వందేళ్ల నిరీక్షణపై..కదిలిన యంత్రాంగం

Wed,June 19, 2019 02:10 AM

సత్తుపల్లి నమస్తే తెలంగాణ/పెనుబల్లి : “వందేళ్ల తర్వాత భూ సర్వే జరిగినా ఫలితం శూన్యం” అనే శీర్షికన ధర్మగంటలో ప్రచురితమైన వార్తా కథనానికి స్పందించిన శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య మాజీ డీసీసీబీ ఛైర్మన్‌ మువ్వా విజయ్‌బాబుతో కలిసి తాళ్లపెంట రెవెన్యూ గ్రామస్తులతో కలిసి మంగళవారం జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాళ్లపెంట రెవెన్యూ గ్రామంలో భూ సమస్యల గురించి కలెక్టర్‌కు వివరించారు. వంద సంవత్సరాల అనంతరం సర్వే చేసినప్పటికీ భూ రికార్డుల ప్రక్షాళనలో తాళ్లపెంట రెవెన్యూ రైతులకు న్యాయం జరగలేదని తెలిపారు. తాళ్లపెంట రెవెన్యూ పరిధిలోని చిన్న, సన్నకారు రైతులు ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్నారని, రైతుబంధు, రైతు బీమా పథకాలు వీరికి అందక తీవ్రంగా నష్టపోతున్నారని కలెక్టర్‌కు వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ ఈ సమస్యను త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని, సీసీఎల్‌ఏలో చర్చించి అనుమతి రాగానే పాసు బుక్కులు త్వరితగతిన అందిస్తామని, సమస్యను త్వరగా పరిష్కరించేందుకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ సోమరాజు రామప్ప, ఏఎంసీ చైర్మన్‌ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, కోపరేటీవ్‌ ఉపాధ్యక్షుడు మరకాల నరోత్తమరెడ్డి, తాళ్లపెంట రెవెన్యూ సమితి కన్వీనర్‌ ఏట్కూరు నర్సింహారావు, కర్రాలపాడు సర్పంచ్‌ మల్లయ్య, నాయకులు కనగాల వెంకటరావు, చీకటి రామారావు, బాణోతు క్షత్రియ, కనగాల సురేశ్‌ తదితరులున్నారు.

247
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles