మూడు నెలల్లో జలశక్తి పూర్తిచేయాలి

Sun,July 14, 2019 12:45 AM

కూసుమంచి, జూలై 13: జలశక్తి అభియాన్ పథకం మొదటి దశ పనులు రాబోయే మూడు నెలల్లో పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని ఆపథకం కేంద్ర బృంద సభ్యులు విజయ్‌ప్రకాష్, కుల్వంత్‌రాణా, రవినాథ్‌సింగ్‌లు జిల్లా అధికారులకు సూచించారు. జలశక్తి అభియాన్ పథకానికి ఎంపికైన కూసుమంచి మండలంలో శనివారం కేంద్ర బృంద అధికారులు పర్యటించి జలసంరక్షణ కార్యక్రమాలను పరిశీలించింది. తొలత మండల పరిధిలోని మునిగేపల్లి గ్రామానికి చేరుకొని చెరువును, పాలీహౌజ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా నీటిపారుదల శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే భూగర్భ జలాల అభివృద్ధికి చేపడుతున్న పనులను పరిశీలించారు. అనంతరం గ్రామ రైతు సత్యం తన పొలంలో ఏర్పాటుచేసిన డ్రిప్ ఇరిగేషన్‌ను పరిశీలించి రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అక్కడ నుంచి చేగొమ్మ గ్రామానికి చేరుకున్న అధికారులు రైతు మల్లయ్య ఏర్పాటు చేసిన ఫారంపాండ్‌ను కూడా పరిశీలించారు. రైతును అభినందించిన అధికారులు ఇతర రైతులు కూడా పారంఫాండ్‌లను ఏర్పాటు చేసుకునేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిధులు మంజూరు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

అనంతరం కిష్టాపురం పంచాయతీలో గ్రామస్తులు ఇండ్లలో నిర్మించుకున్న ఇంకుడుగుంతలను పరిశీలించారు. భూగర్భ జలాల మట్టం పడిపోకుండా ఈ ప్రాంత రైతులు విరివిగా చెట్లు పెంచేలా చైతన్య పర్చాలని జిల్లా, మండల అధికారులకు వారు సూచించారు. అనంతరం కూసుమంచిలోని శివాలయాన్ని అధికారులు సందర్శించి పూజలు చేశారు. అక్కడ నుంచి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు చేరుకొని హైడ్రాలజీ ద్వారా భూగర్భ జలాల లోతును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ప్రియాంక, డీఆర్‌డీఓ ఇందుమతి, ఏపీడీ విద్యాచందన, నీటిపారుదల శాఖ ఈఈ నర్సింహారావు, డీఈ అర్జున్, ఎంపీడీఓ కూసు వెంకటేశ్వర్లు, ఉద్యావన, ఉపాధి హామీ, వ్యవసాయశాఖల అధికారులు, గ్రామాల సర్పంచ్‌లు చెన్నా మోహన్‌రావు, పందిరి పద్మ, రమణ తదితరులు పాల్గొన్నారు.

240
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles