కాలుష్యాన్ని నియంత్రిద్దాం..పర్యావరణాన్ని రక్షిద్దాం

Sat,June 15, 2019 12:44 AM

-వాహనం.. కావొద్దు వాయు కాలుష్యం
-ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణ్
-పత్రాలన్నీ ఉంటేనే వాహనంతో రోడ్డెక్కాలి: డీటీఓ
-ఖమ్మంలో వాహన పొల్యూషన్‌పై స్పెషల్ డ్రైవ్
రఘునాథపాలెం, జూన్ 14: మనం నడిపే వాహనం వాతావరణ కాలుష్యానికి కారణం కావద్దని ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ సూచించారు. వాహన కాలుష్యాన్ని నియంత్రించి..పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా రవాణాశాఖ, ట్రాఫిక్ పోలీసుల సహకారంతో శుక్రవారం ఖమ్మం నగరంలో వాహనాలకు ఉచిత పొల్యూషన్ చెకింగ్ క్యాంపును నిర్వహించారు. న్యాయ సేవా సదన్‌లో పొల్యూషన్ చెకింగ్ వాహనాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉచిత పొల్యూషన్ క్యాంపును ఉద్దేశించి జిల్లా జడ్జి మాట్లాడుతూ.. నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నివారించాలనే ఉద్దేశంతో రవాణా, ట్రాఫిక్ పోలీస్ శాఖల సంయుక్త సహకారంతో పొల్యూషన్ చెకప్‌పై స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టడం జరిగిందన్నారు.

రోజురోజుకూ పెరిగిపోతున్న వాహనాల వల్ల పర్యావరణానికి హాని కలుగకుండా ఉండాలంటే వాహనాల ఉద్గారాలను నిరంతరం పరిరక్షించుకుని పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. వాహనాన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించుకొని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సరైన వాహన కాలుష్య ధ్రువపత్రం లేకుండా వాహనాలను నడపడం నేరమన్నారు. ఈ విషయంలో వాహనదారులకు, యజమానులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఖమ్మం నగరంలోని అన్ని ప్రధాన సెంటర్లలో పొల్యూషన్ చెకింగ్ వాహనాలను ఏర్పాటు చేసి ఉచితంగా పొల్యూషన్ చెకింగ్ చేయడం జరుగుతుందన్నారు. అంతేకాక వాహనాలకు కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాలను అందించడం జరుగుతుందన్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్‌పై వేటు: టీడీఓ భద్రూనాయక్
వాహనాన్ని నడిపే సమయంలో వాహనదారులు అన్ని రకాల పత్రాలనూ అందుబాటులో ఉంచుకోవాలని టీడీఓ భద్రూనాయక్ సూచించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడపడం, సీట్ బెల్ట్ ధరించకుండా కారు డ్రైవ్ చేయడం నేరమని అన్నారు. అదే క్రమంలో సెల్ ఫోన్ నడుపుతూ, మద్యం తాగి వాహనాలను నడపడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని అన్నారు. అటువంటి వారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయడం జరుగుతుందన్నారు. ప్రమాదాలను నివారించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది గూడ్స్, టాక్సీలు, స్కూల్ బస్సులపై సరికొత్త నిబంధనను తీసుకవచ్చిందన్నారు. ఆయా వాహనాలకు తప్పక స్పీడ్ గవర్నర్ పరికరాన్ని ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణకు స్పీడ్ గవర్నర్ ఎంతగానో దోహదపడుతుందన్నారు.

కొత్తగా వాహనాలను విక్రయించే షోరూం యజమానులు ఇకపై స్పీడ్ గవర్నర్ మిషన్‌ను బిగించి అమ్మకాలు జరపాలని డీటీవో సూచించారు. అనంతరం న్యాయవాద సంఘం అధ్యక్షుడు గుడిపూడి తాజుద్దీన్ బాబా మాట్లాడుతూ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలోనూ ఇటువంటి కార్యక్రమాలను చేపడుతామన్నారు. అనంతరం న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కే.వినోద్‌కుమార్ కోర్టు ఎదుట చేపట్టిన వాహన పొల్యూషన్ స్పెషల్ డ్రైవ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు వాహనాలకు స్వయంగా పొల్యూసన్ చెక్ చేసి ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎన్.అనితారెడ్డి, రుబీనా ఫాతిమా, సౌమ్యా, ట్రాపిక్ ఏసీపీ సదానిరంజన్, సీనియర్ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్ శంకర్ నాయక్, ఏఎంవీఐ కిషోర్‌బాబు, సివిల్, ట్రాఫిక్ పోలీసులు చిట్టిబాబు, సురేందర్, ఆర్టీఏ కానిస్టేబుళ్లు నిశ్చల, బానోతు సరిత, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

310
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles