యూపీ బార్‌కౌన్సిల్ చైర్మన్‌కు ఘన నివాళి..

Fri,June 14, 2019 02:00 AM

ఖమ్మం లీగల్ : ఉత్తరప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ చైర్‌పర్సన్ దార్వేశ్ యాదవ్ హత్య అత్యంత దారుణమని ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిపూడి తాజుద్దీన్‌బాబా అన్నారు. ఓ మహిళ అని కూడా చూడకుండా, కోర్టు ఆవరణలోనే ఆమెపై బుల్లెట్ల వర్షం కురిపించడం హేయమైన చర్య అన్నారు. యూపీ స్టేట్ బార్ కౌన్సిల్ మొదటి మహిళా చైర్‌పర్సన్ దార్వేశ్‌యాదవ్ హ త్యను ఖమ్మం బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. హత్యను నిరసిస్తూ ఖమ్మం బార్ అసోసియేషన్ గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిం ది. అసోసియేషన్ హాల్‌లో న్యాయవాదులు నిమిషం పాటు మౌనం పాటించి, శ్రద్దాంజలి ఘటించారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల న్యాయవాదులు విచారం వ్యక్తం చేశారు. దార్వేశ్ హత్యను ఖండిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదులకు రానురాను రక్షణ లేకుండా పోతోందని, ఏ కేసులో ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందని ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదులకు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అడ్వకేట్లపై దాడులు జరుగుతున్నాయని, క్రిటికల్ కేసులు టేకప్ చేయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఈ పరిస్థితి మారాలంటే న్యాయవాదులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కొణపర్తి రాజేశ్వరరావు, కార్యదర్శి కొమరగిరి హనుమంతరావు, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.

న్యాయవాద రక్షణ చట్టం తీసుకురావాలి :
కొల్లి సత్యనారాయణ, తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్
దేశంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయింది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అడ్వకేట్లపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. యూపీలో మొదటి మహిళా బార్ కౌన్సిల్ చైర్‌పర్సన్ దార్వేశ్ హత్య అత్యంత దారుణమైనది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి ఘటనలు క్షమించరానివి. తెలుగు రాష్ర్టాల్లోనూ న్యాయవాదులపై దాడులు జరగుతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. హైదరాబాద్ చందానగర్‌లో మహిళా న్యాయవాదిపై దాడి, విజయవాడలో మరో మహిళా న్యాయవాదిపై హత్యాయత్నం, అనంతపురంలో న్యాయవాదిపై యాసిడ్ దాడి వంటివి అనేక సంఘటనలు జరిగాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో న్యాయవాదులపై బెదిరింపులు, దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో న్యాయవాద వృత్తి చేపట్టాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి మారాలి. ప్రభుత్వాలు న్యాయవాద రక్షణపై దృష్టి పెట్టాలి. దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలి. అప్పుడే న్యాయవాద సమాజానికి రక్షణ ఏర్పడుతుంది.

250
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles