రైతాంగ సమస్యల పరిష్కారమే ధ్యేయం

Wed,June 19, 2019 02:11 AM

మయూరిసెంటర్‌, జూన్‌ 18: రైతులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండకూడదనే ఉద్దేశంతోనే భూప్రక్షళణను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలను రాష్ట్రంలోని రైతులందరికీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అందిస్తున్నారని అన్నారు. కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి ప్రాంతాల రైతుల సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల రైతులకు సంబంధించిన భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అక్కడి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ను కలిశారు. రైతులను కూడా వెంట తీసుకొని వచ్చి వారి వారి సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించారు. అయితే ఆయా వినతులను పరిశీలించిన కలెక్టర్‌.. వాటి పరిష్కారానికి కృషిచేస్తామని అన్నారు. తరువాత కలెక్టరేట్‌ ఆవరణలో ఎమ్మెల్యే సండ్ర విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెవెన్యూ, అటవీ శాఖల అధికారుల సమన్వయ లోపం వల్ల పెనుబల్లి మండల రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాల జారీలో జాప్యం జరిగిందని అన్నారు.

వరుస ఎన్నికల కారణంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం కూడా ఒక కారణమని చెప్పారు. అయితే రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. పెనుబల్లి మండలంలో మండాలపాడు, లంకపల్లి, గొల్లగూడెం, ఎరుగట్ల, రామచంద్రాపురం రెవెన్యూ గ్రామాలలో గతంలో ప్రభుత్వం నుంచి అసైన్డ్‌ పట్టాలు పొందిన దళిత, గిరిజన రైతులకు ఇప్పుడు కొత్త పాసుపుస్తకాలను సంబంధిత అధికారులు ఇవ్వలేదని అన్నారు. 1952లో నిర్ణయం ప్రకారం ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన ఉన్న ఫారెస్ట్‌లో రోడ్డుకు ఇరువైపులా 200 మీటర్ల పొడవునా ఉన్న భూమిని రెవెన్యూ విభాగానికి అప్పగించిన భూమిలో 1958, 1976 సంవత్సరాల్లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆయా గ్రామాల్లో పేద రైతులకు అసైన్‌మెంట్‌ పట్టాలు ఇచ్చారని గుర్తుచేశారు. 1977-81 సంవత్సరంలో మరికొంత భూమిని రిజర్వు చేసి ఫారెస్ట్‌ నుంచి రెవెన్యూ విభాగానికి అప్పగించిన భూములలో కూడా అసైన్‌మెంట్‌ పట్టాలు ఇచ్చారని అన్నారు. ఆయా భూముల వివరాలను పహాణీల్లోనూ, ఇతర రికార్డుల్లోనూ రెవెన్యూ అధికారులు నమోదు చేశారని గుర్తుచేశారు. తరువాత ఆర్‌ఓఆర్‌ చట్టం ప్రకారం రైతులందరికీ పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారని, ప్రస్తుతం ఉన్న బీ రికార్డులలో కూడా ఈ భూములు సదరు పట్టాదారుల నమోరై ఉన్నాయన్నారు.

గత 50 ఏళ్లుగా పట్టాలు పొంది ఉండి, స్వాధీనత కలిగి ఉండి, సాగు చేసుకుంటూ ఉండి, ఆర్‌ఓఆర్‌ పాసుపుస్తకాలు ఉండి ఉన్న భూములకు రెవెన్యూ అధికారులు నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వడంలేదని ఆరోపించారు. అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలు చెప్పారన్న సాకుతో ఈ భూములకు పట్టాలు ఇవ్వకపోవడం తగదని అన్నారు. ఏరుగట్ల, రామచంద్రాపురంలో ఫారెస్ట్‌, రెవెన్యూ సరిహద్దుకు సంబంధించిన అంశంపై అభ్యంత్రాలు చెబుతూ గ్రామ రైతులకు పాసుపుస్తకాలు ఇవ్వలేదని ఆరోపించారు. తాళ్ళపెంట గ్రామంలో రెవెన్యూకు సంబంధించిన భూమికి పట్టా నెంబర్లు కేటాయించేందుకు సుమారు 1600 ఎకరాలకు ఇప్పటికే సర్వే పూర్తయిందని అన్నారు.

తాళ్లపెంట, గంగదేవీపాడు, కర్రాలపాడు, బ్రహ్మాలకుంట గ్రామాలలో కూడా ఇదే తరహా సమస్యలు ఉన్నాయని అన్నారు. దీంతో పాటు పెనుబల్లి మండలానికి చెందిన పెనుబల్లి, లింగగూడెం, గౌరారం, భవనపాలెం గ్రామాలకు చెందిన గిరిజనేతర పట్టాదారుల వారసులకు వారి పేర్లు మార్పు చేసి పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వలేదని ఆరోపించారు. కొంతమంది గిరిజన రైతులకు కూడా ఇంకా పట్టాదారు పాస్‌పుస్తకాలు అందలేదని అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించి రైతులకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను విన్నవించినట్లు చెప్పారు. కలెక్టర్‌ స్వయంగా రైతుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారని అన్నారు. ఆయా రైతుల సమస్యల పరిష్కారం కోసం ట్రైనీ ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా రైతుల వద్దకు పంపిస్తానని కలెక్టర్‌ పేర్కొన్నట్లు సండ్ర తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతుకూ నష్టం జరగదని సండ్ర, మువ్వా పేర్కొన్నారు. మండలాల రైతులు పాల్గొన్నారు.

302
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles