విద్యుత్‌శాఖ ఏఈపై ఎమ్మెల్యే ఆగ్రహం

Thu,June 13, 2019 01:34 AM

వైరా, నమస్తే తెలంగాణ : వైరా మండల విద్యుత్‌శాఖ ఏఈ జగదీశ్ నిర్లక్ష్యపు పనితీరు పట్ల ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పది రోజులుగా మండలంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్థంగా మారింది. ప్రధానంగా వైరా పట్టణంలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అర్ధంకాని పరిస్థితి. దీంతో స్పందించిన ఎమ్మెల్యే బుధవారం విద్యుత్‌శాఖ ఏఈ జగదీశ్‌తో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. వైరా పట్టణంలో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నా అధికారుల్లో కనీస చలనం లేదని అసహనం వ్యక్తం చేశారు. గత పది రోజులుగా పట్టణంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్థంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంగళవారం రాత్రి సుమారు 2గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారని ఎమ్మెల్యే వివరించారు. విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వహించే అధికారులపై, సిబ్బందిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు సరఫరా చేస్తుందన్నారు. ఆ విద్యుత్‌ను వినియోగదారులకు అందించే క్రమంలో సమస్యలను పరిష్కరించే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్రమైన తప్పుగా పరిగణించాల్సి వస్తుందన్నారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలను అందించాలన్నారు.

256
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles