేషనరీ సామగ్రి (పెన్సిలు, రబ్బరు, షార్ప్‌నర్, స్కేలు, రికార్డులు, మ్యాపులు ఇతరాలు) నోటు పుస్తకాలు, మూడు జతల యూనిఫాం దుస్తులు, ఒక జత పీటీ డ్రస్సు, ఒక టవల్, రెండు దుప్పట్లు, ఒక కార్పెట్, ఒక ట్రంక్ పెట్టె, ఒక జత స్కూలు బూట్లు, ప్లేటు, గ్లాసు, కటోరా, ఈ విద్యా సంవత్సరంలో ఒక నాణ్యమైన పరుపు, దిండు మొదలగునవి అందించబడుచున్నాయి. విద్యాబోధన ఉచితం. 10వ తరగతి, ఇంటర్ పరీక్ష ఫీజులు కూడా గురుకుల సంస్థే చెల్లిస్తోంది. అర్హత గల మెరిట్ విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొన్నప్పుడు ఆ పరీక్షా ఫీజులు, రవాణా ఖర్చులు కూడా సంస్థే భరిస్తోంది. కంప్యూటర్ ల్యాబ్‌లు, లైఫ్ స్కిల్ స్టూడియోలు, మాథ్స్ ల్యాబ్‌తోపాటు ఇతర సైన్స్ ల్యాబ్‌లను అందుబాటులో ఉంచుతున్నారు. ఎంపికైన విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా ఇస్తున్నారు. మంచి లైబ్రరీ వసతి, డిక్షనరీలు, శానిటరీ, ఆరోగ్య వివరాలు నమోదుకు హెల్త్ సూపర్‌వైజర్‌లకు ఫ్యాబ్‌లెట్లు లాంటి ఎన్నో వసతులు కల్పిస్తున్నారు.

బలమైన ఆహారం..
ఆరోగ్య శిబిరాలు నిర్వహించి పిల్లలను పరీక్షిస్తున్నారు. రోజూ ఉదయం 100 మిల్లీ లీటర్ల పాలను బూస్ట్‌తో కలిపి ఇస్తున్నారు. అల్పాహారంగా ఇడ్లీ, పులిహోరా, ఉప్మా, పొంగలి, కిచిడీ, ఉడికించిన గుడ్డు, అరటిపండు ఇస్తారు. మధ్యాహ్నం, రాత్రి కూరగాయలు, సన్నబియ్యంతో భోజనం, సాయంత్రం రకరకాల స్నాక్స్ అందిస్తున్నారు. ప్రతీ ఆదివారం చికెన్‌తో భోజనం పెడుతున్నారు.
చదువుతోపాటు ఇతర కార్యక్రమాలు..
విద్యార్థులందరికీ వారి ఆసక్తి మేరకు గేమ్స్, స్పోర్ట్స్ నిర్వహిస్తున్నారు. ఇంగ్లిషు, మ్యాత్స్, సాహిత్యంపై పట్టు కోసం ప్రత్యేక తరగతులను ఏర్పాటుచేస్తున్నారు. మన టీవీ ద్వారా ప్రత్యేకంగా పాఠ్యాంశాలను బోధిస్తున్నారు.
గురుకులంలో ప్రత్యేకతలు..
సమర్థులైన, సుదీర్ఘ అనుభవం కలిగిన ఉపాధ్యాయుల బోధనతోపాటు 24 గంటల పాటు ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉంటుంది. ఐఐటీ, ఎంసెట్, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.

విద్యార్థులకు కల్పించే ఉచిత సౌకర్యాలు..
4సన్నబియ్యంతోపాటు చికెన్, మటన్, కోడిగుడ్డు, అరటిపండ్లు వంటి అన్ని పోషక విలువలతో కూడిన చక్కటి రుచికరమైన ఆహారం.
4విద్యార్థులకు ఉపయోగించే స్టేషనరీ (పెన్నులు, పెన్సిల్లు, రికార్డు పుస్తకాలు), పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు.
4మూడు జతల స్కూల్ యూనిఫాం.
4పీటీ డ్రెస్, ట్రాక్ సూట్, స్పోర్ట్స్ షూస్.
4ప్లేటు, గ్లాసులు, బెడ్‌షీట్లు, పరుపులు, దిండ్లు, బాంకెట్లు, ట్రంక్ బాక్సులు.
4కాస్మోటిక్ కిట్ ద్వారా పలు రకాల వస్తువులు.
4అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు విద్యా విహార యాత్రలు.
పేద పిల్లలకు బంగారు భవిష్యత్తు
కార్పొరేట్ విద్యకు సమానంగా గురుకుల విద్యను అందిస్తున్నాం. ధనవంతుల ఇళ్లల్లో లభించని ఆహారం గురుకులాల్లో తెలంగాణ ప్రభుత్వం అందజేస్తోంది. పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. చదువుతో పాటు క్రీడా, సంస్కృతిక రంగాలలో ప్రవేశం కల్పిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు బలహీన వర్గాల పిల్లలకు విద్యా అభ్యున్నతికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసి వారికి బంగారు భవిష్యత్తు కల్పిస్తున్నది. కేజీ టూ పీజీ మిషన్ కింద తెలంగాణలో అదనంగా గురుకులాలను ప్రాంతాల వారీగా సంఖ్యను బట్టి ఏర్పాటుచేస్తున్నారు. ఈ అవకాశాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి.
-ప్రత్యూష, ఎస్సీ గురుకులాల మూడు జిల్లాల ఆర్‌సీఓ

విద్యార్థుల సంరక్షణ మా బాధ్యత..
ఈ నెల 17న ఉమ్మడి ఖమ్మంలో 10 బీసీ గురుకులాలను ప్రారంభిస్తున్నాం. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వాటిని ప్రారంభిస్తారు. గురుకులాల విద్యార్థులకు పూర్తి స్థాయి రక్షణ ఇస్తున్నాం. చదువుతోపాటు అన్ని విధాలుగా జీవితంలో నిలదొక్కుకునేలా తీర్చిదిద్దుతాం. చదువులో రాణించే విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. నూతన గురుకులాల ద్వారా 2400 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రైవేటు విద్యకు రెట్టింపుగా గురుకులంలో విద్యనందిస్తున్నాం. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉచిత విద్య లభిస్తుంది.
-బ్రహ్మాచారి, బీసీ గురుకులాల ఆర్‌సీఓ

326
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles