డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను..వేగవంతంగా పూర్తిచేయాలి

Thu,June 20, 2019 01:57 AM

-ఎర్రుపాలెం నుంచి ఇసుకను తెప్పించాలి
-ఆగస్టు 15లోగా వైఎస్‌ఆర్ కాలనీని ప్రారంభించాలి
-దసరా నాటికి టేకులపల్లి కాలనీలు పూర్తికావాలి
-డబుల్ ఇళ్ల నిర్మాణాల సమీక్షలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్
-సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభోత్సవాలు
-ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ వెల్లడి
ఖమ్మం, జూన్ 19 (నమస్తే తెలంగాణ): జిల్లాలో డబుల్ బెడ్ రూం గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి ఖమ్మం నియోజకవర్గంతోపాటు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న డబుల్ బెడ్‌రూమ్ గృహ నిర్మాణాల పురోగతిపై బుధవారం కలెక్టర్ సమీక్షించారు. మొదటగా ఖమ్మం నియోజకవర్గానికి మంజూరైన గృహాలలో ఇప్పటికే పనుల మొదలు పెట్టిన, ఇంకా మొదలు పెట్టవలసిన, ఇప్పటికే పూర్తి చేసిన గృహ నిర్మాణాలపై కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో వైఎస్‌ఆర్ నగర్, టేకులపల్లి, బుర్హాన్‌పురం, నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న గృహ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గృహ నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ఎర్రుపాలెం ఇసుక రీచ్ నుంచి సరఫరా చేయాలని, ఇసుకను తరలించే ట్రాక్టర్లకు విధిగా డబుల్ బెడ్ రూమ్‌లకు తరలిస్తున్నట్లు ప్రత్యేకంగా ఫ్లెక్సీలను అమర్చాలని కలెక్టర్ సూచించారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ, సర్వశిక్షా అభియాన్ ద్వారా చేసడుతున్న గృహ నిర్మాణాలకు అవసరమైన స్థల సేకరణకు సంబంధిత తహసీల్దార్‌లతో సంప్రదించి సత్వరమే స్థల కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వైఎస్‌ఆర్ కాలనీలోని గృహ సముదాయాలలో ఆగస్టు 15లోగా గృహ ప్రవేశాలు చేయించే విధంగా, టేకులపల్లిలోని గృహ సముదాయాలలో దసరా రోజున గృహ ప్రవేశాలు చేయించే విధంగా పూర్తి వసతులతో సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

ఇంకా 1240 ఇళ్లు పూర్తి కావాలి: అజయ్
ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఇంకా 1240 గృహాలు పూర్తి కావాల్సి ఉన్నాయని ఖమ్మం శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఇసుక సమస్య వల్ల గృహ నిర్మాణాలలో అలసత్వం జరిగితే.. సత్వరమే ఇసుక సరఫరాకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఇప్పటికే గృహ నిర్మాణాలు పూర్తి చేసిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా తాగునీటి వసతి, సీసీ రోడ్లు, విద్యుత్ వంటి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు. టేకులపల్లిలోని గృహ సముదాయాలలో దసరా మహోత్సవం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్‌తో గృహ ప్రవేశాలు జరిపేందుకు నిర్ణయించామని అన్నారు. తదనుగునంగా నిర్దేశిత గడువులోగా అన్ని హంగులతో గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మల్లెమడుగు, ధంసలాపురం, రఘునాధపాలెం, బుర్హాన్‌పురం, కైకొండాయిగూడెం గృహ నిర్మాణ పనులను కూడా వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులను కోరారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, పంచాయతీరాజ్ ఎస్‌ఈ బీ.సీతారాములు, ఆర్‌అండ్‌బీ ఈఈ కే.శ్యాంప్రసాద్, భూగర్భగనుల శాఖ ఏడీ సంజయ్‌కుమార్, టీఎస్‌ఎండీసీ ప్రాజెక్టు అధికారి ఎల్లయ్య, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ జీఎస్ కోటిరెడ్డి, ప్రజా రోగ్య శాఖ ఈఈ రంజిత్‌కుమార్, సర్వశిక్షా అభియాన్ ఈఈ రవికుమార్ తదితర ఇంజనీరింగ్ శాఖల అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

262
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles