మున్సిపాలిటీలో మహిళా ఓటర్లే అధికం

Fri,July 12, 2019 02:28 AM

సత్తుపల్లి, నమస్తే తెలంగాణ, జూలై 11 : సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల కసరత్తులో భాగంగా వార్డుల వారీగా స్త్రీ, పురుషుల ఓటర్లను సామాజికవర్గాల వారీగా కమిషనర్ వెంకన్న వెల్లడించారు. గతంలో 20 వార్డులు ఉండగా కొత్తగా మూడు వార్డులు వచ్చి చేరాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక ఎన్నికల అధికారితో పాటు ఎన్నికల తీరును వెల్లడించింది. అదే విధంగా ప్రతి పోలింగ్ బూత్‌కు 800 మంది ఓటర్లు ఉండే విధంగా బూత్‌లుకూడా అధికారులు గుర్తించారు. తాజాగా మొత్తం 23 వార్డులకు మొత్తం ఓటర్ల సంఖ్యతో పాటు, స్త్రీ, పురుష ఓటర్ల సంఖ్యను కులాల వారీగా కమిషనర్ వెల్లడించారు. మొత్తం 26, 471 మంది ఓటర్లున్న సత్తుపల్లి మున్సిపాలిటీలో మహిళా ఓటర్లదే అగ్రస్థానం. 12, 743 మంది పురుష ఓటర్లు, 13, 727 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. సామాజికవర్గాల వారీగా చూసినట్లయితే గరిష్టంగా 14, 254 మంది బీసీ ఓటర్లు ఉండగా అందులో 6821 మంది పురుషులు, 7433 మంది మహిళా ఓటర్లున్నారు. కనిష్టంగా 1580 మంది ఎస్టీ ఓటర్లు 835 మంది మహిళా ఓటర్లు, 745 మంది పురుష ఓటర్లు ఉన్నారు. 4, 133 మంది ఉన్న ఎస్సీ ఓటర్లలో 2168 మంది మహిళా ఓటర్లు, 1968 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఇతరుల జాబితాలో 3294 మంది మహిళా ఓటర్లు,3209 మంది పురుష ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సామాజికవర్గాల వారీగా చూసినప్పటికీ కూడా ప్రతి కులంలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటం విశేషం. నేటి వరకు రెండు పాలకమండళ్లు సత్తుపల్లి పురపాలకంలో ఏలుబడి సాగించగా రెండు పర్యాయాలు కూడా మహిళామణులే చైర్‌పర్సన్ పీఠాన్ని అధిష్టించారు. ఈసారి ఓటర్ల పరంగా ఎలా చూసినా సంఖ్యాబలం మహిళలదే కావడంతో చైర్‌పర్సన్ రిజర్వేషన్ ఏ విధంగా మారనుందనే అంశం రాజకీయ విశ్లేషకుల్లో చర్చానీయాంశంగా మారింది. తొలి పాలకమండలిలో చైర్‌పర్సన్ స్థానం ఎస్టీ మహిళను వరించగా, రెండో సారి బీసీ మహిళకు రిజర్వు అయింది. మూడో సారి జరగనున్న ఎన్నికల్లో రిజర్వేషన్ ఏ సామాజికవర్గానికి దక్కుతుందనే మీమాంస రాజకీయ వర్గాల్లో నెలకొంది.

288
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles