సక్రమ దత్తతే ముద్దు

Fri,July 12, 2019 02:29 AM

ఖమ్మం వ్యవసాయం, జూలై 11: సంతానం కలగని దంపతుల చిరకాల కోరికను తీర్చేందుకు గాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల దత్తత ఇచ్చే ప్రక్రియను సులభతరం చేసింది. గతంలో ఉన్న మ్యాన్‌వల్ పద్ధతికి స్వస్తి పలికి ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో చట్ట ప్రకారం పిల్లలను దత్తత తీసుకునేందుకు గాను సంబంధిత తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నారు. వక్రమార్గాన చీకటి ఒప్పందాలతో చిన్నారులను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు, ముక్కుపచ్చలారని చిన్నారులు సైతం భవిష్యత్తులో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక వైపు స్త్రీ శిశు సంక్షేమశాఖ, అనుబంధ శాఖల అధికారులు అనేక రకాలుగా అవగాహన కల్పించినపప్పటికీ అక్కడక్కడ అక్రమ దత్తతలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం కఠినమైన చట్టాలను రూపొందించింది. పిల్లలు లేని తల్లిదండ్రుల కోరిక తీర్చేందుకు సైతం ప్రభుత్వం చట్టపరమైన దత్తత ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. నాలుగు గోడల మధ్య చేసుకున్న ఒప్పందం కొద్ది కాలం తర్వాత బయటపడుతుండటంతో అటు జన్మనించిన తల్లులే కాకుండా పెంచుకున్న తల్లులు సైతం ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అభం, శుభం తెలియని చిన్నారులు అటు ఏతల్లి ఒడి చేరలేక చివరకు శిశుగృహకే చేరుకుంటున్నారు. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న మైదాన ప్రాంతంలోనే తరచూ అక్రమ దత్తతల సంఘటనలు వెలుగులోకి రావడం సైతం అందరిని నివ్వెరపాటుకు గురి చేస్తుంది. చట్ట ప్రకారం దత్తత తీసుకోక పోతే ఎదురయ్యే చిక్కులు, చట్ట ప్రకారం పిల్లలను దత్తత తీసుకునే పద్ధతిపై ఆయా ఐసీడీఎస్ అధికారులతో పాటు ఆయా స్వచ్ఛంద సంస్థలు సైతం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. పిల్లల దత్తత ప్రక్రియ మరింత సులభతరం చేసేందకుగాను ఐసీడీఎస్ గత కొద్ది కాలం క్రితం ఆన్‌లైన్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకరావడం జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా మంచి ఆదరణ కనపడుతుంది. తద్వారా అక్రమ దత్తత ప్రక్రియకు చెక్ పెట్టి నైట్లెంది.

నేటి వరకు 180 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు...
జిల్లాలో శిశుగృహ ఏర్పాటు నుంచి నేటి వరకు జిల్లా వాసుల నుంచి దాదాపు 180 మంది తల్లిదండ్రులు చట్టప్రకారం దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. వీరిలో ఇప్పటికే 49మంది దంపతులకు చట్టప్రకారంగా పిల్లలను దత్తత ఇవ్వడం జరిగింది. 2008 సంవత్సరంలో పిల్లల దత్తత కోసం 15 మంది దంపతులు దరఖాస్తు చేసుకున్నారు. అదే విధంగా 2009 సంవత్సరంలో 6 మంది, 2010 సంవత్సరంలో 13 మంది, 2011 సంవత్సరంలో ఆరుగురు, 2012 సంవత్సరంలో నలుగురు, 2013 సంవత్సరంలో ఏడుగురు చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. అదే విధంగా 2014 సంవత్సరంలో 12 మంది, 2015 సంవత్సరంలో 12 మంది, 2016 సంవత్సరంలో 26మంది, 2017 సంవత్సరంలో 29 మంది, 2018 సంవత్సరంలో 37 మంది దంపతులు పిల్లల కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 2019 సంవత్సరానికి గాను నేటి వరకు 12 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో కొందరికి ఇప్పటికే శిశుగృహలో ఉన్న పిల్లలను చట్ట ప్రకారంగా దత్తతను ఇచ్చారు. మిగిలిన వారికి సీనియారిటి ప్రకారంగా పిల్లలను దత్తత ఇవ్వడం జరుగుతుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

అక్రమ దత్తతతో అనేక చిక్కులు..
అక్రమ పద్ధతిలో పిల్లలను దత్తత తీసుకోవడం ద్వార అనేక ఇబ్బందులను చవిచూస్తున్న ఉదాంతాలు అనేకం. కుటుంబంలో పొరపచ్చలు రావడం, కొద్ది రోజుల తరువాత పెంచుకున్న తల్లితండ్రులకు సంతానం కలగడం, వంటి సంఘటనలు జరగడంతో పిల్లల భవిష్యత్‌కు భంగం కలుగుతుంది. ప్రైవేట్ వ్యక్తుల ద్వార పిల్లలను కొనుగోలు చేయడం వలన సదరు వ్యక్తులు ఏదో ఒక సమయంలో అసలు తల్లితండ్రులకు విషయం చేరవేయడంతో కథ అడ్డం తిరుగుతుంది. గతంలో జిల్లాలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. పిల్లలకు జన్మనిచ్చే అవకాశం లేకపోవడంతో పిల్లలను కొనుక్కుంటున్న తల్లితండ్రులు సదరు పిల్లల ప్రేమను పొందే సమయంలోనే తిరిగి దూరం కావడం పరిపాటిగా మారుతుంది. అక్రమ దత్తత బయటకు పొక్కడంతో అటు కన్నప్రేమకు, ఇటు పెంపుడు తల్లుల వడికి చేరుకోలేక చిన్నారులు శిశుగృహకు చేరుతున్నారు. పెద్దలు చేసిన తప్పిదాలకు అభం, శుభం తెలియని చిన్నారులు బాల్యంలోనే అనేక భాదలు పడాల్సిన పరిస్థితి కలుగుతుంది. తమ తోటి చిన్నారుల మాదిరిగానే అడుతూ పాడుతూ ఎదిగే చిన్నారులు హక్కులను కాలరాస్తున్న పెద్దలు అక్రమ దత్తతకు స్వస్తి పలికి చట్ట ప్రకారం దత్తత తీసుకోవాల్సిన అవసరం ఉంది.

దత్తత ప్రక్రియ ఇలా..
పిల్లలు లేని తల్లిదండ్రులకు ఆలోటు ఉండకూదనే ఉద్దేశంతో మహిళా శిశు సంక్షేమశాఖ దత్తత ప్రక్రియను ప్రవేశపెట్టింది. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో శిశుగృహలను ఏర్పాటు చేశారు. పిల్లలు లేని తల్లులకు గర్భశోకాన్ని నివారించడం, అనాథ పిల్లలకు తల్లిదండ్రులు లేని లోటును తీర్చేందుకుగాను ఈ సంస్థను నెలకొల్పారు. పుట్టినప్పటీ నుంచి 15ఏళ్ల వయస్సు గల బాలబాలికలను దత్తతకు అర్హులుగా ప్రకటించారు. గత కొద్ది సంవత్సరాల క్రితం వరకు ఈ ప్రక్రియ మ్యాన్‌వల్‌గా జరిగేది. అయితే దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులకు ఎక్కువ సమయం పడుతుందనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను ఆన్‌లైన్ చేశారు. దీంతో దత్తత ప్రక్రియ సులభతరం కావడమే కాకుండా తక్కువ సమయంలోనే పిల్లలను దత్తత తీసుకునేందుకు వెసులుబాటు కలిగింది. పిల్లలను దత్తత తీసుకోవాలనే తల్లిదండ్రులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో www.cara.nic.in లో అప్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు ఫారంతో పాటు భార్యభర్తల ప్రస్తుత ఫొటో, వారి వయస్సు ధ్రువీకరణ పత్రాలు, ఇంటిచిరునామా ( నివాస, ఆధార్‌కార్డులు, ఆదాయ ధ్రువీకరణ(1లక్షకు పైబడి ఉండాలి). ప్రభుత్వ ఉద్యోగులైతే వేతన ధ్రువీకరణ పత్రం, పాన్‌కార్డు, వివాహ ధ్రువీకరణ పత్రాలు జతచేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన అనంతరం ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపడుతారు. దత్తత తీసుకునే తల్లిదండ్రులకు ప్రత్యేక వైద్యపరీక్షలు చేయించుకొని ఫిట్‌నెస్ సర్టిఫికెట్స్‌ను అధికారులకు అందించాల్సి ఉంటుంది. పిల్లలను సదరు తల్లిదండ్రులకు ఇచ్చే సమయంలో పిల్లలకు సైతం వైద్యపరీక్షలు చేయించిన తర్వాతనే అందిస్తారు.

339
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles