గంజాయ్‌తో గమ్మత్తు

Fri,June 14, 2019 02:05 AM

-ఖమ్మంలో విచ్చలవిడిగా గంజాయ్ బ్యాచ్‌లు
-యువతే టార్గెట్‌గా సాగుతున్న దందా
-చోద్యం చూస్తున్న పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు
ఖమ్మం క్రైం, జూన్ 13: అతడు టెన్త్ పరీక్ష తప్పాడు... కామన్ ఫ్రెండ్ ద్వారా కొత్త స్నేహబంధాలు... ఫ్రెండ్ ్సతో రాత్రి షికార్లు... కొత్త ప్రపంచంలో లైఫ్ ఎంజాయ్ అంటూ యువత ఉర్రూతలు ఊగుతుంది. కొంత మంది తప్పుడు స్నేహితుల వల్ల రానురాను అతడిలో మార్పు... రాత్రి 7 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోతాడు... తెల్లవారు జామున మూడు గంటలకు తిరిగి వస్తాడు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఖమ్మం జిల్లాలో ఇంటర్, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల చుట్టూ గంజాయ్ పిశాచి కురులు విప్పి నాట్యమాడుతుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన యువతను గంజాయ్ మాఫీయాలు వెంటాడుతున్నాయి. అదును దొరికితే చాలు వ్యసనాల వలలో పడేసి కీలు బొమ్మలా మార్చి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని కొంతమంది డాన్‌లు గంజాయ్ మాఫియాను ఖమ్మం జిల్లాలో సాఫీగా సాగిస్తున్నారు. ఈ దందా గురించి యువత తల్లిదండ్రులకు తెలిస్తే వారి గుండెల్లో రైళ్లు పరుగెట్టక మానవు. ఖమ్మం జిల్లాలో గంజాయ్ మత్తు మరకలు ఇప్పటికి చాలా మందిని బానిసలుగా చేసింది. ప్రధానంగా ఉన్నత వర్గాల పిల్లలు, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు బ్యాచ్‌లుగా ఏర్పడి గంజాయిని ఎంజాయ్ చేస్తూ బతుకు చీకటిమయమవుతుందని గుర్తించలేకపోతున్నారు. రాత్రి వేళల్లో యువత గంజాయ్ మత్తులో మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మత్తులో నుంచి యువతను సరైన గాడిలో పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఎంత ఉందో సమాజంలో పోలీస్, ఎక్సైజ్ శాఖకు కూడా అంతే ఉంది. అహ్లాదానికి అనువైన ఖమ్మం ఖిల్లా నేడు గంజాయ్ జిల్లాగా మారుతుందంటే అతిశయోక్తి లేదు. ఖమ్మం జిల్లాలోని నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాలలో, ఖమ్మం శివారు ప్రాంతాలలో ప్రస్తుతం నేర పూరిత సామ్రాజ్యాలకు అడ్డాగా మారిపోతుంది. ఎవరి నోట విన్నా యువత గంజాయ్‌కు బానిస అయిపోతున్నారని చెబుతున్నారే తప్ప దానికి చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లకు కూత వేటు దూరంలో గంజాయ్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. ఖమ్మం జిల్లా సరిహద్దు రాష్ర్టాలైన చత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్, పొరుగు జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల నుంచి గంజాయ్ రవాణా ఖమ్మం భారీగా రవాణా అవుతున్నట్లు సమాచారం.

* యువతే టార్గెట్‌గా సాగుతున్న దందా...
రాజకీయ నాయకుల అవసరాలకు...గంజాయ్ రవాణాకు యువతను విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొంత మంది రౌడిషీటర్ల పేర్లు చెప్పుకుంటూ కొత్త బ్యాచ్‌లను తయారు చేసుకుంటున్నారు. ఖమ్మం, సత్తుపల్లి, మధిర ప్రాంతాలలో కొంత మంది యువత గంజాయి మత్తులో గొడవలకు తెగబడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడ్డ యువత ఏ పని చేసేందుకైనా వెనుకాడటం లేదు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని యువత రాత్రి పూట గంజాయ్ సేవిస్తూ బైకు చేజింగ్, బైక్‌లపై మస్తుగా చకర్లు కొడుతున్నారు. రాత్రి 10 గంటలైందంటే యువత గంజాయి మత్తులో వారు ఏమి చేస్తున్నారో తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లా కేంద్రంలోని నిజాంపేట, ఆర్డీవో ఆఫీస్, రైతుబజార్, రమణగుట్టలోని సవరాల కాలనీ, దంసలాపురం, ఖానాపురం హవేలి, రాపర్తినగర్‌లోని బీసీ కాలనీ, స్టేషన్‌రోడ్‌లోని బొమ్మనసెంటర్లలో కొంతమంది యువకులు గంజాయ్‌ని సేవించిన తరువాత అమ్మకాలు కొనసాగిస్తున్నారు. చిన్నచిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి దందా సాఫీగా సాగిస్తున్నారు. రాత్రిపూట పోలీస్ తనిఖీలలో యువకుల బైకులకు ఆపి వాహన పత్రాలు చూస్తున్నారే తప్ప యువకుల యొక్క వ్యవహార శైలి గుర్తించలేకపోతున్నారు.

* సిగిరెట్లలో పెట్టి అమ్మకాలు....
పొరుగురాష్ర్టాలు, పక్క జిల్లాల నుంచి దిగుమతి అయిన గంజాయిని సిగరెట్లలో పెట్టి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. రాత్రి వేళల్లో గంజాయికి అలవాటైన ఇంజనీరింగ్, ఇంటర్ విద్యార్థులు రాత్రిపూట ఈ సిగరెట్లను కొనుగోలు చేసి తాగుతున్నారు. ప్రధాన కేంద్రాల్లో కొంతమంది యువకులు గంజాయి అలవాటున్న యువకులను టార్గెట్ చేసుకుని వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నారు. ప్రధాన కూడలి, నిర్మానుష్య ప్రాంతాలలో యువకులు గుంపులు గుంపులుగా గంజాయ్‌ను మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు. గంజాయి దొరకనప్పుడు యువకుల్లో వింత వింత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దానిని ఆసరాగా చేసుకుని మరింత రేటుకు విక్రయాలు కొనసాగిస్తున్నారు. దీనిని నిక్ నేమ్‌గా ైఫ్లెట్ అని నామకరణం చేసి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. గతంలో రూరల్ మండలంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో కొంతమంది విద్యార్థులు గంజాయికి బానిసలయ్యారు. ఈ విషయాన్ని కళాశాల యాజమాన్యం, పోలీసులు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించి వదిలిపెట్టారు. నగరంలో గత నెల మమత కళాశాల రోడ్‌లో ఉన్నత వర్గాలకు చెందిన పిల్లలు గంజాయితో రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. కాగా గుట్టుచప్పుడు కాకుండా ఈ కేసును పోలీస్ అధికారి డీల్ చేసి వదిలిపెట్టినట్లు సమాచారం.

గుట్టుచప్పుడు కాకుండా రవాణ
పొరుగు రాష్ర్టాల నుంచి దిగుమతి అయిన గంజాయ్‌ను కొంత మంది యువకులు పక్క జిల్లాలైన మహబూబాబాద్ నుంచి తెచ్చి ఖమ్మంలో విక్రయాలు సాగిస్తున్నారు. రాత్రి 7 గంటలకు కొంతమంది యువకులు బైకుల ద్వారా మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ బంగ్లాలో గంజాయిని కొనుగోలు చేసి రాత్రి 9 గంటల కల్లా ఖమ్మం చేరుకుంటున్నారు. గంజాయ్ రవాణ పోలీసుల కనుసన్నల్లో సాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తనిఖీలుండవనే పక్కా పోలీసుల సమాచారంతో యువకులు జిల్లాకు గంజాయిను రవాణ చేస్తున్నారు. గతంలో ఖమ్మం రూరల్ మండలం నుంచి విచ్చలవిడిగా గంజాయ్ రవాణ ఓ పోలీస్ అధికారి చేస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి. కొంతమంది ముఠా నాయకులు పోలీసులతో మిలాకత్ అయి గంజాయి రవాణాను మరింత విస్తరిస్తున్నారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో కొంతమంది పోలీస్ అధికారులు గంజాయి రవాణాకు పూర్తి స్థాయిలో సహకారాలు అందిస్తున్నారని, కొంతమంది పోలీస్ అధికారులే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. వరంగల్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి వరంగల్‌కు వెళ్లే రైళ్లల్లో భారీగా గంజాయి రవాణ చేస్తున్నారు.

చోద్యం చూస్తున్న పోలీస్, ఎక్సైజ్ శాఖలు...
ఖమ్మం జిల్లాలో గంజాయి యువత ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే వాస్తవం తెలిసి కూడా పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. కళ్ల ముందే గంజాయి రవాణను యథేచ్ఛగా సాగుతున్నా అడ్డుకట్ట వేయడంలో విఫలం చెందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందనే వాస్తవం కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఆ శాఖలున్నాయి. కొంత మంది కాలనీ ప్రజలు పోలీస్‌శాఖకు ఫిర్యాదులిస్తే ఓ పోలీస్ అధికారి వారు గంజాయి తాగుతుంటే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని తమకు సమాచారం ఇవ్వాలని సలహా ఇస్తున్నారు. యువకులు గుంపులుగా ఎందుకు ఉంటున్నారనే ఆలోచన కూడా రావడం లేదంటే గంజాయి మామూళ్లు ఏ విధంగా వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. జిల్లా కేంద్రంలో కొంత మంది గంజాయి అమ్మకాలు నిర్వహిస్తున్న యువకులు పోలీసులకు తెలిసి కూడా వారి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇప్పటికైనా పోలీస్, ఎక్సైజ్ శాఖాధికారులు గంజాయి మహమ్మారిని జిల్లాలో నామరూపాల్లేకుండా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

294
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles